మరో ఘనత సాధించిన సూపర్‌స్టార్

సాధారణంగా ఏళ్లు గడిచేకొద్ది అందం తగ్గిపోతుంటుంది అంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలో అలా కాదు. సినిమా సినిమాకీ ఆయన అందం రెట్టింపవుతోంది. ఇందుకు తాను తీసుకునే ఆహారమే కారణమని సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకానొక సందర్భంలో తెలిపారు. అందుకే ఆయన ‘టైమ్స్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌’లో చోటు సంపాదించుకున్నారు.

గత కొన్నేళ్లుగా బాలీవుడ్‌ సూపర్‌స్టార్స్‌ సల్మాన్‌ ఖాన్‌, షారుక్‌ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, ఆమిర్‌ ఖాన్‌లు ఈ జాబితాలో చోటు దక్కించుకుంటూ వస్తున్నారు. టైమ్స్ మ్యాగజైన్ ప్రతి యేటా మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాను తయారుచేస్తుంటుంది. దానితో పాటే ఫరెవర్ డిజైరబుల్ క్లబ్ పేరుతో ఇంకో జాబితాను ప్రకటిస్తుంది. ఈ జాబితాకు ఒక ప్రత్యేకత ఉంది.

అదేమిటంటే ప్రతి ఏడాది మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో టాప్ స్థానంలో నిలుస్తున్న కొందరికి మాత్రమే ఇందులో చోటుంటుంది. ఈ క్లబ్‌లో చోటు దక్కినవాళ్ల పేర్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో ఉంచరు. ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌’ అంటేనే ఇండియాలోనే టాప్ లిస్ట్ అనమాట. ఎందుకంటే మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో కొత్తవారికి చోటు కల్పించడం కోసమే.

ఇప్పటి వరకు ఈ జాబితాలో సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, ఆమీర్ ఖాన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోలు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆ లిస్టులో చోటు దక్కించుకున్నారు. ప్రతిసారి మహేష్ మోస్ట్ డిజైరబుల్ జాబితాలో టాప్ స్థానంలో వస్తుండటంతో ఆయన పేరును ఫరెవర్ డిజైరబుల్ క్లబ్‌లో చేర్చేశారు.

మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్‌లో సులువుగా చోటు దక్కించుకునే అవకాశం ఆమిర్‌, సల్మాన్‌, అక్షయ్‌, షారుక్‌, మహేష్ బాబుకు ఉంది. కానీ ఏటా ఎందరో యువ నటులు చిత్ర పరిశ్రమకు పరిచయమై యువత మనసులు దోచుకుంటున్నారు. అందుకే టైమ్స్‌ సంస్థ మరో కొత్త లిస్ట్‌ను ప్రవేశపెట్టింది. ఈ లిస్ట్‌లో కేవలం కొత్త వారికి మాత్రమే చోటు ఉంటుంది.

ఇప్పటివరకు ఏ దక్షిణాది హీరోకి ఈ గౌరవం లభించలేదు. మహర్షి చిత్ర విజయంతో దూసుకుపోతున్న ఈ టాలీవుడ్‌ ప్రిన్స్‌ కు ఇది మరో ఘనత అని చెప్పాలి. ‘టైమ్స్‌ మోస్ట్‌ ఫరెవర్‌ డిజైరబుల్‌ క్లబ్‌’ లో యాడ్ కావడంతో మన సూపర్ స్టార్ కు ప్రజాదరణ మరింత విస్తరించిందనడానికి ఈ టైమ్స్‌ గుర్తింపే నిదర్శనం.

మహర్షి చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్నారు. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రను పోషించారు. రైతుల సమస్యలను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకలోకం మహర్షి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన పలు సన్నివేశాలు అన్నివర్గాల ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పేందుకు బుధవారం (మే 15) నాడు సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌కి మహేష్ బాబు మహర్షి టీం తో సహా వెళ్ళి వారిని కలిసారు. అదే వేదికపై మహర్షి సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ తేదీని ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న పెద్ద ఎత్తున స‌క్సెస్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌నున్నారని చెప్పారు.

మహర్షి గ్రాండ్ సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి సిద్ధార్థ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ దీనికి వేదిక కాబోతోంది. మే 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మహర్షి టీమ్ మొత్తం హాజరు కాబోతున్నారు.

స్నేహం, సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంగా ఉన్న ఈ సినిమాకు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిపస్తున్నారు. మహర్షి సినిమాతో రైతుల గురించి చెప్పడంతో ఏకంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు. మహర్షి ఎఫెక్ట్‌తో వీకెండ్ వ్యవసాయం అనే నయా ట్రెండ్ క్రియేట్ అయింది.

Share

Leave a Comment