సూపర్‌స్టార్ ఖాతాలో మరో కొత్త రికార్డు

అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు దక్షిణ చిత్ర పరిశ్రమలోనే కాదు, ఉత్తర భారతదేశం మరియు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ ఉంది. అందుకే ప్రపంచంలోనే అత్యంత అందగాడి జాబితాలో మహేష్ టాప్‌ 10లో చాలా సార్లు స్థానం సంపాదించుకున్నారు.

సినిమాల కలెక్షన్లలోనూ ఇదే హవా కనిపిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవల విడుదలైన ‘భరత్‌ అనే నేను’ ఆ విషయాన్ని మరోసారి నిరూపించింది. ‘భరత్‌ అనే నేను’ 2018లో తెలుగులో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్‌ పరంగా ఈ సినిమా నాన్‌ ‘బాహుబలి’ రికార్డు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

భరత్‌ అనే నేను తెలుగు శాటిలైట్‌ హక్కులు ఇప్పటికే భారీ మొత్తానికి అమ్ముడు పోయాయి. ఇక ఇప్పుడు భరత్‌ అనే నేను హిందీ డబ్బింగ్ శాటిలైట్‌ హక్కులు కోసం చాలా చానెల్స్ పోటీ పడినట్లు సమాచారం. శాటిలైట్‌ హక్కుల పరంగా ఆల్‌టైమ్‌ రికార్డును (‘బాహుబలి’ని మినహాయించి) సృష్టించింది భరత్‌ అనే నేను హిందీ డబ్బింగ్.

మొత్తం రూ.22 కోట్లకు ఓ ఛానెల్‌ హక్కుల్ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఓ తెలుగు సినిమా హక్కుల్ని ఇంత మొత్తానికి ఓ హిందీ చానెల్ కొనడం విశేషమని విశ్లేషకులు అంటున్నారు. తెలుగు సినిమాల పరంగా తీసుకుంటే (‘బాహుబలి’ మినహాయించి) ఇది అత్యధిక ధర అని చెబుతున్నారు.

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మహేష్ హిందీలో ఎంత పాపులర్ అంటే ఆయన గత చిత్రాలన్నిటికి కూడా ఆ చానెల్స్‌లో మంచి టి.ఆర్.పి లను సొంతం చేసుకున్నాయి. అందుకే అంత ధర పెట్టడానికి కూడా వారు వెనకాడలేదు.

‘భరత్ అనే నేను’ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. ‘శ్రీమంతుడు’ హిట్‌ తర్వాత మహేష్-కొరటాల కాంబినేషన్లో వచ్చిన చిత్రమిది. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ ఈ సినిమాతో కథానాయికగా పరిచయం అయ్యారు. మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించారు.

ఈ నెల డెహ్రాడూన్‌లో మహేష్ 25వ సినిమా తొలి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. వచ్చే నెల వరకూ అక్కడే చిత్రీకరణ జరగనుందని సమాచారం. ఈ మూవీని అశ్వనీదత్‌, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌ గా నటించనుంది.

Share

Leave a Comment