జీవితాంతం గుర్తు పెట్టుకుంటాం

రీల్ లో పోషించే పాత్రలే కాదు, రియల్ లోనూ అదే తీరుతో వ్యవహరించటానికి మించింది ఏముంటుంది? ఊరిని దత్తత తీసుకోవటం, అవసరమైన వారికి సాయం చేయటానికి వెనుకా ముందు ఆడకపోవటం, భారీగా ఆర్థిక సాయానికి మాట ఇవ్వటం లాంటివి రీల్ లైఫ్ లో హీరో పాత్రల్లో చూస్తుంటాం. రీల్ లోనే కాదు రియల్ గానూ గుట్టు చప్పుడు కాకుండా సాయం చేసేందుకు సిద్ధమయ్యారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రాంతానికి చెందిన పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం మహేష్ బాబు దృష్టికి వచ్చింది. దీంతో ఆ చిన్నారి ఆపరేషన్ కు అవసరమైన మొత్తాన్ని తానే చెల్లిస్తానని ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చారు మహేష్. టెక్కలి ప్రాంతానికి చెందిన సందీప్ అనే పదమూడు నెలల చిన్నారి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు.

ఆ చిన్నారి గుండెలో మూడు హోల్స్ ఉన్నాయి. శస్త్ర చికిత్స అవసరమని చాలా త్వరగా ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు. ఆర్థికంగా వెనకబడిన ఆ చిన్నారి తల్లిదండ్రులు ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ విషయం జిల్లా మహేష్ బాబు సేవాసమితి అధ్యక్షులు ఉంకిలి శ్రీనివాస్ రావు దగ్గరకు వెళ్ళింది.

దీంతో ఉంకిలి శ్రీనివాస్ రావు మహేష్ బాబుకు సమాచారమందించడంతో ఏపీలోని విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో సందీప్ కు శస్త్ర చికిత్స చేయించడానికి మహేష్ బాబు ముందుకొచ్చారు. ఈనెలలోనే బాబుకు శస్త్రచికిత్స చేస్తున్నారు. దీంతో ఆ చిన్నారి తల్లి దండ్రులు ఆనందానికి అవధులు లేవు. మహేష్ సాయాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

రీల్ లోనే కాదు రియల్ లోనూ సాయం చేసే విషయంలో తాను శ్రీమంతుడినేనన్న విషయాన్ని మహేష్ చేతల్లో చెప్పేశారని చెప్పాలి. మహేష్ బాబు అనేక మంది చిన్నారులకు హృద్రోగ శస్త్రచికిత్సలకు అవసరమైన సాయం అందిస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి ఆయన చిన్నారులకు హృద్రోగ శస్త్రచికిత్సలను అందించనున్నారు.

ఈ నెల అంటే అక్టోబరు 14 నుంచి 20 వరకు మరియు డిసెంబరు 1 నుంచి 7 వరకు విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్ లో ఈ గొప్ప పనికి నాంది పలకనున్నారు మహేష్ బాబు. గత మూడున్నరేళ్లలో మ‌హేష్ వెయ్యి మందికి పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించారు. మహేష్ తో కలిసి ఆంధ్రా హాస్పిటల్స్ వివిధ గ్రామాల్లో 18 క్యాంప్‌లు నిర్వహించింది.

ఇప్పటివరకు ఆంధ్రా హాస్పిటల్స్, యు.కె కు చెందిన హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండేష‌న్‌ల‌తో క‌లిసి వెయ్యి మంది చిన్న పిల్ల‌ల గుండె ఆప‌రేష‌న్స్ విజ‌యవంతం కావ‌డంలో భాగం అయ్యారు. శస్త్రచికిత్స తర్వాత చిన్నారుల వైద్య సేవకు అవసరమయ్యే మెడికల్ ఖర్చులని కూడా మహేష్ బాబే చూసుకుంటున్నారని ఆంధ్రా హాస్పిటల్స్ ప్రకటించింది.

మహేష్‌ దంపతులు అవసరాల్లో ఉన్న వారికి వెంటనే సాయం చేయడం, ఆప్యాయంగా పలకరించడం నిజంగా అద్భుతం. తమ అభిమాన హీరో ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని ఆకాంక్షిస్తున్నారు. మ‌హేష్ దంప‌తులు చేస్తున్న ఈ మంచి ప‌నికి అన్ని వైపుల నుండి ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి. ప్రతి ఒక్కరు మహేష్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

మహేష్ ఇలాంటి మంచి పనులు ఇలానే కొనసాగిస్తూ తోటివారికి ఆదర్శంగా నిలవాలని అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేష్ బాబు అనిపించేలా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది చెబుతారు. కానీ చెప్పింది చేసే వారు తక్కువే. కానీ తాను రెండో కోవలో ఉంటానని తన చేతలతోనే చేసి చూపిస్తున్నారు ప్రిన్స్.

Share

Leave a Comment