గాన గాంధర్వుడికి అశ్రు నివాళి..!

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలు మరణంతో దేశవ్యాప్తంగా విషాద చాయలు అలుముకున్నాయి. హిందీతోపాటు దక్షిణాది భాషల్లో దాదాపు 50వేల పాటలు పాడి.. నటుడిగా సంగీత దర్శకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా బాలు పేరుపొందాడు. ఆయన మరణంతో దేశవ్యాప్తంగా అందరూ సంతాపం తెలుపుతున్నారు

కరోనాతో పోరాడి గెలిచి ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టడంతో బాలు మృతిచెందారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఎస్పీ చరణ్ మీడియాకు ప్రకటించారు

గానగంధర్వుడి మృతిని టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలక్రిష్ణ, మహేష్ బాబు సహా టాలీవుడ్ హీరోలు, సంగీత దర్శకులు, దర్శకులు బాలు మృతికి సంతాపం తెలిపారు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయన మధురమైన గొంతుకి దగ్గర్లోకి కూడా ఎవరూ రాలేరు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సార్. మీ కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన కుటుంబానికి ధైర్యం చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలియజేస్తున్నాను అన్నారు మహేష్ బాబు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు మనతో లేకపోయినా ఆయన పాడిన అద్భుతమైన పాటలతో మనతో కలిసే ఉంటారు. మన ఇండస్ట్రీకి ఆయన లేని లోటు తీర్చలేనిది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని సూపర్‌స్టార్ కృష్ణ గారు తెలిపారు

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దురదృష్టకర మరణంతో మన సాంస్కృతిక ప్రపంచం మూగబోయింది.. భారతదేశం అంతటా ఆయన శ్రావ్యమైన స్వరం మరియు సంగీతం దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆయన కుటుంబానికి సంతాపం తెలుపుతున్నా. ఓం శాంతి అంటూ మోడీ వ్యాఖ్యానించారు

ఏఆర్ రెహమాన్ సైతం బాలుతో ఫొటో పంచుకొని ఆవేదన చెందారు. తోటి గాయకులు కూడా ఆయన మరణంపై ట్వీట్లు చేశారు. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ సహా సినీ రాజకీయ ప్రముఖులంతా కూడా బాలు మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

పలువురు క్రీడా ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు. తెలుగు హిందీ తమిళం కన్నడ భాషల్లో కలిపి మొత్తం ఆరు సార్లు జాతీయ ఉత్తమగాయకుడిగా నిలవడం ఒక్క బాలు కే చెల్లింది. సంగీతంలోని అన్ని రకాల రాగాలలో సాంగ్స్ పాడిన బాలసుబ్రహ్మణ్యం భక్తి పాటలకు ప్రాణం పోశారు

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందించి అనంత లోకాలకు వెళ్ళిపోయిన మన గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మనమందరం ఆయనకు అశ్రు నివాళి అర్పిద్దాం

Share

Leave a Comment