మహేష్‌కు టైట్ సెక్యూరిటి

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేష్ కి కేంద్రం బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వాల్సి వచ్చిందా? అయితే అంతటి సాహసోపోతమైన పని ఆయనేం చేశారు? ఆయనకు శత్రువులు ఎవరున్నారు? అంటూ సందేహాలు కలగొచ్చు.

అయితే దానికి కారణమేంటో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను జమ్మూ కాశ్మీర్లో చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తారు కాబట్టి దానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను కశ్మీర్‌లో చిత్రీకరించారు. అయితే, ఈ షెడ్యూల్ చేయడానికి యూనిట్ చాలా కష్టపడిందట.

అక్కడ ఊహించని కొన్ని పరిణామాల నడుమ ఊపిరి బిగబట్టి షూటింగ్ చేశారు. ఆ సమయంలో ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. రేపే మాపో రద్దు చేయడం ఖాయమనే ప్రచారం జమ్మూ కశ్మీర్‌లో మొదలైంది. అలాంటి సమయంలో అక్కడ సరిలేరు నీకెవ్వరు షూటింగ్ జరపాల్సి వచ్చింది..

సరైన సమయంలో నిర్మాతలు సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే అంతా సజావుగా సాగి తిరిగి హైదరాబాద్ కి రాగలిగింది సరిలేరు టీమ్. అసలింతకీ ఏం జరిగింది అంటే కశ్మీర్ లో దుర్భేధ్యమైన హహల్గాం, శ్రీనగర్ ఏరియాల్లో ఈ సినిమాకి సంబంధించి నాలుగు వారాల పాటు చిత్రీకరణ సాగింది. ఎట్నుంచి ఏ ప్రమాదం పొంచి ఉందోనన్న టెన్షన్.

ఆ క్రమంలోనే నిర్మాత అనీల్ సుంకర తెలివిగా వ్యవహరించారు. ఆయన కేంద్ర భద్రతా శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నుంచి అనుమతి తీసుకుని షూటింగును కొనసాగించారు. అలాగే మహేష్ కి బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందిగానూ అనుమతిలో కోరారు. అందుకు అనుమతులు లభించాయి. ఎంతో క్లిష్ఠతరమైన రిస్కీ ప్లేస్ అయిన పహల్గాంకి చేరడమే ఒక సవాల్ అనుకుంటే ఈ ప్రత్యేక పరిస్థితి ఊహించనిది.

అంతేకాదు అక్కడ కాల్షీట్ అంటే 9 ఏఎం నుంచి సాయంత్రం 6 పీఎం కానేకాదు. వేకువజామున 5 గంటల నుంచి ఉదయం 10 గంటల లోపు మాత్రమే షూటింగులకు అనుమతించారట. అలా జమ్మూకశ్మీర్‌లో ఆగస్టు 4వ తేదీకల్లా షూటింగ్ పూర్తి చేసిన యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చింది. ఆగస్టు 5వ తేదీన అక్కడ ఆర్టికల్ 370 రద్దు చేయడంతో పాటు ఆంక్షలు విధించారు.

దీనిని బట్టి ఆర్టికల్ 370 రద్దు అవుతోందన్న టెన్షన్ జమ్ము కశ్మీర్ పరిసరాల్లో అప్పటికే ఉంది. సరిలేరు టీమ్ ఎన్నో ముందస్తు జాగ్రత్తలు తీసుకుందని అర్థమవుతోంది. కేంద్ర మంత్రి సాయం అందకపోయి ఉంటే మరి ఏమయ్యేదో? నిరంతరం ఎంతో సెన్సిటివ్ గా ఉండే చోట షూటింగులు అంటే ఎంతో రిస్క్ ఉంటుంది. నిరంతరం ఆర్మీ గస్తీ మధ్య ఎంతో బెరుకుగానే షూటింగులు చేయాల్సి ఉంటుంది.

ఇటీవలే హైదరాబాద్ షెడ్యూల్ ఫినిష్ చేసిన చిత్రబృందం కేరళ రాష్ట్రంలో షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ముందుగా షెడ్యూల్ ప్రకారమే సరిలేరు నీకెవ్వరు షూటింగ్ చకచకా జరిగిపోతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 70 శాతం మేర పూర్తయిందని తెలుస్తోంది. తాజాగా కేరళ షెడ్యూల్‌తో దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుందని అంటున్నారు.

మహేష్‌బాబుతో పాటు రష్మిక, ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, సంగీత తదితరులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మహర్షి లాంటి భారీ హిట్ తర్వాత మహేష్ నుండి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు

Share

Leave a Comment