ఇలాంటి స్టార్‌ని చూడలేదు

సామాన్యంగా సినిమా ఫీల్డ్ లో పొగడ్తలు మామూలే కాబట్టి అందరు స్టార్ హీరోలను, దర్శకులను పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు. ఇక స్టార్స్ పక్కన చాన్స్ వస్తే హీరోయిన్లు ఇక వారి గురించి చెప్పిందే చెబుతుంటారు. అయితే కొందరి విషయాలలో మాత్రం అవి పొగడ్తలు కావు. అవి నిజాలే అని నమ్మబుద్ది అవుతోంది. అలాంటి విషయం గురించే మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కైరా అద్వానీ చెప్పారు.

మహేష్ కేవలం తన సీన్స్ వరకు చేసి కామ్ గా ఉండరు. ప్రతి సన్నివేశం బాగా రావాలంటే తానొక్కడి నటనే కాదు అందరు బాగా నటిస్తేనే సీన్ పండుతుందనే ఉద్ధేశ్యంతో తన కాంబినేషన్ లో లేని సీన్స్ ని కూడా మానిటర్ లో చూసి, దర్శకుడు కొరటాల శివ ఆలోచనలకు అనుగుణంగా సీన్స్ బాగా వస్తున్నాయా లేదా? అని గమనిస్తూ ఉంటారట. క్లోజప్ షాట్స్ ని కూడా మానిటర్ లో చూసి అవసరమైన వారికి తగు సూచనలు కూడా ఇస్తుంటారని కైరా అద్వానీ తెలిపింది.

ఇక మహేష్ షూటింగ్ లో ఎంతో సరదాగా, జోక్ వేస్తూ బాగా కలుపుగోలుగా ఉంటారని కూడా అంటారు. దాని గురించి కైరా మాట్లాడుతూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసి, ఎంత కష్ట పడినా కూడా సాయంత్రం మహేష్ వేసే ఒకే జోక్ తో తామంతా రిలాక్స్ అయిపోతామని, మహేష్ వంటి స్టార్ హీరోని చూడలేదు.

మహేష్ ఉంటే సెట్ లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆయన పాత్రల్లో లీనమయ్యే తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తోందని కైరా అద్వానీ బోలెడు కబుర్లు చెప్పారు. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు సినిమా అంటే ఉండే క్రేజు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడిని చూడటానికే వెంపర్లాడిపోతారు అభిమానులు. సినిమా సంగతి తర్వాత, అతగాడు తెర మీద కనిపిస్తే చాలు అన్నట్టుగా ఉంటుంది వారి పద్ధతి.

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న కెరీర్లోని ప్రతిష్ఠామకమైన 25వ సినిమాలో న‌టిస్తున్నారు మ‌హేష్ బాబు. తన కెరియర్ లో 25వ సినిమా కాబట్టి మహేష్ కూడా ఈ సినిమా గురించి చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఈ సినిమాలో ఇప్పటిదాకా కనిపించని విధంగా కొత్త లుక్ లో కనబడబోతున్నారు మహేష్. కొత్త సినిమా కోసం గడ్డం, మీసం పెంచి డిఫరెంట్‌ గెటప్‌లోకి దిగిపోయారు మ‌హేష్

ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ‘అల్లరి’ నరేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్, 2019న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. దిల్ రాజు, అశ్వినీ దత్ సంయుక్తంగా కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment