భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను .. సాంగ్ అదుర్స్

శ్రీమంతుడు చిత్రం తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రంపై భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యమంత్రి పాత్రలో మహేశ్‌బాబు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్‌ను యూనిట్ విభిన్నమైన విధానంలో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ ఓథ్, టీజర్లు అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మార్చి 25న (ఆదివారం) విడుదల చేసిన ఫస్ట్ సాంగ్ మహేష్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

మహేష్ లుక్‌ కు తగ్గట్టుగా ఈ పాటను కూడా స్టైలిష్‌గా రూపొందించారు. సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌ హాలీవుడ్‌ పాటలను గుర్తు చేసేలా క్లాస్‌ ట్యూన్‌తో ఆకట్టుకున్నాడు.

విరచిస్తా నేడే నవశకం.. నిలదీస్తా నిత్యం జనహితం.. నలుపెరుగని సేవే అభిమతం.. కష్టం ఏదైనా సమ్మతమే అంటూ సాగే పాట ఆలోచింపజేసే విధంగా ఉంది. ఆ పాట మీకోసం..

పాట మొత్తం ముఖ్యమంత్రి పనులను, బాధ్యతలను, సమాజసేవను గుర్తుచేసేలా ఉంది. రామజోగయ్య శాస్త్రీ అందించిన సాహిత్యం నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణాలను తెలుపుతూ, బాధ్యతలను తెలియజేసేలా ఉంది.

భరత్ అనే నేను..హామీ ఇస్తున్నాను. బాధ్యున్నై ఉంటాను. ప్రజల కొరకు, ప్రజల చేత ప్రతినిధిగా ఉంటాను..అంటూ సాగే ఈ లిరిక్స్ లో ఎంతో నిగూఢమైన అర్థం దాగుంది. డేవిడ్ సిమన్ ఈ పాటకు గాత్ర దానం చేశారు.

సౌండింగ్‌, మ్యూజిక్ ఇనిస్ట్రుమెంటేష‌న్‌, గాత్రం ఇవ‌న్నీ కొత్త‌గా అనిపించాయి. ‘భ‌ర‌త్ అనే నేను’ ఆల్బ‌మ్‌కి ప‌ర్‌ఫెక్ట్ బిగినింగ్ ఇది. చాలా ఫ్రెష్ గా ఉంది. లిరికల్ వీడియో కూడా చాలా బాగా ప్రెసెంట్ చేసారు.

ఒక్కమాటలో చెప్పాలంటే మహేష్ అభిమానులకు ఈ పాట పండగలాంటిందే..!. నేటి రాజకీయ నాయకులు ఈ పాట విన్నాక.. ప్రజల నమ్మకానికి ఎంత దూరంలో ఉన్నారో అర్థమవుతుంది.

ఇక త్వరలోనే మిగిలిన పాటలను ఒక్కొక్కటిగా రిలీజ్ చేసి ఏప్రిల్ 7న జ్యూక్ బాక్స్ విడుదల చేయనున్నారు. ఏప్రిల్ 20న ఈ భరత్ అనే నేను ప్రేక్షకుల ముందుకు రానుంది.

Share

Leave a Comment