బాహుబలి రికార్డుని బద్దలు కొట్టిన భరత్

సూపర్ స్టార్ మహేష్ బాబు, కియారా అద్వాని జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘భరత్ అనే నేను’. ఈ చిత్రం సక్సెస్ టాక్‌తో విజయవంతంగా 3వ వారం పూర్తిచేసుకుంటోంది. ముఖ్యమంత్రిగా మహేష్ నటనకు ఫిదా అయిన ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్ల బాట పడుతున్నారు.

విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది భరత్ అనే నేను. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లోనూ ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తమిళనాట తెలుగు వెర్షన్ కి అనూహ్యమైన ఆదరణ లభించడం మరో విశేషం.

చెన్నైలో ఈ సినిమా సెన్సేషన్ రన్ ని కొనసాగిస్తూ తెలుగు సినిమాల పరంగా ఇన్ని రోజులు నాన్ బాహుబలి రికార్డులను అక్కడ నమోదు చేయగా ఇప్పుడు ఏకంగా బాహుబలి 2 రికార్డ్ నే బ్రేక్ చేసి నెంబర్ 1 స్థానానికి దూసుకెళ్ళింది.

తెలుగు చిత్రాలకు సంబంధించి చెన్నైలో అత్యధిక కలెక్షన్లను సాధించిన చిత్రాలలో ‘బాహుబలి 2’ ను వెనక్కి నెట్టి ‘భరత్ అనే నేను’ తో అల్టిమేట్ రికార్డ్ ను నెలకొల్పాడు సూపర్ స్టార్ మహేష్. చెన్నై లో డైరెక్ట్ తెలుగు వర్షన్ తో అక్కడ బాహుబలి2 1.65కోట్లని అందుకోగా భరత్ అనే నేను 1.70కోట్లని అందుకుని ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను దక్కించుకుంది.

చెన్నై లో నే కాకుండా తమిళనాడు రాష్ట్రం మొత్తం తన హవా కొనసాగించింది భరత్ అనే నేను. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా సాధించని కలెక్షన్స్ భరత్ అనే నేను సినిమా సాధించింది. తమిళనాట 4.3కోట్ల కు పైగా రూపాయల గ్రాస్ కెల్లెక్షన్స్ రాబట్టిన తొలి తెలుగు సినిమాగా తన పేరును లిఖించుకుంది.

మొదటి వారంలో రూ.161 కోట్లు, రెండు వారాలకు రూ. 190 కోట్ల గ్రాస్‌ వసూళ్లు దక్కించుకున్నట్టు వెల్లడించారు. ఇప్పుడు ఈ చిత్రం మరో మైలురాయిని చేరుకుంది. మూడు వారాల్లో రూ.205 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లతో దూసుకుపోతోందని చిత్ర యూనిట్‌ ప్రకటించింది.

నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో 200 కోట్ల క్లబ్‌లో త్వరగా చేరిన సినిమా భరత్ అనే నేను. ఈ చిత్రం ఓవర్సీస్‌లో మరింత దూకుడుగా కలెక్షన్లు రాబడుతోంది. బాహుబలి సినిమా తర్వాత అంత వేగంగా యూఎస్‌లో ఆ మార్క్‌ను చేరుకున్న చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసాడు భరత్.

మొదటిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించడం కొరటాల స్క్రీన్ ప్లే మ్యాజిక్ ఈ సినిమాకి హైలైట్ అని చెప్పొచ్చు. మహేష్ ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా కోసం త్వరలోనే ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు.

Share

Leave a Comment