మహర్షి తొలి అడుగు

గతేడాది బ్లాక్ బస్టర్ అందుకున్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరియర్లోనే 25వ చిత్రం గా తెరకెక్కనున్న ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.

దుబాయ్‌లో పాటల్ని తెరకెక్కించబోతున్నారు. విడుదలకు ఇంకా కొన్ని వారాలు మాత్రమే సమయం మిగిలి ఉండటంతో, చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూర్చిన ఈ చిత్ర గీతాల కోసం సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ను (తొలి గీతం) ఈ నెల 29న విడుదల చేయబోతున్నట్లు దేవిశ్రీప్రసాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. దీంతో మహర్షి ప్రమోషన్ కార్యక్రమాలకు తొలి అడుగు పడబోతున్నదని మహేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సినిమా ప్రమోషన్స్ తో దర్శక నిర్మాతలు కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారని టాక్. మే నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో మహేష్‌బాబు కాలేజీ విద్యార్థిగా, కంపెనీ సీ.ఈ.ఓ గా భిన్న పార్వాల్లో సాగే పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

విద్యావంతుడు, ఆదర్శభావాలు కలిగిన యువకుడు పల్లె బాట ఎందుకు పట్టాల్సి వచ్చిందనే పాయింట్ సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు. కుటుంబ అనుబంధాలు, సామాజిక సమస్యల నేపథ్యంలో రూపొందిస్తున్న ఎమోషనల్ డ్రామా ఇదని చిత్ర బృందం చెబుతున్నది.

మొదటి పాట విడుదల అయ్యేవరకు ఈ క్యూట్‌ జూనియర్స్‌ ల వీడియోను ఎంజాయ్‌ చేయండంటూ మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యా, మహేష్ బాబు గారాలపట్టి సితారలు తనకు డాన్స్‌ నేర్పిస్తున్నారంటూ వీడియో షేర్‌ చేశాడు దేవిశ్రీప్రసాద్.

చెన్నైలో మహర్షి షూటింగ్‌ జరుగుతున్న సమయంలో సితార, ఆద్యలతో దేవిశ్రీ కొంత సమయం గడిపిన సంగతి తెలిసిందే. తన మ్యూజిక్‌తో వారిని మెప్పించే ప్రయత్నం చేశానని, చిన్నారులు ఎంతో నవ్వించారని ఆయన తెలిపారు. కాగా అప్పుడు తీసిన ఆ వీడియోను దేవిశ్రీ ఇప్పుడు షేర్ చేసారు..

ఇందులో ఆయన ‘శ్రీమంతుడు’లోని ‘చారుశీల..’ పాట పాడుతుంటే సితార, ఆద్య ఉత్సాహంగా డ్యాన్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ధి సోషల్ మీడియా. సితార కి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు..సితార కి సంబందించిన ఏ వార్త వచ్చినా అది వైరల్ అవ్వడం ఖాయం. అంత ఫ్యాన్ బేస్ సితార సొంతం.

తాజాగా సితార కి సంబందించిన మరొక డాన్స్ వీడియో కూడా విపరీతంగా ప్రాచుర్యం చెందింది. బాహుబలి సినిమాలోని పాట కి సితార చేసిన నృత్యం కేవలం మహేష్ అభిమానులనే కాకుండా అందరినీ ఆకట్టుకుంది. చిన్నారి సితార ని మెచ్చుకుంటు నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపించారు.

అసలు మహర్షి అంటే ఏంటి? అదే మా సినిమా కథ అని దిల్ రాజు ఇదివరకే తెలిపారు.. సొసైటీలో మనం మహర్షి అని ఎవరిని పిలుస్తాం? ఒక మామూలు మనిషి నుంచి మహర్షి అయితే ఏంటి? అనేవి తెలియాలంటే మనం అందరం మే 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

ముఖ్యంగా మహర్షి ట్రైలర్ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి నుంచి ఇలా మహర్షి పాటలతో, విశేషాలతో సమయమే తెలియదని ఆ తరువాత వారు ఎదురుచూసే మహర్షి విడుదల తేదీ వచ్చేస్తుందని అభిమానుల మాట. ఎప్పుడెప్పుడు సూపర్ స్టార్ ని మహర్షిగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

Share

Leave a Comment