అమెరికా రాయబారితో సూపర్‌స్టార్

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తన తాజా చిత్రం ‘మహర్షి’. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. ఈ చిత్రం షూటింగ్‌ త్వరలో న్యూయార్క్‌లో జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డాను మహేష్, వంశీ కలిశారు.

ఈ మేరకు వారితో కలిసి దిగిన ఫొటోలను కేథరిన్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. ‘నా స్వస్థలం న్యూయార్క్‌లో తమ తర్వాతి సినిమా షూటింగ్‌ ఎవరు చేస్తున్నారో చూడండి?’ అంటూ మహేష్, వంశీలను ట్యాగ్‌ చేశారు. దీంతోపాటు ‘యూఎస్‌ ఇండియా దోస్తీ’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు. ఈవిడ ట్వీట్‌కి మహేష్ రెప్లై ఇచ్చారు.

‘కేథరిన్‌ గారిని ఈ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ సొంత ఊరు న్యూయార్క్ కు వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు మహేష్ బాబు. కేథరిన్‌కు వంశీ రిప్లై ఇస్తూ ‘మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది మేడమ్‌. మీరు చూపిన ప్రేమకు ధన్యవాదాలు’ అని అన్నారు.

డబ్బుని మనసుతో ముడిపెట్టిన వాడు మనిషి. మనసుని తపస్సుతో జయించేవాడు మహర్షి. అలాంటి ఓ యువకుడి కథే ‘మహర్షి’. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అశ్వనీ దత్‌, దిల్‌రాజు, పివీపి నిర్మాతలు. న్యూయార్క్‌లో పదిహేను రోజుల పాటు కీలక సన్నివేశాలు, పాటల్ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన తారాగణమంతా పాల్గొంటుంది.

ఇటీవల హైదరాబాద్‌, డెహ్రాడూన్‌లలో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కించారు. ఇలా పక్కా ప్రణాళికతో దూసుకెళ్తున్నారు ‘మహర్షి’ అండ్‌ టీమ్‌. ఫ్యామిలీ కంటెంట్ ను అందించడంలో సూపర్‌స్టార్ కు మంచి గుర్తింపు ఉంది. అలాగే ప్రయోగాలు చేయడంలో కూడా పేరుంది. కొత్త సినిమాలో డిఫరెంట్‌ లుక్‌లో కనిపించేందుకు గెటప్ చేంజ్ చేస్తున్నారంటే అంచానాలు మరింత పెరుగుతున్నాయి.

రిషి పాత్రలో మహేష్ బాబు, రవి పాత్రలో అల్లరి నరేష్ కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత సుకుమార్‌ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Share

Leave a Comment