మహేష్‌కు డైరెక్టర్ రిక్వస్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరైన సమ్మోహనం ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. సమ్మోహనం చిత్ర యూనిట్ తో పాటు ఇతర అతిథులు చాలా మంది హాజరయ్యారు. మహేష్ తో రెండు బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించిన కొరటాల శివ, త్వరలో మహేష్ 25 వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్న వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, దిల్ రాజు వంటి ప్రముఖులంతా హాజరయ్యారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు హరీష్ శంకర్ ప్రసంగం ఆకట్టుకుంది. సూపర్ స్టార్ మహేష్ గురించి హరీష్ చెప్పిన మాటలు ఆయన అభిమానులని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వేదికపై హరీష్ మాట్లాడుతూ మహేష్ గురించి ఏమనుకుంటున్నారో డైరెక్టర్ కొరటాల శివ రెండు బ్లాక్ బస్టర్లలో చెప్పేశారు. నాకు ఆ అవకాశం రాలేదు కాబట్టి మాటల్లో చెబుతానంటూ మహేష్ లో తనకు బాగా నచ్చే క్వాలిటీ గురించి చెప్పుకొచ్చారు.

‘పోకిరి, బిజినెస్ మేన్ సినిమాల్లో మహేష్ నటనలో పూరి జగన్నాథ్ బాడీ లాంగ్వేజ్ & టైమింగ్ కనిపిస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో అడ్డాల శ్రీకాంత్ స్టయిల్ కనిపిస్తుంది. దూకుడులో శ్రీను వైట్ల టైమింగ్ కనపడుతుంది. కొరటాల శివ సినిమాల్లో సటిల్డ్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది.

త్వరలో వంశీ పైడిపల్లి స్టైల్ లో కనిపించబతోతున్నారు. ఏ డైరెక్టర్ సినిమా చేస్తే ఆ డైరెక్టర్ స్టయిల్ ని మహేష్ ఈజీగా అడాప్ట్ చేసుకుంటారు. ఈ విషయంలో ఆయనను పాదరసం అనేయొచ్చు. దర్శకుడు ఎలా కావాలంటే అలా మలచుకోవచ్చు. దూకుడు చిత్రంలో టైటిల్ సాంగ్ లోని పాదరస ఒరవడి నరనరమే అనే వాక్యం మహేష్ కు సరిగ్గా సరిపోతుంది’ అంటూ చెప్పుకొచ్చారు.

ఇంత చెప్పి ఫినిషింగ్ టచ్ గా ఏదో ఒకరోజు హరీష్ శంకర్ బాడీ లాంగ్వేజ్ లో కూడా మహేష్ ను ఓ సినిమాలో చూడాలని అనుకుంటున్నానని ఓపెన్ గా అడిగేశారు. దీనికి మహేష్ తనకు అలవాటయిన స్మయిల్ తో అలాగే కనిపించారు. హరీష్ అడిగిందానికి ఓకే అంటారా, ఏమో వేచి చూడాలి మరి.

సమ్మోహనం ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరైన మహేష్ తన సరికొత్త లుక్ తో అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. లుక్ పరంగా తన 25వ సినిమా కోసం డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్. ఈ లుక్ లో మహేష్ మరింత అందంగా కనిపిస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సుధీర్ బాబు, అదితిరావు జంటగా నటించిన మూవీ సమ్మోహనం. మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 10గా తెర‌కెక్కిన ఈ మూవీ ఈ నెల 15న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Share

Leave a Comment