భరత్ ఈవెంట్ హైలైట్స్ ఇవే .. మీరూ చూడండి

‘‘ఓ కమర్షియల్‌ కథానాయకుడు అయ్యుండి మహేష్‌బాబు చేసిన ప్రయోగాలు ఎవ్వరూ చేయలేదు. ఈ విషయంలో ఆయనే మా అందరికీ స్ఫూర్తి’’ అన్నారు ఎన్టీఆర్‌. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం ‘భరత్‌ అనే నేను’. కైరా అడ్వాని కథానాయిక. కొరటాల శివ దర్శకుడు. ఈనెల 20న విడుదల కానుంది.

శనివారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘మీరంతా మహేష్‌ను ప్రిన్స్‌, సూపర్‌ స్టార్‌ అని పిలుచుకుంటారు. నేను మాత్రం ఆయన్ని ‘మహేష్‌ అన్నా..’ అంటాను.

ఈ కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రాలేదు. ఓ కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఫలితంతో సంబంధం లేకుండా ఆయన చేసిన ప్రయోగాలు మేం చేయలేదు. ఒక విధంగా ఇప్పుడిప్పుడే మేం మొదలెడుతున్నాం. దానికి స్ఫూర్తి ఆయనే.

‘జనతా గ్యారేజ్‌’లో ఓ మొక్క గురించి ఓ డైలాగ్‌ ఉంది ‘అది చాలా అరుదైన రకం.. దాన్ని అలానే ఉండనిద్దాం’ అని. మహేష్‌ అన్న అంతే. ‘ఆయన కూడా అరుదైన రకం. ఆయన్ని అలాగే ఉండనిద్దాం’. మహేష్‌ కెరీర్‌లో ఈ చిత్రం ఓ మైలు రాయిగా మిగిలిపోవాలని కోరుకుంటున్నా.

దర్శకుడు శివ నా ఆప్తమిత్రుడు. సమాజం పట్ల ఓ బాధ్యత కలిగిన దర్శకుడు. సినిమాని సినిమాలా కాకుండా కమర్షియల్‌ పంథాకి ఎక్కడా తగ్గకుండా, మసాలాలు గట్టిగా దిట్టించి సినిమాలు తీస్తారు. మీరు ఎప్పటికీ ఈ ప్రయాణం ఆపొద్దు. ఇంకెన్నో సినిమాలు తీయాలి’’ అన్నారు.

మహేష్‌బాబు మాట్లాడుతూ ‘‘అభిమానుల ఉత్సాహం చూస్తుంటే సినిమా వంద రోజుల వేడుకకు వచ్చా అనిపిస్తోంది. ‘ఆది’ ఆడియోకి వెళ్లాను. తారక్‌ ఇప్పుడు నా సినిమా వేడుకకు వచ్చాడు. ప్రతి సినిమా వేడుకలోనూ ట్రెండు మారుతుంది.

అందరు హీరోలు వెళ్తారు. మనకున్న స్టార్‌ హీరోలు చాలా తక్కువ. యేడాదికి ఒక్క సినిమానే చేస్తారు. అందరి సినిమాలు బాగా ఆడాలి. మాలో మేం బాగానే ఉంటాం. అభిమానులు ఇంకా బాగుండాలి.

శివ ‘సీఎం పాత్ర’ అన్నప్పుడు చాలా భయం వేసింది. ఎందుకంటే నాకూ రాజకీయాలకు సంబంధం లేదు. అందుకే వణుకు వచ్చింది. ఆయన కథ చెప్పినప్పుడు స్ఫూర్తి పొందా. షూటింగ్‌లోనూ చాలా నేర్చుకున్నా. శ్రీమంతుడు నా కెరీర్‌కి ఓ మలుపు.

ఇప్పుడు మరో మలుపు అందించారు శివ. ఆయనకు రుణపడి ఉంటా. దేవిశ్రీ ప్రసాద్‌కి చాలా పెద్ద అభిమానిని. ‘రంగస్థలం’ చూశా.. ఆ సినిమాకి మా సినిమాకీ సంబంధం లేని సంగీతం అందించారు. ఏప్రిల్‌ 20 మా అమ్మగారి పుట్టిన రోజు. ఆరోజున ఈ చిత్రం విడుదలకావడం ఆనందంగా ఉంద’’న్నారు.

నటుడు కృష్ణ మాట్లాడుతూ ‘‘మహేష్‌ బాబు – కొరటాల కలయికలో వచ్చిన ‘శ్రీమంతుడు’ మంచి విజయం సాధించింది. అన్ని రికార్డులూ తిరగరాసింది. ఈ ట్రైలర్‌, పాటలు, డైలాగులు చూస్తుంటే ‘శ్రీమంతుడు’ని మించిన విజయం అందుకుంటుందనిపిస్తోంది.

మహేష్‌ కెరీర్‌లోనే నెం.1 సినిమా అవుతుంది’’ అన్నారు. గీత రచయిత రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ ‘‘నిజాయతీతో కూడిన అద్భుతం ఈ చిత్రం. కొరటాల ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి.

కమర్షియల్‌గా ఉంటూనే ఓ మంచి సందేశాన్ని జన హృదయాలకు చేరవేస్తారు. అలాంటి మరో ప్రయత్నం ఇద’’న్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘ఓ స్టార్‌ హీరో వేడుకకు మరో స్టార్‌ హీరో రావడం ఓ కొత్త ఒరవడి. మన తెలుగు సినిమా భారతీయ చలన చిత్రపరిశ్రమకు గొప్ప ఉదాహరణ కావాల’’న్నారు.

కైరా అడ్వాని మాట్లాడుతూ ‘‘సెట్లో అడుగుపెట్టిన తొలిరోజే ‘నన్ను సార్‌ అని పిలవొద్దు’ అని మహేష్‌ చెప్పారు. కానీ ఆ గౌరవం నాకెప్పుడూ అలానే ఉంది. మహేష్‌ ఓసారి నటించిన కథానాయికలతో మరోసారి నటించరు. కానీ నాకు మాత్రం ఆయనతో మళ్లీ నటించాలని ఉంద’’ని చెప్పింది.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘కొరటాల శివ తన సినిమాల్లోనే కాదు బయట కూడా మంచి విషయాలు నేర్పుతున్నారు. ఓ స్టార్‌ హీరో వేడుకకు మరో స్టార్‌ హీరోని తీసుకురావడం ఆనందంగా ఉంది. మంచి సినిమా చూస్తే ఫోన్‌ చేసి మరీ అభినందిస్తారు మహేష్‌.

ఎన్టీఆర్‌ కూడా అంతే. కొరటాల శివ సినిమాలో పాటల కోసం పాటలు రావు. కథతో ముడిపడే వస్తాయి. అలాంటి పాటలకు సాహిత్యం అందించడం ఓ సవాల్‌. రామజోగయ్య చాలా అందమైన పాటల్ని అందించార’’న్నారు.

నిర్మాత మాట్లాడుతూ ‘‘మా సంస్థలో ఇంత గొప్ప సినిమా అందించినందుకు దర్శకుడికి జీవితాంతం రుణపడి ఉంటా. ఎప్పటి నుంచో మహేష్‌బాబుతో సినిమా చేయాలని నా కోరిక. ఇంత మంచి చిత్రంతో నెరవేరుతున్నందుకు చాలా ఆనందంగా ఉంద’’న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘భయం, భక్తి, శ్రద్ధతో సినిమా తీశానని హామీ ఇస్తున్నా. మహేష్‌కి 5 గంటల పాటు కథ చెప్పా. కథ విని ‘ఈ ఐదు గంటలూ తెరపై ఉండడానికి అవకాశం ఉందా?’ అని అడిగారు.

అది ఆయన నాపై పెట్టుకున్న నమ్మకం. ఇందులో అందమైన, శక్తిమంతమైన ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. సీఎం ప్రేమికురాలు అంటే ఎలా ఉండాలి అనుకున్నప్పుడు కైరా గుర్తొచ్చింది. తెలుగులో ఆమెకు తొలి సినిమా. కానీ అలా అనిపించదు. తనకు మంచి భవిష్యత్తు ఉంద’’న్నారు.

ఈ కార్యక్రమంలో ప్రకాష్‌రాజ్‌, భోగవల్లి ప్రసాద్‌, రామ్‌లక్ష్మణ్‌, అనిల్‌ సుంకర, బ్రహ్మాజీ, అజయ్‌, సురేష్‌ సెల్వరాజన్‌, నరేష్‌, సుధీర్‌బాబు, వంశీపైడిపల్లి తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Comment