రోడ్లు వేసి వెళ్లిపోయే శ్రీమంతుడు కాదు

అమ్మాయిల కలల రాజకుమారుడు ఆయన. అభిమానులకు సూపర్ స్టార్ ఆయన. నిజజీవితంలో శ్రీమంతుడు. అందుకే గ్రామాల్ని దత్తత తీసుకుని రంగులు, రోడ్లు వేసి వెళ్లిపోకుండా అక్కడి ప్రజల సమస్యలు తీరుస్తున్నారు. ఊరి నుంచి చాలా తీసుకున్నాం. తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావైపోతాం అనేది పాలసీగా మారింది. పేరుకు సూపర్ స్టారే అయినా చాలా వినయంగా ఉంటారు. వృత్తిపరంగా ఎప్పుడూ వివాదాల్లోనూ తలదూర్చలేదు. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా వెండితెరకు పరిచయమై నేడు కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్న సూపర్‌స్టార్ మహేష్‌బాబు. సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఓసారి చూద్దాం.

మహేష్‌ కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన ఫేస్ బుక్ ఖాతాను 53 లక్షల మందికిపైగా లైక్ చేశారు. ట్విటర్ లో ఆయన్ను 8.3 మిలియన్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. మహేష్‌ 25 మందిని ఫాలో అవుతున్నారు. ఇన్ స్టాగ్రామ్ లో 3.6 మిలియన్ల మంది మహేష్‌ ను ఫాలో అవుతుండగా 27 మందిని ఆయన ఫాలో అవుతున్నారు. 2018 జనవరి 25న ఇన్ స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించారు. భరత్ అనే నేను సినిమా తొలి ప్రచార చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.

మహేష్‌ బాల్యం నుంచి పట్టాభి అనే వ్యక్తి ఆయనకు మేకప్ మ్యాన్ గా పనిచేస్తున్నారు. గత 25 ఏళ్లుగా ఆయన మహేష్‌ తోనే ఉన్నారు. పట్టాభితో చిన్నతనంలో దిగిన ఫొటోను మహేష్‌ పంచుకున్నారు. ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ తో ఫొటో దిగా. గత 24 ఏళ్లుగా ఆయన నాతో ఉన్నారు. ఆయన లేకపోతే నేను కెమెరా ముందు నిలబడలేను. ఈ ఫొటోను ఫొటోషాప్ చేయలేదు. నాకు ఇష్టమైన నీలిరంగు చొక్కాలో పట్టాభి అని గత ఏడాది పోస్ట్ చేశారు.

తన ముద్దుల కుమార్తె సితార చూసేందుకు అచ్చం తన తల్లి ఇందిరాదేవిలా ఉంటుందని ఓ సారి మహేష్‌ తెలిపారు. చిన్నారి ఫొటోను షేర్ చేస్తూ పింక్..గర్ల్ పవర్. తన రూపం అచ్చం నా తల్లిలా ఉంది అని అన్నారు. భరత్ అనే నేను సినిమాను మహేష్‌ తన తల్లి పుట్టినరోజున విడుదల చేశారు. అప్పట్లో ఇందిరా దేవి పాత ఫొటోను షేర్ చేస్తూ నా హృదయానికి దగ్గరైన, నాకు ఎంతో ప్రత్యేకమైన సినిమాను మా అమ్మ పుట్టినరోజున విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. జన్మదిన శుభాకాంక్షలు అమ్మ అని మహేష్‌ అన్నారు.

నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నమ్రత అని మహేష్‌ పలుమార్లు అన్నారు. తనను ప్రోత్సహించిన నమ్రతకు భరత్ అనే నేను సక్సెస్ తర్వాత థాంక్స్ చెప్పారు. ఆమెను ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాదు ఆయన స్నేహితురాలు కూడా నమ్రతేనట. ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మహేష్‌ నమ్రతతో కలిసి గతంలో తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ విష్ చేశారు. ఆమే తన ప్రపంచం అన్నారు.

షూటింగ్ లేకపోతే తన సమయాన్ని కుటుంబం కోసమే కేటాయిస్తారు. విహారయాత్రలకు వెళ్తుంటారు. సినిమా షూటింగ్ ఉంటే అదే నా లోకం. పేకప్ చెప్పాక భార్య, పిల్లల మీదే ధ్యాస. నేను జీవితాన్ని డిజైన్ చేసుకున్నాను అంటుంటారాయన. ఫ్యామిలీ ఫస్ట్ అంటూ నమ్రత, సితార, గౌతమ్ కలిసి ఉన్న ఫొటోను ఇటీవల షేర్ చేశారు. కృష్ణ తన రియల్ హీరో అని మహేష్‌ ఎప్పుడూ చెబుతుంటారు. తండ్రితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ నా రియల్ హీరో.. నా మార్గదర్శి.. నా పిల్లర్.. నా సర్వస్వం..నేను మీ కుమారుడ్ని కావడం గర్వంగా ఉంది. హ్యాపీ బర్త్ డే నాన్న అని మహేష్‌ ఆయనకు శుభాకంక్షలు చెప్పారు.

106 ఏళ్ల వీరాభిమాని రేలంగి సత్యవతి గతేడాది నవంబరులో మహేష్‌ కోసం రాజమండ్రి నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆ సమయంలో మహేష్‌ కు అంతులేని ఆనందం కలిగింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. పాత జనరేషన్ కు చెందిన ఆమెకు తన సినిమాలు నచ్చడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సత్యవతిని కలిసినందుకు ఆమెకంటే ఎక్కువ ఆనందపడ్డానని చెప్పారు.

మహేష్‌ ఆంధ్రా హాస్పిటల్ సిబ్బంది సహాయంతో అనేక మంది చిన్నారులకు వైద్య సేవలు అందించారు. తాను దత్తత తీసుకుని, వైద్య సేవలకు సహకారం అందించిన చిన్నారుల గురించి మహేష్‌ మాట్లాడుతూ పిల్లలు సర్జరీ సమయంలో నా పేరు వినగానే సంతోషంగా ఫీల్ అవుతున్నారని ఆంధ్రా హాస్పిటల్ రామారావు గారు చెప్పారు. ఈ జీవితానికి ఇంతకన్నా గొప్ప కాంప్లిమెంట్ ఏముంటుంది. పిల్లల జీవితాలను కాపాడటం చాలా గొప్ప విషయం అని అన్నారు.

సింగపూర్ లోని మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో మహేష్‌ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని సిబ్బంది హైదరాబాద్ కు తరలించి మహేష్‌ తో ఆవిష్కరించారు. ఆ సమయంలో మహేష్‌ పోస్ట్ చేశారు. దీన్ని చూసిన తర్వాత నా తొలి రియాక్షన్. మరో నన్ను చూసుకుని సర్ప్రైజ్ అయ్యా. దీనికన్నా సహజంగా విగ్రహాన్ని తయారు చేయడం కష్టం. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు చాలా సంతోషించారు అని అన్నారు.

మహేష్‌, విజయశాంతి కలిసి 1989లో నటించిన చిత్రం కొడుకుదిద్దిన కాపురం. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల తర్వాత వీరిద్దరూ సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మహేష్‌ విజయశాంతితో తీసుకున్న కొడుకుదిద్దిన కాపురం ఫొటోను షేర్ చేశారు. పాత రోజులు గుర్తొస్తున్నాయని అన్నారు.

స్విట్జర్లాండ్ లోని స్విస్ ఆల్ఫ్స్ తనకు ఎంతో ఇష్టమైన ప్రదేశమని నాలుగు రోజుల క్రితం మహేష్‌ పోస్ట్ చేశారు. ట్రిప్ లో తీసిన సెల్ఫీ షేర్ చేస్తూ ఈ భూమిపైన నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం ఇది. ది స్విస్ ఆల్ఫ్స్. నా కుటుంబంతో కలిసి షార్ట్ దసరా విరామాన్ని ఎంజాయ్ చేస్తున్నా. పూర్తి ఎనర్జీ నింపుకొని సెట్ లో అడుగుపెట్టబోతున్నా అని పోస్ట్ చేశారు. అంతేకాదు ఇదే ప్రదేశం అంటే తనకు చాలా ఇష్టమని నమ్రత అన్నారు.

ఓ ప్రముఖ మ్యాగజైన్ కోసం ఇటీవల మహేష్‌ ఫొటోషూట్ లో పాల్గొన్నారు. కొత్త లుక్ చాలా బాగుందని నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. దీంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఓ ఫొటోను మహేష్‌ మంగళవారం షేర్ చేశారు. ఎన్నో ఫొటోల్లో నాకు బాగా నచ్చిన ఫొటో ఇది. మీ అద్భుతమైన స్పందనకు థాంక్స్ అని పేర్కొన్నారు.

బాలనటుడిగా చేసిన తర్వాత మహేష్‌ తొమ్మిదేళ్లు విరామం తీసుకున్నారు. చదువులు పూర్తి చేసుకుని రాజకుమారుడు సినిమాతో 1999లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటకీ మురారి (2001) ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఒక్కడు ఆయన్ను స్టార్ ను చేసింది. పోకిరి రికార్డులు బ్రేక్ చేసి మహేష్‌ ను సూపర్ స్టార్ ను చేసింది. గతంలో కథల విషయంలో జరిగిన తప్పులు మళ్లీ జరగకుండా చూసుకుంటున్నా. ఏదో అరగంట కథ వినేసి, ఎగ్జైట్ అయిపోయి సినిమా చేయడం సరికాదు. ఇప్పుడు నేను కనీసం మూడు గంటలు కథ వింటున్నా. నచ్చితే అప్పుడు సంతకం చేస్తా. ఇవి ఫెయిల్యూర్స్ నేర్పిన పాఠాలు అని చెప్పారు మహేష్‌.

Share

Leave a Comment