గూగుల్ స్పెషల్ ట్రీట్

తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సుదీర్ఘ కాలంగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న ఆయన అందం తో పాటు నటన గురించి వర్ణించడం ఎవరితరం కాదు. ప్రస్తుతం మనమందరం డిజిటల్ యుగం లో ఉన్నాము. సోషల్ నెట్‌వర్క్ లో మహేష్ కి ఉన్న పాపులారిటి ఏంటో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

సూపర్‌స్టార్ గురించి ఏ న్యూస్ వచ్చినా అవి కేవలం ట్విట్టర్ ఫేస్‌బుక్ లో ట్రెండ్ అవ్వడమే కాకుండా గూగుల్ లో కూడా ట్రెండ్ అవ్వడం కేవలం సూపర్‌స్టార్ కే సాధ్యపడింది. మామూలుగా తమ అభిమాన హీరో పుట్టిన రోజు అయితే ఫాన్స్ కి పండగే. అలాంటిది ఈ రాకుమారుని పుట్టిన రోజున ఫాన్స్ ఊరుకుంటారా. సోషల్ మీడియా మొత్తం నిన్న మహేష్ పుట్టిన రోజు సందేశాలతో నిండిపోయింది.

ఇదొక్కటి చాలు మహేష్ కి ఉన్న ఫాన్స్ ఫాలోయింగ్ గురించి. ప్రతి ఏడాది వలే ఈ ఏడాది కూడా మహేష్ బాబు బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ని సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో విపరీతంగా ట్రెండ్ చేసారు ఆయన ఫ్యాన్స్. మహేష్ పుట్టినరోజు సందర్భంగా సరిలేరు నీకెవ్వరు ఇంట్రో కూడా విడుదలవ్వడం అభిమానులు మరింత ఉత్సాహంగా ఉన్నారు.

హ్యాపీబర్త్‌డేఎస్ఎస్ఎంబీ అనే హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ ను ముంచెత్తారు. ఫ్యాన్స్ ఏకంగా 8.3 మిలియన్ల ట్వీట్స్ తో సరికొత్త చరిత్రని సృష్టించారు. ఇది కేవలం సౌత్ ఇండియాలోనే కాదు, యావత్ ఇండియాలోనే అతి పెద్ద ట్రెండ్. ఈ ట్యాగ్ తో పాటు సరిలేరు నీకెవ్వరు ట్యాగ్ కూడా నిన్న ట్రెండ్ అయ్యింది. దీంతో ఎక్కడ చూసినా మహేష్ గురించే చర్చ జరిగింది సోషల్ మీడియాలో.

గూగుల్ ట్రెండ్స్ లో స్థానం పొంది మహేష్ కి నేటి యూత్ లో ఎంత క్రేజ్ ఉందో తెలియజేసింది. గూగుల్ ఇండియా తమ ట్విట్టర్ ఖాతా నుండి మహేష్ బాబు ట్రెండ్స్ లో స్థానం పొందారు అని ఒక స్పెషల్ ఆనిమేషన్ రూపొందించి విడుదల చేశారు. గూగుల్ ఇండియా ఇలా మహేష్ గురించి ప్రత్యేకంగా ఒక వీడియో పోస్ట్ చేయడం ఇదే మొదటి సారి కాదు.

ఇంతకుముందు స్పైడర్ చిత్రం అప్పుడు కూడా ఇలానే రెండు వీడియోలను రూపొందించారు. భరత్ అనే నేను కు ఒక వీడియో రూపొందించారు. అలాగే మహర్షి ఫస్ట్ లుక్ కి కూడా ఒక యానిమేషన్ వీడియోను విడుదల చేసింది గూగుల్. అంటే ఇప్పుడు ఇది అయిదో సారి అనమాట. సౌత్ ఇండియా లోనే గూగుల్ ఇండియా ఆనిమేషన్ లో అయిదు సార్లు స్థానం సంపాదించిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు.

వేరే ఏ నటీనటులకు కూడా గూగుల్ ఇండియా ఆనిమేషన్ రెండు సార్లు చేయలేదు. అదీ సూపర్‌స్టార్ కు ఉన్న పాపులారిటీ. తనకున్న క్రేజ్ ఎంటో మరోసారి అందరికీ తెలిసేలా చేసాడు సూపర్‌స్టార్. టాలివుడ్ ని ఎప్పుడు ఒక మెట్టు పైన ఉంచడానికి మహేష్ కొత్త కాన్సెప్ట్స్ ని ఎంచుకుంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు టోటల్ సౌత్ లో ఎవరికి దక్కని ఫీట్ సాదించి మరోసారి టాలివుడ్ స్థాయి ని పెంచాడు మహేష్.

రెండు రోజుల క్రితం అతిపెద్ద రికార్డుగా మహేష్ బాబు కామన్ డిస్ప్లే పిక్చర్ హ్యాష్ ట్యాగ్ ట్వీట్స్ తో 2 మిలియన్ల ట్వీట్స్ సాధించి సరికొత్త రికార్డుని దక్కించుకున్న మహేష్ ఫ్యాన్స్, మహేష్ బాబు పుట్టిన రోజున అత్యధిక ట్వీట్స్ తో ఇండియా వ్యాప్తంగా ట్విట్టర్ ని పరుగులెత్తించారు అనే చెప్పాలి. ఇక సరిలేరు నీకెవ్వరు మేజర్‌ అజయ్‌కృష్ణ రిపోర్ట్‌ చేయడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.

పుట్టినరోజు నాడు ఇంట్రో టీజర్‌తో ఆడియన్స్‌కు మంచి కిక్‌ ఇచ్చాడు మహేష్. మహేష్ బాబు హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటించారు. ఈ చిత్రంలో మేజర్‌ అజయ్‌కృష్ణ పాత్రలో నటిస్తున్నారు మహేష్. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

సరిలేరు నీకెవ్వరు.. నువ్వెళ్లే రహదారికి జోహారు… సరిలేరు నీకెవ్వరు.. ఎనలేని త్యాగానికి నువ్వే మారుపేరు అనే లిరిక్స్‌తో ఇంట్రో టీజర్‌ అదిరింది. మహేష్ ను బ్యాక్ షాట్ లో నుంచి చూపిస్తూ టేబుల్ మీద గాగుల్స్, వాకీ టాకీని చూపించి నెక్స్ట్ షాట్ లో సోల్జర్స్ బ్యాచ్ ని రివీల్ చేసి ఆపై స్టైలిష్ గా దర్జాగా దేశ రక్షణకు భద్రత ఇచ్చే మేజర్ అజ‌య్ కృష్ణ గా మహేష్ ఇచ్చిన ఎంట్రీతో రచ్చ మాములుగా లేదు.

తన ట్రేడ్ మార్క్ వాకింగ్ స్టైల్ తో చంపేసాడు అంతే. సైనికుడి గొప్పదనాన్ని వివరిస్తూ హీరో పాత్ర ఇంట్రోకి లింక్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి ఐడియా బాగుంది. మొత్తానికి ఊహించిన దాని కన్నా స్పెషల్ గిఫ్ట్ అందుకున్నారు అభిమానులు. రాజేంద్రప్రసాద్, విజయశాంతి కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు ఈ ఒక్క వీడియోతో క్రేజ్ లో కూడా సాటెవ్వరు అనే తరహాలో ఉండటం విశేషం.

Share

Leave a Comment