మోస్ట్ హ్యాండ్సమ్ ఆండ్ డైనమిక్‌ సీఎం గా

సమకాలీన అంశాల్ని జోడించి జనరంజకమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించడంలో దర్శకుడు కొరటాల శివ శైలి ప్రత్యేకం. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన తనకు సమాజం పట్ల పూర్తి బాధ్యత ఉందని, దాన్నే సినిమాల విషయంలోనూ ఫీలవుతుంటానని చెబుతుంటారాయన.

ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం భరత్ అనే నేను. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది, ఈ సందర్భంగా దర్శకుడు కొరటాల శివ ప్రెస్ తో ప్రత్యేకంగా ముచ్చటించారు. అందులో ముఖ్యాంశాలు క్లుప్తంగా మీకోసం..

మహేష్‌బాబు ఇప్పటి వరకు రాజకీయ నేపథ్య చిత్రం చేయలేదు. ఆయనను సీఎంగా చూపించాలనే ఆలోచన ఎలా పుట్టింది?

మహేష్‌బాబుతో ఓ రాజకీయ చిత్రం చేయాలనే ఆలోచన నాకు ఎప్పటి నుంచో ఉంది. సమకాలీన రాజకీయాలపై సెటైర్లు వేస్తూ కాకుండా ఒక అందమైన సినిమా చేయాలనుకున్నాను. దీనికి సంబంధించి పక్కా లైన్ అనుకున్నాను.

ఆ సమయంలో నా మిత్రుడు, దర్శకుడు శ్రీహరి నాను ఈ కథలో హీరో సీఎం అయితే బాగుంటుంది అని చెప్పాడు. తను చెప్పిన ఆలోచన నాకు బాగా నచ్చింది. దాంతో కథను ఆ దిశగా రాయడం మొదలుపెట్టాను.

స్క్రిప్ట్‌పై పూర్తి నమ్మకం కుదిరిన తరువాత మహేష్‌బాబుతో చెబితే అంగీకరిస్తారా? లేదా? అనే చిన్న మీమాంస ఉండేది. ఓ రోజు ఆయనకు లైన్ వినిపించాను. సినిమాలో మీరు సీఎం అన్నప్పుడు నేను సీఎం ఏంటి సార్? అని మహేష్ నవ్వారు.

తరువాత రాజకీయాలపై నాకు అవగాహన లేదు. నేను ఇంత వరకు ఆ పక్కకు వెళ్లలేదు అన్నారు. మిమ్మల్ని వాస్తవిక రాజకీయాల్లోకి పంపించడం లేదు సార్. ఇలాంటి కథ నటుడిగా మీకు ఓ సవాల్‌గా అనిపిస్తుంది.

ఇంత వరకూ మీరు చేయని నేపథ్యం కాబట్టి ఎంజాయ్ చేస్తారు అన్నాను. నా మాటలు విని సినిమా కోసం చాలా శ్రమించారాయన. సినిమా అంగీకరించిన తరువాత తన పాత్ర తీరు తెన్నుల కోసం చాలామంది రాజకీయ నాయకుల్ని పరిశీలించారు.

భరత్ అనే నేను అంటూ తొలిసారి పూర్తి నిడివి రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తున్నారు. సినిమా ఎలా ఉంటుంది?

భయం, భక్తి, శ్రద్ధలతో ఈ చిత్రాన్ని రూపొందించాను. మహేష్‌బాబుకు ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు సార్ ఇది పెద్ద కథ. రెగ్యులర్ కథల్లాగ అరగంట మాత్రమే చెప్పలేను అని చెప్పి కథ చెప్పడం మొదలు పెట్టాను.

ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ కలిపి మొత్తం ఐదు గంటలు కథ చెప్పాను. కథ విన్న తరువాత ఐదు గంటలా? అంటారేమో అనుకున్నాను. అయితే సినిమా ఐదు గంటల నిడివి ఉండే అవకాశం ఉందా? అని మహేష్‌బాబు అనడంతో ఆశ్చర్యపోయాను.

ఆయన ఒక్కసారి టెక్నీషియన్‌ను నమ్మితే హార్ట్‌ఫుల్‌గా ఆ ప్రాజెక్ట్‌కు అంకితమౌతారు. సినిమాలో మహేష్‌బాబు భరత్ రామ్ అనే పాత్రలో ముఖ్యమంత్రిగా కనిపిస్తారు. సినిమాలో ఆయన మోస్ట్ హ్యాండ్సమ్ చీఫ్ మినిస్టర్‌గానే కాకుండా చాలా డైనమిక్‌గా కనిపిస్తారు.

Share

Leave a Comment