కిక్కిచే న్యూస్‌తో అనిల్ రావిపూడి

‘మహర్షి’ సినిమాతో మాంచి ఊపు మీదున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. డైరెక్టర్ వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దుమ్మురేపే కలెక్షన్లతో పాటు ప్రముఖుల ప్రశంసలతో ప్రదర్శితమవుతోంది.

గత రెండు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ సారి మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయారు. ఇందుకోసం మహర్షి సెట్స్ పైన ఉండగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నేడు బయటకు వచ్చింది. ఈ కొత్త విషయాన్ని స్వయానా దర్శకుడు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకోవడం వెశేషం. తను చెప్పాలనుకుంటున్న విషయాన్ని చాలా ఇన్నోవేటివ్ గా ట్విట్టర్ ఎమోఝీ ల సాయంతో చెప్పే ప్రయత్నం చేసారు అనిల్ రావిపూడి.

ఆయన పోస్ట్ చేసిన ఎమోజీ ల ప్రకారం తాను సూపర్ స్టార్ తో చేసే సినిమా యొక్క స్కిప్ట్ వర్క్ పూర్తయిందని దాతో పాటూ ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని ఆయన ఎమోజీల ద్వారా తెలియజేసారు. ఇంకా ఒక క్లాప్‌బోర్డ్ ఎమోజీతో పాటు సూన్ అని ఉన్న దాన్ని కూడా పోస్ట్ చేసారు. కాబట్టి అన్ని పనులు పూర్తయ్యి షూటింగ్ త్వరలోనే మొదలవబోతుంది అనమాట.

మహేష్ బాబు, అనిల్ రావిపూడి ల కాంభినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఏటీవి అధినేత అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. గతంలో ఆయన కూడా ఈ సినిమా నిర్మిస్తున్న విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ఖాటా ద్వారా ఎమోజీలతో అభిమానులకు తెలియజేసారు.మొత్తానికి నిర్మాత, దర్శకుడు ఇలా తాము చేయబోయే సినిమా గురించి ఇలా విన్నూత్నంగా తెలియజేయడం అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తుంది.

కొంతమంది నెటిజన్లు ఓ అడుగు ముందుకేసి సినిమాకు ఎమోజీలకు ఏదో సంబంధం ఉండే ఉంటుందని అప్పుడే ఊహించేసుకుంటున్నారు. ఈ సినిమాను చేయబోతున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ధృవీకరించలేదు.

ఒక సారి సినిమా సెట్స్ పైకి వెళితే వెంటనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అనిల్ రావిపూడి అప్పుడే కర్నూలు వెళ్ళి కొన్ని లొకేషన్లను కూడా ఫైనల్ చేసి వచ్చారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో సినిమా కధ నడవనుందో లేదో తెలియాల్సి ఉంది.

మహేష్ బాబు సినిమాల్లో కర్నూలు అనగానే అందరికీ గురుకు వచ్చే సెన్సేషనల్ సినిమా ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు ను ఏ తెలుగు ప్రేక్షకుడు మరిచిపోలేడు. ఇప్పుడు మళ్ళీ ఇన్ని రోజులకు కర్నూలు బ్యాక్ డ్రాప్ తో మహేష్ సినిమా ఒకటి రాబోతుంది అనమాట. అంతేకాదు ఈ సినిమా టైటిల్ పై అప్పుడే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పరాజయం ఎరుగని మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా పేరున్న అనిల్ రావిపూడి మహేష్ తో ఎలాంటి సినిమా తీస్తాడా అనే ఉత్సుకత అభిమానుల్లో విపరీతంగా ఉంది. మీడియం రేంజ్ హీరోలనే గూస్ బంప్స్ వచ్చేలా ప్రెజెంట్ చేసిన అనిల్ ఇక ప్రిన్స్ లాంటి మాస్ ఐకాన్ దొరికితే ఏ స్థాయిలో చెలరేగిపోతాడో అనేది వాళ్ళ అంచనా.

మహర్షి విజయోత్సవ వేడుకలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘ఇంత మంచి సినిమా నిర్మించిన దిల్ రాజు, అశ్వినీదత్, పివిపిగార్లకు అభినందనలు. రిషి అనే పాత్రని మహేష్‌గారు తన అద్భుతమైన నటనతో ఇంత పెద్ద హిట్ చేశారు. ఇలాంటి సినిమా చేసిన వంశీ అన్నకి హ్యాట్సాఫ్, యాక్సెప్ట్ చేసిన మహేష్‌గారికి కంగ్రాట్స్. ఇంత పెద్ద హిట్టు చిత్రం తర్వాత ‘ఎస్ఎస్ఎమ్‌బి26’ జాగ్రత్తగా చేయాలని పర్సనల్‌గా చెబుతున్నారు.

ఫ్యాన్స్ చెబుతున్నారు. కానీ నాకు ఒక్కటే అనిపిస్తుంది. నా సినిమా మొదలవ్వక ముందే మహర్షి సక్సెస్‌లో నేను భాగం అయ్యాను. ఆ సినిమాకు సంబంధించి విడుదలైన తర్వాత జరిగిన ప్రతి పార్టీలో నేను ఉన్నాను. నాకున్న టార్గెట్ ‘ఎస్ఎస్ఎమ్‌బి26’ ఎంత పెద్ద హిట్టు కొడుతుంది అనేది కాదు. మహేష్‌ గారి ఫేస్‌లో ఉన్న స్మైల్, హ్యాపీనెస్.

ఒక మంచి సినిమా తీస్తే ఆయనతో ఎంత హ్యాపీగా ట్రావెల్ చేయవచ్చో ఈ సినిమా ద్వారా తెలుసుకున్నాను. అదే నా టార్గెట్. ఖచ్చితంగా ఆయనకు సంతోషాన్ని ఇచ్చేలా సినిమాని చేస్తానని మాత్రం నమ్ముతున్నాను’ అని అన్నారు. ఈ మాటలతో సూపర్ స్టార్ అభిమానులు అనిల్ పై ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనిల్ రావిపూడి సూపర్ స్టార్ కు ఖచ్చితంగా ఒక సూపర్ మూవీ ఇస్తారని వాళ్ళ నమ్మకం.

మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మహర్షి సక్సస్ ని విదేశాలలో కుటుంబ సమేతంగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు ప్రిన్స్. ఈ టూర్ ముగించుకున్న తర్వాత అనీల్ రావిపూడి తో సినిమాని ప్రారంభిస్తారని తెలుస్తోంది. 2020 సంక్రాంతి టార్గెట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని పక్కా ప్లాన్ తో ఉన్నారు చిత్ర యూనిట్. పక్కా మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది.

Share

Leave a Comment