నా సూపర్‌స్టార్ హోదాకు కారణం ఆయనే

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది ప్రత్యేక స్థానం. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసుడుగా తెరంగేట్రమ్ చేసిన మహేష్ అనతి కాలంలోనే సూపర్ స్టార్ గా ఎదిగారు. ఆచితూచి సినిమాలు చేసే మహేష్ ఇన్నేళ్ల కెరీర్ లో చేసింది కేవలం 25 సినిమాలు మాత్రమే. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరున్న మహేష్ కి అటు మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇలా అన్ని వర్గాలలో ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే.

ఇటీవల ఈయన ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వోగ్ కోసం ఫొటో షూట్ లో కూడా మహేష్ బాబు పాల్గొన్నారు. ప్రస్తుతం సౌత్ లో అత్యంత ప్రముఖమైన హీరోగా గుర్తింపు దక్కించుకున్న మహేష్ బాబును వోగ్ మ్యాగజైన్ ఇంటర్వ్యూ చేసింది. బాలీవుడ్ తారలపై మాత్రమే ఎక్కువ శ్రద్ద చూపే వోగ్ ఈసారి మహేష్ బాబును ఇంటర్వ్యూ చేయడం జరిగింది.

మహేష్ బాబు వోగ్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెళ్లడించారు. కెరీర్ లో మీరు సూపర్ స్టార్ గా ఎదగడానికి గల కారణాలు ఏంటని మీరు భావిస్తున్నారని ప్రశ్నించిన సందర్బంగా మహేష్ బాబు సమాధానంగా తన తండ్రి వల్లే సూపర్ స్టార్ హోదా దక్కిందని భావిస్తానంటూ పేర్కొన్నారు. ఎప్పటికీ తను తన తండ్రి కృష్ణ గారికి రుణపడి ఉంటానని చెప్పారు.

చిన్నప్పుడు వేసవి సెలవుల్లో నన్ను సినిమాల్లో బాల నటుడిగా నటింపజేసిన నాన్న గారు నాకు సినిమాలపై ఆసక్తి కలిగించేలా చేశారు. ఆ తరువాత వరుసగా సినిమాలు చేస్తూ ఉండడంతో మెల్లగా సినిమాలపై మరింత ఆసక్తి పెరిగి తనను హీరోగా మారేలా చేసిందని అన్నారు. ఆయన్ను చూస్తూ, అనుసరిస్తూ నేను సినిమాలు చేశానని ఆ కారణంగానే నేడు తాను ఈ స్థాయికి వచ్చానంటూ మహేష్ చెప్పుకొచ్చారు.

నా ఈ కెరీర్ కు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా కూడా నాన్న కృష్ణ గారు హెల్ప్ అయ్యారని మహేష్ బాబు పేర్కొన్నారు. ఆయన వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ నిరాడంబరంగా వ్యాఖ్యలు చేశారు. మొదటి నుండి కృష్ణ గారి సినిమాలే ఎక్కువగా చూసి పెరిగిన తనకు, తండ్రి కృష్ణ గారే సూపర్ హీరో అని అన్నారు మహేష్.

ఇక ఎక్కువగా తనకు తీరిక సమయంలో సరదాగా గడపడం అలవాటని చెప్పిన సూపర్ స్టార్, ఎవరికైనా తన ఫ్యామిలీతో సరదాగా గడపడాన్ని మించిన ఎంజాయిమెంట్ ఏముంటుందని అన్నారు. ఇది కూడా తాను తన తండ్రిని చూసే నేర్చుకున్నానని చెప్పారు మహేష్. ఎంత బిజీగా ఉన్న కృష్ణ గారు తమకు సమయం కేటాయించేవరని అదే నేను ఫాలో అవుతానని చెప్పారు.

ప్రస్తుతం మహేష్ బాబు ఏ సినిమా చేసినా కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మహర్షి చిత్రం మహేష్ బాబు కెరీర్ లో 25వ చిత్రం. ఆ సినిమాకు ఏ స్థాయిలో వసూళ్ళు దక్కాయో మనకు తెలిసిన విషయమే. ప్రస్తుతం తన 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు ను అనీల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు. దాంతో మరో బ్లాక్ బస్టర్ ను మహేష్ దక్కించుకుంటారనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.

రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఆ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మెజారిటీ చిత్రీకరణను పూర్తి చేశారు. బ్యాలెన్స్ చిత్రీకరణను పరుగులు పెట్టిస్తున్నారు. ఇదివరకే స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా తొలి సింగిల్ ని మిలటరీ బ్యాక్ డ్రాప్ లో రివీల్ చేశారు.

ఆర్మీ మేజర్ లుక్ లో మహేష్ గెటప్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా దసరా పండుగను పురస్కరించుకుని సరిలేరు నీకెవ్వరు టీం ఒక కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టి ఈవిల్ ని వేటాడుతున్న డెవిల్ లా కనిపిస్తున్నాడు మహేష్. ఆర్మీ మేజర్ లుక్ లోనే కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లోనూ.

ఈవిల్ ని నాశనం చెయ్, సగర్వంగా విజయదశమికి సమర్పిస్తున్నాం అంటూ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు మహేష్. విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. కాశ్మీర్ నుంచి వచ్చిన సైనికుడికి కర్నూల్లో పనేంటో తెలియాలంటే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో వేసిన కొండారెడ్డి బురుజు దగ్గర భారీ యాక్షన్ సీక్వెన్సులు తెరకెక్కించింది చిత్రబృందం. ఇప్పుడు ఆ పోస్టర్ నే విడుదల చేసారు.

Share

Leave a Comment