మరికొన్ని గంటల్లో ముఖ్య అతిథిగా

మన దక్షిణ భారత దేశంలో మరో భారీ సినీ అవార్డుల కార్యక్రమానికి తెర లేవనుంది. అది కూడా మన హైదరాబాద్ లో. భారతీయ సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ 2019కి తెరలేపారు. దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖుల్ని ఈ సందర్భంగా సత్కరించనున్నట్లు దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ వారు ప్రకటించారు.

ఈ అద్భుతమైన వేడుకకు హైదరాబాద్‌లోని మాదాపూర్, ఎన్ కన్వెన్షన్ సెంటర్ వేదిక కానుంది. సెప్టెంబర్ 20న అంటే ఈ రోజు సాయంత్రం ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. సూపర్‌స్టార్ మహేష్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని దృవీకరిస్తూ దాదాసాహెబ్ ఫాల్కే సౌత్ అవార్డ్స్ వారు పత్రికా ప్రకటన విడుదల చేసారు.

సమంత, జగపతిబాబు, మోహన్‌బాబు, అనుష్క, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దేవిశ్రీప్రసాద్‌, బ్రహ్మానందం, నందిత శ్వేత, పాయల్‌ రాజ్‌పుత్‌, ఛార్మి, పూరి జగన్నాథ్‌, లక్ష్మి మంచు తదితర తారలు హాజరవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. బాలీవుడ్‌లో ఇటీవలే ఈ వేడుక జరిగింది. హైదరాబాద్‌లోనూ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం. సినీ తారలు, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరవుతారని నిర్వాహకులు ప్రకటనలో తెలిపారు.

హైదరాబాద్‌లో జరగబోయే ప్రెస్టీజియస్ దాదాసాహెబ్ సౌత్ అవార్డ్స్ వేడుక కోసం సినీలోకం ఎదురుచూస్తోంది. దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో టాప్ సినీ సెలెబ్రిటీస్‌తో పాటు రాజకీయ, వ్యాపార దిగ్గజాలు ప్రత్యేక అతిథులుగా పాల్గొనున్నారు. దక్షిణ భారతదేశ చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందిస్తున్న వారిని ప్రత్యేకంగా ఈ వేదికపై సన్మానించనున్నారు.

దీనికి సంబంధించిన ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి జరగబోయే ఈ వేడుకలకు మన సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య ఆకర్షణ అని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ వేడుకను ప్రత్యక్ష్యంగా వీక్షించాలనుకునే సినీ అభిమానుల కోసం ఆన్‌లైన్‌లో టికెట్లను అందుబాటులో ఉంచారు.

తెలుగు చిత్రసీమలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్నిరకాల ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసి సక్సెస్ అవుతుంటారు మహేష్. అందుకే తండ్రి లక్షణాలు అందిపుచ్చుకుంటూ తెలుగు తెరపై సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. సినిమా సినిమాకు క్రేజ్ పెంచేసుకున్న మహేష్ ఇటీవలే మహర్షితో 25 సినిమాలు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది. మహర్షి భారీ విజయం సాధించడంతో సరిలేరు నీకెవ్వరు పై రెట్టింపు అంచనాలు నెలకొన్నాయి. అభిమానుల అంచనాలు రీచ్ అయ్యేలా భారీ హంగులతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇండిపెండెన్స్ డే కానుకగా సరిలేరు నీకెవ్వరు నుంచి అదిరిపోయే వీడియో రిలీజ్ చేసి మహేష్ అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్.

చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు నటిస్తున్న కారణంగా ఈ పాటకు పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ విజయశాంతి దాదాపు 13 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్స్ లోకి రానుంది.

Share

Leave a Comment