శ్రీమంతుడికి ఎనిమిదో నంది…!

సినీ రంగంలో అత్యుత్తమ‌ ప్రతిభ కనబరిచిన వారికి నంది అవార్డులను ఇవ్వడం ఆన‌వాయితీగా వ‌స్తుంది.

ఈ క్రమంలో చూసుకుంటే టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నంది అవార్డులను గెలుపొందిన హీరోలందరి కంటే ముందున్నాడు.

కృష్ణ వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన తొలి సినిమా రాజకుమారుడుతోటే నంది అవార్డును కైవసం చేసుకున్నాడు మహేష్.

ఆ తర్వాత వరుసగా మురారి, టక్కరిదొంగ, నిజం, అర్జున్, అతడు, దూకుడు సినిమాలకు ఇప్పటికే నంది అవార్డును అందుకున్నారు.

తాజాగా ప్రకటించిన నంది పురస్కారంతో కలిపి మొత్తం ఎనిమిది నందులు మహేష్‌ ఖాతాలో చేరాయి. శ్రీమంతుడు సినిమాతో 8 నందులను పొందిన ఏకైక హీరోగా మహేష్ చరిత్రకెక్కాడు.

కాగా మహేష్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేష్ శ్రీమంతుడు సినిమా ద్వారా నంది అవార్డును సొంతం చేసుకోవడం అభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది.

ఈ తరం హీరోలందరి కంటే ఎక్కువ నంది అవార్డులు అందుకున్న ఏకైక హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించాడు.

సరికొత్త కథ, కథనాలతో చిత్రాలు చేస్తూ అభిమానులను విశేషంగా ఆలరిస్తున్నాడు. విభిన్న కథలను ఎంచుకుంటూ మంచి స్టార్‌డమ్‌‌ను సొంతం చేసుకున్నాడు.

ఇలా బాక్సాఫీస్ రికార్డులతో పాటు అవార్డ్స్ ను కూడా సొంతం చేసుకుంటూ తనకు తానే సాటిగా ముందుకు పోతున్నాడు సూపర్ స్టార్ మహేష్.

ఇప్పుడు మళ్లీ శ్రీమంతుడు డైరెక్టర్ కొరటాల శివతోనే ‘భరత్ అను నేను’ సినిమాతో వస్తున్న మహేష్ ఇంకెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తాడో చూడాలి.

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై ఇప్పటికే జనాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘శ్రీమంతుడు’ తర్వాత మహేష్‌ – కొరటాల శివ కలిసి చేస్తున్న చిత్రమిది.

ఈ సినిమా కొర‌టాల మార్క్ యాక్ష‌న్‌, మెసేజ్ ఉన్న చిత్రంగా తెర‌కెక్కుతోంది. మహేష్‌ కనిపించే విధానం, ఆయన నటన ప్రత్యేకంగా ఉండబోతోందని చిత్రబృందం చెబుతోంది.

Share

Leave a Comment