హీరోయిసం ఎలివేషన్లు అన్నీ ఉంటాయి

మహర్షి సినిమాతో మాంచి ఊపు మీదున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దుమ్మురేపే కలెక్షన్లతో పాటు ప్రముఖుల ప్రశంసలను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

గత రెండు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ సారి మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయారు. ఇందుకోసం మహర్షి సెట్స్ పైన ఉండగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సరిలేరు నీకెవ్వరు. రష్మిక మందన కథానాయిక.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు అందరి అంచనాలను అందుకునేలా ఉండబోతుందని కొబ్బరి కాయ కొట్టిన రోజే ప్రేక్షకులకు చెప్పేసారు అనిల్ రావిఫూడి. తాజా మరో విషయం చెప్పారు ఆయన.

సరిలేరు నీకెవ్వరు లో హీరోయిసం ఎలివేషన్లు అన్నీ పుష్కలంగా ఉంటాయి. అన్నీ కూడా మహేష్ బాబు కు తగ్గ స్టైల్ లో ఉంటాయి. మహేష్ అభిమానులు కోరుకునే అంశాలన్నీ సినిమాలో ఉంటాయి. మహేష్ ను ఎలా చూడాలనుకుంటారో అలా ఉంటుంది సరిలేరు నీకెవ్వరు అని చెప్పారు అనిల్ రావిఫూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూనే ఉంటున్నారు రావిఫూడి.

రాజేంద్ర ప్ర‌సాద్‌ గారి పాత్ర గురించి కూడా ఎప్పుడో చెప్పేసారు. రాజేంద్ర ప్ర‌సాద్‌, మ‌హేష్ బాబు కాంబినేష‌న్‌లో మంచి స‌న్నివేశాలున్నాయి. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారికి, మ‌హేష్ బాబు గారికి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా నవ్విస్తాయి అని ఒక సినిమా ఫంక్షన్ లో చెప్పారు అనిల్ రావిఫూడి. మరిన్ని విషయాలు కష్మీర్ షెడ్యూల్ ముగిసాక మీడియాతో ఇలా చెప్పుకొచ్చారు ఆయన.

సరిలేరు నీకెవ్వరు ప్రథమార్ధం 20-25 నిముషాల సేపు కశ్మీర్‌లోనే ఉంటుంది. ఆర్మీ బేస్‌లో హీరో ఇంట్రడక్షన్‌ సీన్‌, కొన్ని కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. హీరో అక్కడ ప్రయాణం మొదలుపెట్టి ఇక్కడకు వస్తారు. మిలటరీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కశ్మీర్‌లో తీస్తేనే ఒరిజనల్‌ ఫీల్‌ వస్తుందని అక్కడకు వెళ్లాం. దాదాపు 20 రోజులు షూటింగ్‌ చేశాం.

సోనా మార్గ్‌, పెహల్‌గామ్‌, శ్రీనగర్‌ లొకేషన్లలోనే షూటింగ్‌ చేశాం. కథ ఫైనలైజ్‌ అయిన తర్వాత లొకేషన్ల గురించి ఆలోచిస్తున్నప్పుడు కశ్మీర్‌ ప్రస్తావన వచ్చింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఒక స్టార్‌ హీరోతో అక్కడ షూటింగ్‌ చేయడం రిస్క్‌ ఏమో అని మొదట మేం తటపటాయించాం. కానీ మహేష్ ఎంకరేజ్‌ చేశారు. కశ్మీర్‌ వంటి అందమైన ప్రదేశం లేదు. వేరే ఏమీ ఆలోచించకండి.

కశ్మీర్‌లోనే షూటింగ్‌ చేద్దాం అని సపోర్ట్‌ చేశారు మహేష్. ఆయనంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో మేం కూడా ధైర్యంగా ముందడుగు వేశాం అని చెప్పుకొచ్చారు అనిల్ రావిఫూడి. ఈ సినిమాలో విజయశాంతి గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ క్యాస్ట్ తోనే సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలను అమాతం పెంచేస్తున్నారు అనిల్ రావిఫూడి.

పరాజయం ఎరుగని మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మహేష్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అనే ఉత్సుకత అభిమానుల్లో విపరీతంగా ఉంది. మీడియం రేంజ్ హీరోలనే గూస్ బంప్స్ వచ్చేలా ప్రెజెంట్ చేసిన అనిల్ ఇక ప్రిన్స్ లాంటి మాస్ ఐకాన్ దొరికితే ఏ స్థాయిలో చెలరేగిపోతాడో అనేది వాళ్ళ అంచనా. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు.

Share

Leave a Comment