కొనసాగుతున్న డైలమా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో జెట్ స్పీడ్ తో పూర్తవుతోంది. అనీల్ సుంకర- దిల్ రాజు- మహేష్ బాబు ఈ చిత్రానికి నిర్మాతలు. మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా స‌రిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రూపంలో పోస్టర్ తో సరిపెడతారు అనుకుంటే ఏకంగా ఇంట్రో పేరుతో వీడియోనే రిలీజ్ చేసి అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.

సరిలేరు నీకెవ్వరు విడుదలకి ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ అప్పుడే మహేష్ తరువాతి సినిమా మీద ఫిలిం సర్కిల్స్ లో అప్పుడే జోరుగా చర్చ నడుస్తుంది. ఈ సినిమా తర్వాత మహేష్ 27 ఛాన్స్ ఎవరికి అంటే ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఇంతవరకూ మహేష్ నటించే 27వ సినిమా స్క్రిప్టు ఫైనల్ అయ్యిందో లేదో కుడా తెలియదు. ఫలానా దర్శకుడితో సినిమా చేస్తాను అని మహేష్ ప్రకటించలేదు.

అయితే ఫలానా దర్శకుడితో కన్ఫామ్ అయినట్టే అని సామాజిక మాధ్యమాల్లో విస్త్రతంగా ప్రచారం సాగుతోంది. కానీ ఏదీ అధికారికంగా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మహేష్ తో సినిమా చేసేందుకు ముగ్గురు నలుగురు దర్శకులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా, పరశురామ్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు మహేష్ తో తదుపరి సినిమా చేసే వీలుందని వైరల్ గా ప్రచారం అవుతోంది.

అయితే చివరి నిమిషం వరకూ ఏదీ కన్ఫామ్ గా చెప్పలేని పరిస్థితి. ఎవరికి వారు స్క్రిప్టులు తయారు చేసి సూపర్‌స్టార్ ని మెప్పించే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. మహేష్ వాటిని విని ఫైనల్ చేసి ఖాయంగా సెట్స్ కెళుతున్నాం అని చెప్పే వరకూ ఇది కన్ఫామ్ అని చెప్పలేని సన్నివేశం నెలకొంది.

మరో పక్క అగ్ర నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ మహేష్ తో సినిమా చేయాలని పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్యే మైత్రి మూవీ మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించేసారు. కానీ దర్శకుడి పేరు మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఎవరికి ముందుగా మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.

ప్రస్తుతానికి సూపర్ స్టార్ దృష్టి మొత్తం సెట్స్ పై ఉన్న సరిలేరు నీకెవ్వరుపైనే. ఈ సినిమా పూర్తయితే కానీ ఏదీ ఖాయంగా చెప్పలేని పరిస్థితి. విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరు ఇంట్రోలో సూపర్ స్టార్ ఆర్మీ లుక్‌లో అద‌ర‌గొట్టేస్తున్నారు. మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్రలో మహేష్‌ లుక్ సూపర్. మహేష్ కి ఈ బ్యాక్ డ్రాప్ సినిమా ఎంచుకోవడం ఇదే మొదటి సారి.

వీడియో విషయానికి వస్తే మహేష్ ను బ్యాక్ షాట్ లో నుంచి చూపిస్తూ టేబుల్ మీద గాగుల్స్, వాకీ టాకీని చూపించి నెక్స్ట్ షాట్ లో సోల్జర్స్ బ్యాచ్ ని రివీల్ చేసి ఆపై స్టైలిష్ గా దర్జాగా దేశ రక్షణకు భద్రత ఇచ్చే మేజర్ అజ‌య్ కృష్ణ గా మహేష్ ఇచ్చిన ఎంట్రీతో రచ్చ మాములుగా లేదు. తన ట్రేడ్ మార్క్ వాకింగ్ స్టైల్ తో చంపేసాడు అంతే.

సరిలేరు నీకెవ్వరు..నువ్వెళ్ళే రహదారికి జోహారు..సరిలేరు నీకెవ్వరు..ఎనలేని త్యాగాలకు నువ్వే మారుపేరు అంటూ సాగిన లిరిక్స్ చాలా క్యాచీగా అదరగొట్టేలా ఉన్నాయి. భరత్ అనే నేను-మహర్షి తర్వాత హ్యాట్రిక్ మూవీగా ట్రేడ్ సైతం భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా నటిస్తున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ ఉన్నప్పటికి అది కొద్దీ సేపు మాత్రమే ఉంటుందట.

మిగతా దంతా ఎంటర్టైన్ మెంటే అంటున్నారు. బోర్డర్ లో శత్రువులతో పోరాడే ఇతను సీమకు ఎందుకు రావాల్సి వచ్చిందనే ఇంటరెస్టింగ్ పాయింట్ తో అల్లుకున్న కథగా ఇప్పటికే దీని గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సినిమాలో హీరోయిజంతో కూడిన యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి మార్క్ కామెడీ హైలైట్ గా నిలుస్తుందని టాక్.

మహేష్ ఈ సినిమా ఒప్పుకోవడానికి కూడా అదే రీజన్ అని తెలుస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరులో రాజేంద్ర ప్రసాద్, విజయశాంతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు ఈ ఒక్క వీడియోతో క్రేజ్ లో కూడా సాటెవ్వరు అనే తరహాలో ఉండటం విశేషం. సినిమా సినిమాకు తనను మరింత సానబెట్టుకుంటూ ప్రయోగాత్మక కథలతోనే అటు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తూనే బాక్సాఫీసును షేక్ చేయడం మహేష్ నైజం. మరి సంక్రాంతికి ఇంకెన్ని రికార్డులు సృష్టించనున్నాడో వేచి చూడాల్సిందే.

Share

Leave a Comment