ఒక రేంజ్‌లో దూసుకుపోతున్న మహర్షి

ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రం ‘మహర్షి’ నుంచి ఈ రోజు ఉదయం టీజర్ ను రిలీజ్ చేశారు. కాలేజ్ స్టూడెంట్ గా కొత్త లుక్ తో మహేష్ బాబు ఈ టీజర్ లో కనిపిస్తూ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించారు.

‘మహర్షి’ టీజర్‌కు టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 9.09 గంటలకు టీజర్ విడుదల చేయగా గంటలోనే 1 మిలియన్ డిజిటల్ వ్యూస్ సొంతం చేసుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించింది. దీనిని బట్టి ఈ సినిమా పట్ల అంతా ఎంత ఆసక్తితో ఉన్నారనే విషయం అర్థమవుతోంది.

మహేష్ బాబు సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో మరోసారి రుజువైనట్లయింది. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ చూసి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమాలో ఆయన్ను అలా స్క్రీన్ మీద చూస్తూ ఉండిపోవచ్చు అనేంతగా మహేష్ బాబు అందం ప్రేక్షకులను కట్టిపడేసింది.

కొన్ని గంటల్లోనే టీజర్‌కు ఇంత రెస్పాన్స్ రావడంతో చిత్ర నిర్మాతల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ మూవీ నిర్మాణ సంస్థల్లో ఒకటైన దిల్ రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ఈ హ్యాపీ మూమెంట్స్‌ను ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ రోజు నుండి రిషిగా నా జర్నీ మొదలైంది. మీరు నాపై చూపిస్తున్న అభిమానానికి, ప్రేమకు దాసోహం అయ్యాను అని మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ చిత్రం. సూపర్ స్టార్ ఇప్పటి వరకు చేసిన సినిమాలను మించిపోయేలా, ఒక గొప్ప ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోతుందనే అంచనాలు అభిమానుల్లో ఏర్పడ్డాయి. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ వారి అంచనాలను మరింత పెంచింది.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్‌ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానకి కేయూ మోహనన్‌ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వై జయంతి మూవీస్, పివిపి సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2019 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Leave a Comment