ఎవర్‌గ్రీన్ క్లాసిక్ గా

తెలుగు చలనచిత్ర రంగంలో కొన్ని చిత్రాలు చిరస్తాయి లో నిలిచిపోతారు. అవి ఒక బెంచ్‌మార్కుని సెట్ చేసి రాబోయే తరానికి పాఠ్య పుస్తకాలుగా నిలిచిపోయాయి. తెలుగు తెరపై ఎప్పటికి నిలిచిపోయే, చెదలు పట్టని పుస్తకంలా అనిపించే చిత్రాలలో “అతడు” తప్పకుండా ఉండి తీరుతుంది.

కథనం, మాటలు, దర్శకత్వం, హీరోయిజం, సంగీతం మరియు ఇతర సాంకేతిక బృందం సమిష్టి కృషి ఒక చిత్రాన్ని గొప్ప చిత్రంగా నిలబెట్టగలవు అని “అతడు” నిరూపించింది. ఈ చిత్రంలోని సంభాషణల గురించి మాట్లడుకోనివారు, వారి జీవితాల్లో జరిగే సంఘటనలకు వాటిని ఆపాదించుకొని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

అతడు కథ పెద్దగా చిక్కుముళ్ళు లేని కథే. మాములుగా అయితే ఎక్కడో ఒకటి రెండు సన్నివేశాల్లో తప్ప దర్శకుడు పెద్దగా మెదడుకి పని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ త్రివిక్రమ్ అణువణువునా మెదడు వాడారు. అందువల్ల ఈ చిత్రంలో ఏ ఒక్క సన్నివేశం బోరు కొట్టదు, అలాగని పరిమితి కుడా దాటదు.

ముఖ్యంగా పాత్రలు ఉన్న ప్రాంతాన్ని ఒక టైపు రైటర్ లో టైపు చేసిన విధంగా చూపించిన విధానం ఆ సమయం లో చాలా కొత్త ప్రయత్నం. ఈ పోకడ తరువాత చాలా చిత్రాల్లో అనేకమంది చేశారు. ముఖ్యంగా చిత్రం మొదట్లో ఒక వ్యక్తిని చంపి పారిపోతున్న నందు చిన్నప్పటి పాత్రను చూపిస్తూ వేసిన ప్రదేశం తాలూకు వివరం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది.

ఒక్కడు, అర్జున్ చిత్రాల తరువాత అంతకంటే పరిపూర్ణమైన నటనని మహేష్ నుండి రాబట్టగలిగారు త్రివిక్రమ్. తక్కువ మాట్లాడుతూ ఉండే నందు పాత్రని అద్భుతంగా పోషించాడు మహేష్. ఆ సంవత్సరం ప్రభుత్వం నుండి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం కూడా అందుకున్నాడు. కధానాయిక పాత్రని త్రిష చాలా బాగా పోషించింది.

గుహన్ ఛాయాగ్రహణానికి ఓ ప్రత్యేకత ఉంది. ఏ సన్నివేశంలోనూ ఏ రంగు ఎక్కువగా ఉన్నట్టు కనిపించదు. ఇంకా చెప్పాలంటే బ్లాక్ అండ్ వైట్ కి ఈస్ట్మెన్ కలర్ కి మధ్యలో ఉంటుంది. నందు తన గతం చెప్పిన తరువాత వచ్చే ట్రాలీ షాట్ చాలా బాగుంటుంది. మరో షాట్ విరామ సమయంలో వచ్చే షాట్.

మణిశర్మ అందించిన సంగీతం ఈ చిత్రాన్ని ప్రేక్షకులకి బాగా చేరువ చేసింది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సన్నివేశాలకి ప్రాణం పోసింది. నాయుడు చేత పొలం నుండి కంచె తీయించే సమయంలో వచ్చే పోరాట సన్నివేశం లోని నేపథ్య సంగీతం, ఆఖరులో నందు నిజం ఒప్పుకునే సన్నివేశం.. ఇక్కడ వచ్చే సంగీతం అన్నిటికంటే ఉత్తమ సంగీతంగా చెప్పొచ్చు.

అప్పటి వరకు హీరోయిజం అంటే పెద్ద పెద్ద సంభాషణలు, అరుపులు ఉండేవి..ఈ చిత్రం తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. త్రివిక్రమ్ లాంటి మాంత్రికుడు వాటితో మరింత మాయ చేశాడు. “అతడు” గురించి ఒక్క వాక్యంలో – “అతడు” తెలుగు చలనచిత్ర గ్రంథాలయంలో చెక్కు చెదరని, చెదలు పట్టని ఓ పుస్తకం.

Share

Leave a Comment