నా అభిమానులు గర్వపడేలా ఉంటుంది

సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవాడలో సందడి చేశారు. ఎంజీ రోడ్డులో కొత్తగా ఏర్పాటుచేసిన భీమ జ్యువెలరి షోరూంను ప్రారంభించేందుకు ఆదివారం ఆయన విజయవాడ వచ్చారు. జ్యోతి ప్రజ్వలన చేసి షో రూంను మహేష్ ప్రారంభించారు. ఆయన పబ్లిక్ లోకి వస్తే ఇసుకేస్తే రాలనంతగా జనాలు వస్తారు. తాజాగా విజయవాడలో ఆ విషయం నిరూపితమైంది.

మహేష్ రాకతో అభిమానులు పోటెత్తారు. షోరూం పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి. అభిమానులను నియంత్రించేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాల్సి వచ్చింది. అభిమానులకు తనదైన స్టైల్లో అభివాదం చేస్తూ సందడి చేసారు మహేష్. షో రూంను ప్రారంభించిన తరువాత ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మహేష్ మాట్లాడుతూ ఏపీలో తొలి షో రూంను ఏర్పాటుచేసిన భీమ జ్యువెలర్స్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడకు రావడం నాకెప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. నా చాలా సినిమాల 100 రోజుల వేడుకలు కానీ, ఇతర సెలబ్రేషన్స్ కానీ విజయవాడలోనే జరిగాయి. విజయవాడ నా మనసుకు ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఇక్కడే భీమ షోరూంను ప్రారంభించడానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లకి ఆల్ ది బెస్ట్ అని మహేష్ అన్నారు.

తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మహేష్ బాబు తన సినిమా సరిలేరు నీకెవ్వరు ఈ సంక్రాంతికి వస్తుందని చెప్పారు. ఈ సినిమాను చూసి తన ప్రతి ఒక్క అభిమాని గర్వపడతారని మహేష్ అన్నారు. దీంతో మహేష్ బాబు చేసిన కామెంట్లు విన్న అక్కడ ఉన్న అభిమానులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు.

కాగా, తమ ఊరికి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నారని తెలియడంతో ఆయన్ని చూసేందుకు జనం భారీగా షోరూం వద్దకు తరలివచ్చారు. మహేష్ ఫ్యాన్స్ అయితే పోస్టర్లు, ప్లకార్డులతో హంగామా చేశారు. మహేష్‌బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ.

మహేష్‌ బాబు ని రియల్‌గా చూడాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. అయితే మహేష్ తెర మీద తప్పితే బయట మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో మహేష్ ఫస్ట్ టైమ్ ఒక ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో నటిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందాన్న తొలిసారిగా సూపర్‌స్టార్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి రత్నవేలు కెమెరామెన్‌గా పని చేస్తున్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్ర విడుదల తేదీని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఎన్నో ప్రత్యేకలతో వస్తోన్న ఈ చిత్రం సూపర్ స్టార్ అభిమానులకు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని యూనిట్ చెప్పుకొస్తుంది. విజయశాంతి ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వడం ఇలా ప్రతీదీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేసుకున్న దర్శకుడు సూపర్ స్టార్‌ను ఓ రేంజ్‌లో చూపించాడని టాక్.

ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్ సినిమాపై ఎన్నో అంచనాలు పెంచేశాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం కర్నూలు జిల్లాలోని కొండా బురుజు సెట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో రీ క్రియేట్ చేసారు. దీని చుట్టు జరిగే సీన్స్, యాక్షన్ పార్ట్ ఫ్యాన్స్ చేత విజిల్స్ వేసేలా చేస్తాయని తెలుస్తోంది. ఈ సినిమాని జనవరి 12, 2020న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Share

Leave a Comment