నాకు మొదటిగా గుర్తొస్తాయి

సరిగ్గా పన్నేండేళ్ళ క్రితం అంటే 2007లో వచ్చిన అతిథి సినిమాలో హీరోయిన్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించారు అమృతారావు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తరువాత మరో తెలుగు సినిమాలో ఆమె కనిపించలేదు. హైదరాబాద్ కి వచ్చిన అమృత తన తెలుగు సినిమా అనుభవం ను మీడియాతో పంచుకున్నారు.

అతిథి విశేషాలతో పాటుగా ఆ సినిమా అప్పుడు జరిగిన కొన్ని ఆశక్తికర విషయాలను ఇలా చెప్పుకొచ్చారు అమృతారావు. మ‌హేష్ తో చేసిన అతిథిలో నా కేర‌క్ట‌ర్ నాకు చాలా ఇష్టం. నా కేర‌క్ట‌ర్ మహేష్ తో సమానంగా ఆ సినిమాలో ట్రావెల్ చేస్తుంది. పైగా న‌మ్ర‌త‌, మ‌హేష్ నన్ను రిసీవ్ చేసుకున్న విధానం చాలా నచ్చింది.

అతిథి సినిమా ఎప్పుడు షూటింగ్ జ‌రిగిందో, ఎప్పుడు పూర్త‌యిందో అర్థం కానంత త్వ‌ర‌గా అయిపోయింది. న‌మ్ర‌త‌, మ‌హేష్ బాబు నన్ను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకునేవారు. తెలుగు సినిమా అని ఎవ‌రైనా అన‌గానే నాకు మొదటిగా మ‌హేష్ ఇల్లు, వాళ్లింటి నుంచి వ‌చ్చిన బ్రౌన్ రైసూ గుర్తుకొస్తాయి.

అతిథి షూటింగ్ హైదరాబాద్ లో జరిగిన ప్రతీసారీ మహేష్ ఇంటి నుంచే నాకు ప్రతీ రోజు భోజనం పంపించేవారు. అతిథి సినిమాలో నటిస్తున్నప్పుడు ఒకే నెలలో మూడు సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. అతిధి లో ఇంత మంచి పాత్ర చేసాక ఇంపార్టెన్స్ ఎక్కువ లేని ఏ పాత్ర నచ్చక ఒప్పుకోలేదు. అందుకే వేరే సినిమాలు ఏమీ ఒప్పుకోలేదు.

అతిథి లో నటించిన సంవత్సరం తరువాత హైదరాబాద్ లోనే లెజెండరీ డైరెక్టర్ శ్యాం బెనెగల్ గారి సినిమాలో నటించాను. హైదరాబాద్ తో నాకు చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి. హైదరాబాద్ అనగానే ఆంధ్రా వంటకాలు, మ‌హేష్ ఇంటి నుంచి వ‌చ్చిన బ్రౌన్ రైసూ గుర్తుకొస్తాయి అని చెప్పారు అమృతారావు.

మహేష్ నమ్రత దంపతుల ఆతిధ్యం చాలా బావుంటుందని కైరా అడ్వాణీ కూడా ఇటివలే తెలిపిన విషయం మనకు తెలిసిందే. కాని ఇక్కడ విశేషం ఏంటంటే అమృతారావు, కైరా అడ్వాణీ ఇద్దరికీ తెలుగులో మహేష్ తోనే మొదటి సినిమాతో పరిచయమయ్యారు. సూపర్‌స్టార్ పక్కన మొదటి సినిమా తో తెలుగు కి పరిచయం అయ్యే చాన్స్ ఎంతమందికి వస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ చిత్రానికి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది.

మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి, మహర్షి సూపర్ హిట్ తరువాత మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Share

Leave a Comment