మూడో పాట ఇరగదీశాడయ్యో సామీ

‘వచ్చాడయ్యో సామి’.. అంటూ మహేష్ బాబు అలియాస్ భరత్ సందడి షురూ చేశాడు. కొరటాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ మూవీ నుండి మూడో పాటను కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది చిత్ర యూనిట్.

‘భరత్ అనే నేను’ విడుదల సమయం దగ్గర పడటంతో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలు విడుదలవ్వగా ఇప్పుడు మూడో పాటను విడుదల చేశారు. ‘వచ్చాడయ్యో సామి’ అంటూ సాగే ఈ పాట అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

దేవి శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చిన ఈ పాట సంగీత ప్రియులను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రముఖ గాయకుడు ఖైలాష్ ఖేర్, దివ్య కుమార్ పాడిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు.

వచ్చాడయ్యో సామీ…. నింగి చుక్కలతో గొడుగెత్తింది భూమి, ఇచ్చాడయ్యో సామీ కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ….. అంటూ రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఒక నాయకుడు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటే వారి నుండి ఎలాంటి స్పందన వస్తుందో ఈ పాట ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

భరత్ అనే నేనులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ పాటలో మహేష్ బాబు పంచె కట్టుకుని ప్రజలతో కలిసి డాన్స్ చేస్తూ తెరపై కనిపించనున్నాడు. ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసింది.

దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన బాణీలు సమకూర్చారు. అటు మాస్ ఆడియన్స్, ఇటు క్లాస్ ఆడియన్స్ మెప్పిస్తూ మరో వైపు యూత్‌ను ఆకట్టుకునే విధంగా వివిధ వేరియేషన్లలో ట్యూన్స్ కంపోజ్ చేశాడు.

‘భరత్ అనే నేను’ చిత్రానికి సంబంధించిన పూర్తి ఆడియో ఏప్రిల్ 7న జరిగే ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేయనున్నారు. ‘భరత్ బహిరంగ సభ’ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున దీన్ని నిర్వహించబోతున్నారు.

మహేష్‌ బాబు కొరటాలకు ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్నమూవీపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి.మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తుండగా ఏప్రిల్ 20న భారీ అంచనాలతో ‘భరత్ అనే నేను’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Leave a Comment