సూపర్‌స్టార్ ఫిట్‌నెస్ సీక్రెట్

వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌ను నటించిన 25వ సినిమా మహర్షి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అనంతరం తన ఫ్యామిలీతో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హాలీడే కు విదేశాలకు వెళ్ళిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా ప్రపంచకప్ మ్యాచులు చూసేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు మన ప్రిన్స్. మహర్షి సినిమా లో మహేష్ కొత్త లుక్ లో కనిపించి మనల్ని అలరించారు.

కొత్త లుక్ తో పాటు సూపర్ ఫిట్ గా కనిపించారు మహేష్. సూపర్ స్టార్ లుక్స్ కి టాలీవుడ్ లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఎవరూ పోటీ పడలేరు అన్నది అందరికీ తెలిసిన విషయమే. రోజురోజు కు తన గ్లామర్ ను పెంచుకుంటూ వెలుతున్న మహేష్ సీక్రెట్ ఏంటి అని తెలుసుకోడానికి అందరికీ ఆశక్తిగానే ఉంటుంది.

ఇదే ప్రశ్నను మహేష్ ను అడిగితే ప్రత్యేకంగా ఏం లేదు, ఆనందంగా ఉండడమే కారణం అని చెపుతూ ఉంటారు. దాంతో పాటుగా మన మహేష్ ఫిట్‌నెస్ ను కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ సీక్రెట్స్ మీ కోసం. మహేష్‌ ఏడాదిలో 365 రోజులూ వ్యాయామం, ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారని చెబుతారు అతడి ఫిట్‌నెస్‌ ట్రైనర్లు.

షూటింగ్‌ వల్ల రాత్రి ఎంత ఆలస్యమైనా కూడా పొద్దున్నే జిమ్‌లో వర్క్ అవుట్ లు చేసి తీరాల్సిందే. ఆహారం విషయాని కొస్తే మహేష్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటారంట. రోజులో అయిదారు సార్లు కొద్ది కొద్దిగా తింటారు మహేష్. ఓట్స్‌, గుడ్లు, పండ్లు, నట్స్‌ కలగలిపి ఉండే ‘మష్‌’ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు. వర్కవుట్‌ తర్వాత ఏదైనా షేక్‌ తాగుతారు.

లంచ్‌లో బ్రౌన్‌ రైస్‌, క్వినోవాలతో పాటు చికెన్‌, ఫిష్‌, మటన్‌లలో ఒకటి తింటారు. డిన్నర్‌కి కార్బొహైడ్రేట్స్‌ లేదా ప్రొటీన్‌ ఇచ్చే పదార్థాల్ని తీసుకుంటారు మహేష్. బ్రౌన్‌ బ్రెడ్‌తో గుడ్లు, చికెన్‌ ఉండాలి. మహర్షి టైమ్ లో మన మహేష్ కి ట్రైనర్ గా ఉన్న మినాష్ గాబ్రియల్ మహేష్ కి ఇస్తున్న ట్రైనింగ్ గురించి, మహేష్ ఫిట్‌నెస్ గురించి ఇలా చెప్పుకొచ్చారు.

‘మహేష్ బాబు గారికి ట్రైనర్ గా ఉండడం నాకు చాలా గొప్ప జర్నీ. ఆయన ఒక అత్యుత్తమ అథ్లెట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాను వర్క్అవుట్ చేసే ప్రతీ సెషన్ కి చాలా కేర్ తీసుకుంటారు. ప్రతీ సెషన్ లో కూడా తాను చేసే వర్క్అవుట్లని అత్యుత్తమంగా చేయాలని ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తారు. చేసే ప్రతీ వర్క్అవుట్ ని కూడా పర్‌ఫెక్ట్ గా చేస్తారు.

అలాంటి విన్నింగ్ మైండ్‌సెట్ యే మహేష్ ని వేరేవాళ్ళ నుండి చాలా ప్రత్యేకంగా నిలబెట్టింది’ అని తెలిపారు మినాష్ గాబ్రియల్. మహేష్ బాబు కి ఫిట్‌నెస్ మీద ఎంత అవగాహన ఉందో ఆయనతో పనిచేసిన తోటి నటీనటులు చెప్తూ ఉంటారు. పలు సందర్భాల్లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ ఈ విషయం గురించి చెప్పారు. మహేష్ ఒక ఫిట్‌నెస్ ఫ్రీక్ అని చాలా డెడికేటెడ్ గా వర్క్ అవుట్స్ చేస్తారు అని, చాలా సార్లు డైట్, వర్క్ అవుట్స్ గురించి మాట్లాడుకున్నాం అని తెలిపారు.

జిమ్ లో మహేష్ తన ట్రైనర్స్ తో వర్క్అవుట్స్ చేస్తూ ఉన్న ఫొటోలు ఇది వరకు కూడా చాలా వచ్చాయి. మహేష్ తో క్రిస్ గెతిన్, కుమార మన్నవ లాంటి ట్రైనర్లు కూడా పనిచేసారు. ఇలాంటి ఫొటోలు వచ్చిన ప్రతీసారి అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఫిట్‌నెస్ కు మహేష్ ఎంత ప్రాధాన్యత ఇస్తారో దీని బట్టే మనకు అర్థమవుతుంది.

25 వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఆరో వారంలోకి అడుగుపెడుతున్న మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది.

ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది. చూస్తుంటే మహర్షి జోరు ఇప్పటిలో ఆగేలా లేదు. మరో వారం రోజులు ఈ సినిమా జోరుగానే వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.

ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఉన్న మహేష్ తిరిగి రాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. సరిలేరు నీకెవ్వరు మూవీ మే 31 వ తేదీన సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుందని సమాచారం.

జీ.ఎం.బి ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఏ.కె ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ పై మహేష్ బాబు, దిల్ రాజు మరియు అనిల్ సుంకర సంయుక్తంగా రూపొందించనున్న సరిలేరు నీకెవ్వరు మూవీ లో రష్మిక మందన్న కథానాయిక. కథ ప్రకారం మహేష్ ఇందులో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తారని సినిమా ప్రారంభోత్సవం రోజునే దర్శకుడు క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో విజయశాంతి గారు నటిస్తున్న సంగతి తెలిసిందే. రాజ‌కీయాల కార‌ణంగా 13 ఏళ్లు సినిమాల‌కు విరామం తరువాత ఈ మూవీ ద్వారా రీఎంట్రీ అవడం విశేషం. రాజేంద్ర ప్ర‌సాద్‌ గారు, జ‌గ‌ప‌తి బాబు గారు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ క్యాస్ట్ తోనే సరిలేరు నీకెవ్వరు సినిమాపై అంచనాలను అమాతం పెంచేస్తున్నారు దర్శకుడు అనిల్ రావిఫూడి.

Share

Leave a Comment