ఆశక్తికరమైన పోటి..

ఏప్రిల్‌లో ‘సూపర్‌స్టార్‌’ రజనీకాంత్‌ ‘2.ఓ’ను విడుదల చేస్తామని ఆ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ నిర్ణయంపై నిర్మాతల్లో ఒకరైన బన్ని వాసు ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘2.ఓ’ ఆ సమయంలో విడుదలైతే తన సినిమాతోపాటు, ‘భరత్‌ అనే నేను’ సినిమాకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు.

అయితే ఇదే విషయంపై ‘భరత్‌ అనే నేను’ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తాజాగా స్పందించింది.

ఈ మేరకు ట్విటర్‌లో వరుస ట్వీట్లు చేసింది. ‘మరో భాషా చిత్రాన్ని టాలీవుడ్‌ ఎప్పుడూ గౌరవిస్తుంది.

కానీ ఓ పెద్ద ప్రాజెక్టు అయిన ‘2.ఓ’ సినిమా విడుదల తేదీ వాయిదాలు పడుతుండటం వల్ల మిగిలిన నిర్మాతలు తికమకలో పడ్డారు.

ఏప్రిల్‌, మే నెలల్లో సినిమాలను విడుదల చేయాలి అనుకుంటున్న నిర్మాతలు.. మాలో మాకే పోటీ వద్దు అనుకుని, చర్చించుకుంటున్నారు’.

‘ఇప్పుడు ఉన్నట్టుండి ‘2.ఓ’ను ఏప్రిల్‌లో విడుదల చేస్తామని ఆ బృందం ప్రకటించడం వల్ల తెలుగు సినిమాలు మరో అయోమయంలో పడ్డాయి.

ట్రేడ్‌ బాడీస్‌ ఈ సమస్యను పరిగణనలోకి తీసుకుని, సరైన సమాధానం ఇవ్వాలని కోరుతున్నాం’ అని ఆ సంస్థ తన ట్వీట్లలో పేర్కొంది.

మహేశ్‌బాబు 24, ‘2.ఓ’ అనే హ్యాష్‌ ట్యాగ్‌లను కూడా జత చేశారు.

బన్ని వాసు ఈ విషయాన్ని డీవీవీ దానయ్యతో కలిసి ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

అదే విధంగా మహేష్ సినిమా నిర్మాత దానయ్య కూడా దీనిపై ఆలోచించాల్సిన అవసరం వుందని, ట్రేడ్ భాగస్వాములంతా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వుందని అంటున్నారు.

మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘భరత్‌ అనే నేను’. కొరటాల శివ దర్శకుడు. బాలీవుడ్‌ నటి కైరా అడ్వాణీ కథానాయిక.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం ఏప్రిల్‌ లో విడుదల చేయాలని చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

Share

Leave a Comment