దూకుడు తెలియని కథ

శ్రీను వైట్ల ఫుల్ ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. మహేష్ బాబు తో ఫస్ట్ మీటింగ్. చాలా చెప్పాలనుకున్నాడు. కానీ ఏమీ చెప్పలేక పోతున్నాడు. ఫైనల్‌గా ఒకటే అన్నాడు మీతో బ్లాక్ బస్టర్ తీస్తాను! అయితే ఆ పనిలో ఉండండి అని చిలిపిగా నవ్వేశాడు మహేష్. 2009 డిసెంబరు నెల. మహేష్ కో కథ దొరికితే తప్ప మనసు శాంతించదు.

ఆస్థాన రచయిత గోపీ మోహన్‌తో కూర్చుని రకరకాల స్కెచ్‌లు వేస్తున్నాడు. కాన్సెప్ట్‌లు ఆలోచిస్తున్నాడు. మహేష్ తో పీరియాడికల్ మూవీ చేద్దామా? సడన్‌గా అడిగాడు శ్రీనువైట్ల. చాలా బావుంటుంది. మొన్నీ మధ్యనే తమిళంలో ఈ తరహా వచ్చాయి. ఆ ప్యాట్రన్ బాగుంటుంది. కానీ అది టైమ్ టేకింగ్ ప్రాసెస్ చెప్పాడు గోపీమోహన్.

ఒక్కసారి ట్రై చేస్తే తప్పేముంది? అన్నాడు శ్రీను వైట్ల. ఆయనలా అన్నాడంటే, ఇక పని మొదలు కావాలన్నట్టే! పని మొదలైంది. ఒకటి, రెండు లైన్లు అనుకున్నారు. నో యూజ్. ఇంకా కొత్తగా ఏదో ఆలోచించాలి. ఆ రోజు కె.రాఘవేంద్రరావు ఆఫీసు నుంచి డెరైక్ట్‌గా శ్రీను ఆఫీసుకు వచ్చాడు గోపీమోహన్. అతనో ట్రాన్స్‌లో ఉన్నాడు.

శ్రీనుగారూ! రచయిత జేకే భారవి గారు ఈ రోజు రాఘవేంద్రరావు గారికి రావణబ్రహ్మ కథ చెబుతుంటే వండర్ అయిపోయా. మీరొకసారి కలవాలి చెప్పాడు గోపీమోహన్. నెక్స్ట్ డే- శ్రీనువైట్ల, భారవి మీటింగ్. మైథలాజి కల్, హిస్టారికల్ థీమ్స్ గురించి డిస్కషన్. వీటిలో మహేష్ కి ఏది పనిచేస్తుంది? శ్రీను వైట్లకు ఇదే ఆలోచన.

మహేష్ ఖలేజా షూటింగ్‌లో ఉన్నాడు. శ్రీను వైట్ల రెగ్యులర్‌గా కలుస్తూనే ఉన్నాడు. అప్‌డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. శ్రీనుగారూ! మీకు ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నా. ఏదైనా నేను చేయడానికి రెడీ చెప్పేశాడు మహేష్. ఇది ఇంకా బర్డెన్. మహేష్ తో సినిమా అంటేనే విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్. అన్నీ రీచ్ కావాలంటే ఏదో ఒక అద్భుతం జరగాలి.

శ్రీను వైట్ల ఓ డెసిషన్‌కు వచ్చాడు. రైటర్స్ టీమ్‌ను పిలిచాడు. ఖలేజా బాగా డిలే అవుతోంది. ఈ టైమ్‌లో మనం ఎపిక్ మూవీ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. ఫ్రెండ్స్, డిస్ట్రిబ్యూటర్స్ కూడా మహేష్ తో హిలేరియస్ ఎంటర్‌టైనర్ చేయమంటున్నారు. ఇక నుంచి ఆ పనిలో ఉందాం. ఇక్కడో చిన్న చేంజ్! ఇప్పుడు ప్రొడ్యూసర్ 14 రీల్స్ వాళ్లు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర.

ఈ ముగ్గురూ శ్రీను వైట్లకు క్లోజ్‌ఫ్రెండ్స్. వెంకటేశ్ నమో వెంకటేశ సినిమాతో ప్రొడక్షన్‌లోకి ఎంటరయ్యారు. 14 రీల్స్ వాళ్లకు గోల్డెన్ చాన్స్. మళ్లీ అసలు కథలోకి వద్దాం. ఇక్కడ కథల వేటల కొనసాగుతోంది. శ్రీను బయట కథలు కూడా వింటున్నాడు. తెలుగు, తమిళం ఇలా ఏ లాంగ్వేజ్ రైటర్‌నీ వదలడం లేదు. ఏదీ వర్కవుట్ కావడం లేదు. శ్రీను లేటెస్ట్ సినిమా రిలీజై 75 రోజులై పోయింది.

ఇక్కడేమో ఒక్క ఇంచ్ కూడా డెవలప్‌మెంట్ లేదు. శ్రీనులో విపరీతమైన కసి. అలాంటి టైమ్‌లో గోపీ మోహన్ ఓ కాన్సెప్ట్ చెప్పాడు. శ్రీనువైట్లకు విపరీతంగా నచ్చేసింది. మహేష్ కూడా ఓకే. ఇప్పుడు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలి. చలో మహాబలేశ్వర్! నియరెస్ట్ ప్లేస్ టు పుణే. శ్రీను వైట్ల… రైటర్స్ గోపీ మోహన్, శ్రీధర్ సీపాన, కో-డెరైక్టర్ సూర్య ఇంకో ఇద్దరు.

పంచగని ఏరియాలో పెద్ద గెస్ట్ హౌస్. టూవీక్స్ పగలూ రాత్రీ డిస్కషన్స్ మీద డిస్కషన్స్. 80 శాతం సూపర్‌ గా వచ్చింది. లాస్ట్ ట్వంటీ పర్సెంట్ ఎపిసోడ్ ఎంతకూ తెగడం లేదు. అదే బాగా రావాలని శ్రీనువైట్ల పట్టు. విందు భోజనం పెట్టాలనుకున్నప్పుడు పప్పూ కూరలూ పచ్చడి, సాంబారే కాదు పెరుగూ కూడా అదిరిపోవాలి. శ్రీను వైట్లకు ఏం పాలుపోవడం లేదు, ఏదో ఒక చోట డెసిషన్ తీసుకోవాల్సిందే.

మహాబలేశ్వర్ లోకి శివాలయానికెళ్లాడు. ఆ గుళ్లోనే చాలా సేపు ఒంటరిగా కూర్చున్నాడు. బయటకు రాగానే డేరింగ్ డెసిషన్. ఈ కథ డ్రాప్. అందరూ షాక్. ఇదేమో మే నెల. జూలై కల్లా ఖలేజా అయిపోతే, ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కావాలి. అంటే 2,3 నెలల మించి టైమ్ లేదు. ఇప్పటి కిప్పుడు మళ్లీ కొత్త కథ చేసుకోవాలి. అందరిలోనూ టెన్షన్. కేబీఆర్ పార్క్‌లో వాకింగ్ చేస్తున్నాడు శ్రీను.

బాడీ కన్నా మైండ్ ఎక్కువ వాక్ చేస్తోంది. ఫ్లాష్‌లా ఓ ఐడియా. మహేష్ ని వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో ఎమ్మెల్యేలా చూపిస్తే? అని అనుకున్నాడు. ఆ ఆలోచనే చాలా కొత్తగా అనిపించింది. ఆఫీసులో మీటింగ్. ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే పి. జనార్దన్‌రెడ్డి తెలుసుగా! ఆయనో మంచి మాస్ లీడర్. ఆయన అంతిమయాత్రకు లక్షల్లో జనాలు వచ్చారు అని చెప్పుకుంటూ పోతున్నాడు శ్రీను.

ఏదైనా కాన్సెప్ట్ చెబుతాడను కుంటే పీజేఆర్ గురించి లెక్చర్ ఇస్తున్నా డేంటని టీమ్ మెంబర్స్‌లో కన్ ఫ్యూజన్. ఇదే మన కథ. హీరో తండ్రి పీజేఆర్ లాంటి ఇమేజ్ ఉన్న వ్యక్తి. హీరో కూడా ఎమ్మెల్యేనే కానీ కాదు. రియాల్టీ షోలాగా సినిమా నడవాలి అని కన్‌క్లూజన్ ఇచ్చేశాడు శ్రీను. ఆ టీమ్‌లో ఒకతను హుషారుగా విజిలేశాడు. శ్రీనుకు ఆ కథ స్టామినా అర్థమైపోయింది. స్క్రిప్ట్‌వర్క్ స్టార్ట్స్.

రాత్రి ఎనిమిదిన్నరకూ కూర్చొని తెల్లారేలోగా స్టోరీ కాన్సెప్ట్ రెడీ చేసేశారు శ్రీను వైట్ల, గోపీమోహన్. తర్వాత ఊటీ వెళ్లి ఫుల్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసేశారు. ఫెంటాస్టిక్… మైండ్‌బ్లోయింగ్… అన్‌బిలీవబుల్… కథ విన్నాక మహేష్ ఇమ్మీడియేట్ రియాక్షన్. డైలాగులు శ్రీను రాయడం మొదలుపెట్టాడు. అలాంటి టైమ్‌లోనే కోన వెంకట్ ఎంటరయ్యాడు. అగ్నికి ఆజ్యం తోడయ్యింది. డైలాగ్ వెర్షన్ కూడా మైండ్ బ్లోయింగ్.

కథకెంత టెన్షన్ పడ్డారో, టైటిల్‌కే అంతే టెన్షన్. పవర్ అని పెడితే బాగుంటుంది. ఆల్రెడీ ఎవరో రిజిస్టర్ చేసేశారు. ట్రెడ్‌మిల్ మీద రన్నింగ్ చేస్తుంటే వచ్చిందో టైటిల్… ‘దూకుడు’. ఫెంటా స్టిక్… మైండ్‌బ్లోయింగ్… అన్‌బిలీవబుల్. కాస్టింగ్ అంతా ఫైనల్. శ్రీనుకు తమన్ రెగ్యులర్ టచ్‌లో ఉంటున్నాడు. అతనికో చాన్స్ ఇద్దామా? రెండు సిట్యుయేషన్స్ చెప్పి టూ, త్రీ డేస్‌లో కలువ్ అన్నాడు శ్రీను.

ఆ సాయంత్రానికే తమన్ రెడీ. రెండు పాటలు చేసుకొచ్చాడు. నీ దూకుడు…, గురువారం మార్చి 1. తమన్ గోల్డెన్ చాన్స్ కొట్టేసాడు. హైదరాబాద్… ముంబయ్… బ్యాంకాక్… దుబాయ్ ఇలా చాలా ప్లేసుల్లో షూటింగ్. ఓ ఇంపార్టెంట్ ఎపిసోడ్‌కి మాత్రం ఎవరూ వెళ్లని ఫారిన్ లొకేషన్‌కు వెళ్లాలని ప్లానింగ్. ఇస్తాంబుల్ బ్యూటిఫుల్ సిటీ. కానీ ట్రాఫిక్ ఎక్కువ. షూటింగ్ చేయడం కొంచెం కష్టమే! అయినా ప్రొసీడైపోయారు.

ఫస్ట్ షెడ్యూల్ అక్కడే చేశారు. మహేష్ కి ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ డే షూటింగ్‌లోనే ప్రాజెక్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు కాన్సన్ట్రేషన్ మొత్తం దూకుడు మీదే! 150 రోజుల షూటింగ్. టాకీ పార్ట్ తీసింది 50 రోజులే. మిగతా 100 రోజులూ పాటలూ, ఫైట్లకే పట్టేసింది. మధ్యలో సినీవర్కర్స్ స్ట్రయిక్. దాంతో రిలీజ్ రెండు నెలలు డిలే! లెన్త్ కూడా ఎక్కువైపోయింది.

ట్వంటీ మినిట్స్ సినిమా ఎడిట్ చేసి పక్కన పెట్టారు. అయినా మూడు గంటలుంది. శ్రీను వైట్ల మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. రిజల్ట్ విషయంలో నో డౌట్. నో డైలమా. ఇది పక్కా బ్లాక్ బస్టర్. కళ్ళున్నవాడు ముందు మాత్రమే చూస్తాడు! దిమాక్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తాడు. ఇక్కడ శ్రీను వైట్లకు దిమాక్ ఉంది. అలాంటి కథకు మహేష్ లాంటి సూపర్‌ స్టార్ హీరో దొరికాడు. ఇంకేం రిజల్ట్ అలా ఇలా ఉండదు. ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో ఎమ్మెస్ నారాయణ క్యారెక్టర్ లేదు. అది లాస్ట్ మినిట్ యాడింగ్. 2011 సెప్టెంబరు 23న దూకుడు రిలీజైంది. మహేష్ తో బ్లాక్‌బస్టర్ తీయాలని శ్రీనువైట్ల మైండ్‌లో ఫిక్సయ్యాడు. అందుకే దూకుడు బాక్సాఫీస్ దగ్గర బ్లైండ్‌గా దూసుకుపోయింది. సరికొత్త రికార్డులు నెలకొల్పింది.

Share

Leave a Comment