భరత్ కు బ్రహ్మరథం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఎన్నడూ లేనంత ఆనందంగా వున్నారు. శ్రీమంతుడు చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ భరత్ అనే నేను తో మరొక సారి తన కలెక్షన్ల స్టామినాని బాక్స్ ఆఫీస్ కి రుచిచూపించారు మహేష్.

ఇక తెలుగునాట భారీ సక్సెస్ కావడంతో తమిళంలో కూడా విడుదల చేసారు. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మే 31 న ‘భరత్ ఎన్నుమ్ నాన్’ టైటిల్ తో తమిళనాట విడుదల అయ్యింది. మొదటి రోజు న భారీ అంచనాలు అయితే లేవు కానీ మార్నింగ్ షో అయ్యాక పూర్తిగా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది భరత్ ఎన్నుమ్ నాన్.

మంచి టాక్ రావడంతో ఈ సినిమాకు అక్కడ తమిళ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 4 రోజుల్లో చెన్నై సిటీలో 7లక్షల గ్రాస్‌ను కలెక్ట్ చేసింది భరత్ ఎన్నుమ్ నాన్. దీంతో మరిన్ని థియేటర్లు పెంచారు అక్కడి పంపిణీదారులు. వెట్రి సినిమాస్ థియేటర్ యాజమాన్యం ఈ మేరకు ట్వీట్ కూడ పెట్టడం సూపర్‌స్టార్ క్రేజ్ కి నిదర్శనం. ప్రేక్షకుల కోరిక మీదట మరొక షో అదనంగా ప్రదర్శించబోతున్నాము అని వెల్లడించారు.

వెట్రీ సినిమాస్ ఒక్కటే కాదు, ఇంకా చాలా చోట్ల అదనపు షో లు ప్రదర్శిస్తున్నారు. శక్తి సినిమాస్, సంగీత సినిమాస్, వార్నాసి మల్టీప్లెక్స్, శ్రీ గజలక్ష్మీ సినిమాస్ ఇలా తమిళ నాట అనేక చోట్ల అదనపు ఆటలు ప్రదర్శింపబడుతున్నాయి.

ఈ వీకెండ్ భరత్ ఎనుమ్ నాన్ ఇంకా ఊపందుకుందని అదిరిపోయే కలెక్షన్లు రాబట్టిందని అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారు. స్పైడర్ చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించాడు మహేష్. తెలుగులో అంత బాగా ఆడకపోయినా తమిళంలో మంచి రన్‌తో మహేష్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

కేవలం సూపర్ స్టార్ మహేష్ ను చూసి సినిమా కి వెళ్ళిన తమిళ ప్రజలు అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు లో ఉన్న రాజకీయ పరిస్తితులు కూడా ఈ చిత్రాన్ని ఇష్టపడడానికి కారణం కావచ్చు. తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన భరత్ అనే నేను తమిళ్ వెర్షన్ లో కూడా హిట్ దిశగా దూసుకుపోతోంది .

ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి స్పెయిన్ లో విహారయాత్రలో ఆనందంగా గడుపుతున్నారు సూపర్ స్టార్ మహేష్. ఇక హీరోగా ఆయన నటించబోయే ప్రతిష్టాత్మక 25వ చిత్రం షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

Share

Leave a Comment