అభినందించకుండా ఉండలేరు

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు సేవా కార్యక్రమాల్లో ముందుంటారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన బుర్రిపాలెం, సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకుని, వాటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా ఆయన మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు.

పేద క్రీడాకారుల కోసం మహేష్‌ గత కొద్ది నెలలుగా సాయం చేస్తు‍న్నారు. ఆయన చేసిన ఈ మంచి పని ఆలస్యంగా బయటకు వచ్చింది. మురికి వాడల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో సంస్థకు మహేష్‌ దంపతులు ఆర్థిక సాయం చేశారు.

అంతే కాదు ఈ సంస్థ ద్వారానే పేద క్రీడాకారుల కోసం ఉచిత స్పోర్ట్స్‌ రిహాబ్‌ సెంటర్‌ ప్రోగ్రామ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ గత ఆరేళ్లలో రోజుకు 150 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిందట. దీనికి మహేష్‌ బాబు-నమ్రతలు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఆ కేంద్రానికి వాళ్లిద్దరూ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎన్జీవో సంస్థ స్థాపకుడు ఓ ప్రకటన విడుదల చేశారు. మహేష్‌, ఆయన భార్య నమ్రత వారి ఆత్మ సంతృప్తి కోసం తమకు సాయం చేశారని చెప్పారు. ‘ఈ విషయాన్ని మేము ‘భరత్ అనే నేను’ సినిమా ముందే బయటపెట్టాలి అనుకున్నాం. కానీ సినిమా ప్రచారం కోసం ఇలా చేశారనే మాట రావడం మాకు ఇష్టం లేదు.

మహేష్‌ దంపతులు అవసరాల్లో ఉన్న వారికి వెంటనే సాయం చేయడం, ఆప్యాయంగా పలకరించడం నిజంగా అద్భుతం. వారి చక్కని వ్యక్తిత్వం చూసి నేను ఆశ్చర్యపోయాను. వారి ప్రొత్సహం అందుకుంటున్నందుకు సంతోషంగా ఉంది’’ అని ప్రకటనలో పేర్కొన్నారు.

రియల్ లైఫ్‌లోనూ పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలనే తలంపుతో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని తన సొంత ఊరు బుర్రిపాలెంను, తెలంగాణాలో సిద్దాపురంను దత్తత తీసుకుని పలు అభివృద్ది కార్యక్రమాలను చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.

రీల్ లోనే కాదు.. రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేష్ బాబు అనిపించేలా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది చెబుతారు. కానీ చెప్పింది చేసే వారు తక్కువే. కానీ తాను రెండో కోవలో ఉంటానని తన చేతలతోనే చేసి చూపించాడు ప్రిన్స్ మహేష్.

ఈ రోజుల్లో చిన్న చిన్న పనులకే భారీ పబ్లిసిటీ కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటిది మహేష్ బాబు ఇంతలా చేస్తున్నా..పబ్లిసిటీకి దూరంగా ఉంటున్నారు. చాలా తక్కువ మాట్లాడుతారు, సందర్భం వచ్చినప్పుడు చేతల్లోనే తమ సత్తా ఏంటో చూపిస్తారు.

Share

Leave a Comment