తండ్రికి తగ్గ వారసురాలు

అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సూప‌ర్‌స్టార్ కృష్ణ గారి సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇంత చిన్న పిల్లాడు ఏం నటిస్తాడబ్బా అనుకున్నవాళ్ళే ఎక్కువ. కానీ వాళ్ళ అంచనాలు తలకిందులు చేస్తూ నాన్నతో పోటీగా నటించి పోరాటం మొదలుకుని బాలచంద్రుడు దాకా జైత్రయాత్ర అలా కొనసాగించాడు మహేష్.

ఇప్పటికీ టీవీ ఛానల్స్ ఈ సినిమాలు చూస్తే ముచ్చటేస్తుంది. ఇక నేనేం తక్కువా అంటూ మహేష్ తనయ సితార కూడా సినిమాల్లో కాదు కానీ యుట్యూబ్ వేదికగా తన టాలెంట్ ని పరిచయం చేసే పనిలో పడింది. మహేష్ బాబు గారలపట్టి సితార గురించి అందరికీ తెలిసిందే. ఈ చిన్నారికి సంబంధించిన ముఖ్య అప్‌డేట్స్‌ను ప్రిన్స్, నమత్ర ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంటారు.

అయితే ఇప్పటి వరకు సితార పాడిన పాటలు, చేసిన అల్లరి అన్ని సోషల్ మీడియా పేజ్‌లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఇప్పుడు సితార డిజిటల్‌ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్యాతో కలిసి ఇద్దరి పేర్లు వచ్చేలా ఆద్యా అండ్ సితార అని యుట్యూబ్ వేదికగా కొత్త ఛానల్ మొదలుపెట్టేసింది.

మహర్షి మూవీ సమయంలో మహేష్ ఫ్యామిలీ, వంశీ పైడిపల్లి ఫ్యామిలీ ఎక్కువగా కలిసి గడిపారు. ఈ క్రమంలో సితార, ఆద్య మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఇద్దరూ కలిసి సెట్లో చాలా సందడి చేసే వారని సినిమా యూనిట్ సభ్యులు చెబుతుండేవారు. ఇకపై సితార-ఆద్య కలిసి చేసే అల్లరి, సందడి మనం కూడా చూడొచ్చు. తమ ముద్దు ముద్దు మాటలు, ఆటలతో నెటిజన్లను అలరిస్తున్నారు.

ఈ ఛానల్‌ నుంచి ఫస్ట్ వీడియోను జులై 18, 2019 పోస్ట్ చేశారు. ఈ వీడియోలో తమను తాము పరిచయం చేసుకోవడంతో పాటు 3 మార్కర్స్‌ ఛాలెంజ్‌ పేరుతో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో సితార, ఆద్యాలు బొమ్మలకు కలర్స్‌ ఫిల్ చేయటంలో ఒకరితో ఒకరు పోటి పడ్డారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే 30 వేలకు పైగా వ్యూస్‌ సాధించటం విశేషం.

సితార, ఆద్యాల వీడియోను మహేష్ తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేస్తూ మీ ఇద్దరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. ఇకపై ఇందులో చిన్నపిల్లలను ఆకట్టుకునే వీడియోలు ఆటలు విదేశీ విశేషాలు కాంటెస్టులు బోలెడు ఉంటాయట. కిడ్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ కూడా దీనికి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మిలియన్ల మోత మోగడం ఖాయం.

వృత్తిపరంగా అనుబంధం ఏర్పడినా అంతకన్నా ఎక్కువ బాండింగ్ తో మహేష్ వంశీ ఫ్యామిలీస్ కలివిడిగా ఉంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఇద్దరూ కలిసే వెళ్లడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో ఎదిగిన స్నేహమే ఈ సితార ఆద్యల యుట్యూబ్ ఛానల్ కి దారి తీసింది. పిల్లలు ఇలాంటి వయసులోనే ఇంత క్రియేటివ్ గా ఆలోచించడం కన్నా తల్లితండ్రులకు కావాల్సింది ఏముంది.

భరత్ అనే నేను, మహర్షి సినిమాల తరువాత మహేష్ బాబు కెరీర్‌లో హాట్రిక్ మూవీగా రాబోతోంది సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం కాష్మీర్‌లో సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు విడుదల కానుంది.

Share

Leave a Comment