సందడి షురూ!

మహర్షి సినిమా కచ్చితంగా అందరినీ కదిలిస్తుందని..ఇది ఆషామాషీ సినిమా కాదని, మహేష్ కెరీర్లో ‘ది బెస్ట్’ అనిపించుకోగల సత్తా దీనికి ఉందని ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు తెలిపిన విషయం తెలిసిందే. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కూడా మొద‌లు పెట్టేసారు చిత్ర యూనిట్.

మొన్నటి వరకు మహర్షి ప్రమోషన్ లేదని అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు అప్‌డేట్స్ వస్తాయా అని ఎదురుచూసారు. సినిమా షూటింగ్ నడుస్తుందనే కానీ సినిమాకు సంబందించిన అప్డేట్ ఇవ్వడం లేదని సినీ ప్రేమికులు కలవరపడగా…తాజాగా వారి ఆకలి తీర్చేందుకు సరికొత్త అప్డేట్స్ ఇవ్వడమే కాదు సరికొత్త స్టిల్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు చిత్ర యూనిట్.

తాజాగా ‘మహర్షి’ మ్యూజికల్‌ జర్నీ షురూ కాబోతుందంటూ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి బుధవారం సోషల్‌ మీడియా ద్వారా వెల్లడిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేయగా..గురువారం ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను మరో సారి దర్శకుడు వంశీ విడుదల చేసి అభిమానుల్లో ఉత్సహం నింపాడు.

‘అల్లరి’ నరేశ్‌, పూజా హెగ్డే, మహేష్ కలిసి కాలేజ్‌కి వెళుతున్నట్లుగా పోస్టర్‌ విడుదల చేసారు.. అందులోనూ మహర్షి సినిమాకు సంబంధించి వీరి ముగ్గురికి సంబంధించిన పూర్తి లుక్‌ను విడుదల చేయడం ఇదే తొలిసారి. ఈ ముగ్గురి కాంబినేషన్ సూపర్ ఉంది అంటూ ప్రశంసల వర్షం కురుస్తుంది.

మహర్షి చిత్రం లో సూపర్‌స్టార్ మహేష్ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న రోల్ లో కనపడునున్నడని ఇప్పటికే మనకి అర్ధం అయిపోయింది. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్ లో ఒక దాంట్లో స్టూడెంట్ గా మరొక దాంట్లో కార్పరేట్ లుక్ లో అదరగొట్టాడు. అటు క్లాస్ ని ఇటు మాస్ ని అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇక అల్లరి నరేష్ లుక్ కూడా చాలా కొత్తగా తన మునుపటీ రోజులు గుర్తు చేసేలా ఉంది. ఈ చిత్రం లో నరేష్ క్యారెక్టర్ చాలా కీలకమైనదన్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కూడా తన రోల్ చాలా కొత్తగా ఉంటుంది అని, మంచి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని తెలిపింది.

దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నేనొక్కడినే, శ్రీమంతుడు లాంటి సినిమాల తర్వాత దేవి శ్రీ ప్రసాద్, మహేష్ బాబు కలిసి పని చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమాతో సంచలన విజయం అందుకుంటాన‌ని ధీమాగా ఉన్నారు చిత్ర యూనిట్ మొత్తం.

పైగా ఇది మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిని ప్రత్యేకంగా నిలాపాలనుకుంటున్నాడు దేవి. ఇక చోటీ చోటీ బాతే పాట ఎలా ఉందో తెలియాలంటే 29 వ తేదీ వరకూ వేచి చూడాలి. ఇది చార్ట్ బస్టర్ అవుతుందంటూ నెటిజన్స్ ట్వీట్స్ మీద ట్వీట్స్ వేస్తూ ఉదయం నుండి ట్రెండ్ చేస్తున్నారు.

టాకీ మొత్తం పూర్తయిపోయింది.. రెండు పాటలు బాకీ ఉన్నాయి. వాటిని ఏప్రిల్‌ తొలి వారంలో తెరకెక్కిస్తారు. స్నేహంలోని మాధుర్యంతో పాటు కుటుంబ అనుబంధాలు నేపథ్యంలో రూపొందిస్తున్న ఎమోషనల్ డ్రామా ఇదని చిత్ర బృందం చెబుతున్న మాట..

25వ సినిమా పై ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాటలు ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అందులోనూ బ్లాక్‌బస్టర్ హిట్ భరత్ అనే నేను తర్వాత ఏడాది గ్యాప్ తో వస్తున్న మహేష్ బాబు సినిమా కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

అసలు మహర్షి అంటే ఏంటి? ఒక మామూలు మనిషి నుంచి మహర్షి అయితే ఏంటి? అనేవి తెలియాలంటే మనం అందరం మే 9వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టుకుని ఎప్పుడెప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ని మహర్షిగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.

Share

Leave a Comment