పోకిరిని మించి..

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మనందరికి తెలిసిందే.

ఆ సమయంలో జరిగిన ప్రశ్నోత్తరాలు చాలా ఆశక్తిగా కొనసాగాయి. అవి మరోసారి మీకోసం.చాలా సంవత్సరాల తర్వాత అభిమానులను సంతృప్తిపరిచేలా సినిమాను తీయడం సంతోషంగా ఉందని అన్నారు మహేశ్‌బాబు.

ప్రశ్న: సర్‌.. ఒక పాన్‌ ఇండియా సినిమా ఎప్పుడు తీస్తారు? ఖలేజా లాంటి ఎనర్జీ కలిగిన మహేశ్‌ ను చూశాం. పోకిరి తరహా మహేశ్‌ మాకు కావాలి.

మహేశ్‌బాబు: ప్రస్తుతం ఒక హిట్‌తో చాలా సంతోషంగా ఉన్నా. భవిష్యత్‌లో అదృష్టం బాగుంటే చేయబోయే సినిమా పాన్‌ ఇండియా మూవీ అవుతుంది. దాని మనం ప్లాన్‌ చేయలేం. ఒకటి ఇస్తే సరిపోవడం లేదనుకుంటా.. ఈ సక్సెస్‌ను నాతో పాటు మీరు ఎంజాయ్‌ చేయండి. పోకిరి కి మించి వేరే చేద్దాం..

ప్రశ్న: సరిలేరు నీకెవ్వరులో సీతరామరాజుగా కృష్ణగారు కనిపించడం మీకు ఎలా అనిపించింది? సినిమా చూసి కృష్ణగారు ఏమన్నారు?

మహేశ్‌ బాబు: ఈ సీన్‌ చెప్పగానే నా ఒళ్లు గగుర్పొడిచింది. తెరపై చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది. నేనే హీరో కావడం, నా సినిమాలోనే ఆ సీన్‌ ఉండటం అదృష్టం. ఈ సినిమా చూసిన తర్వాత ఫోన్‌ చేసి పండగ అయ్యేలోగా నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవుతుంది అని చెప్పారు. అల్లూరి సీతారామరాజు ట్రాక్‌ కూడా చాలా బాగా ఉందని మెచ్చుకున్నారు.

ప్రశ్న: రెండేళ్లకొకసారైనా మాకు ఇలాంటి మాస్‌ సినిమాలు కావాలి? దయ చేసి గుర్తుంచుకోండి.

మహేశ్‌బాబు: చాలా అద్భుతమైన ప్రశ్న. దూకుడు తర్వాత ఒక మాస్‌ జోనర్‌లో సినిమా చేయలేదని చాలా మంది ఫిర్యాదు చేస్తున్నారు. శ్రీమంతుడు నుంచి కంటెంట్‌ ఉన్న చిత్రాలకు ప్రాధాన్యం ఇచ్చా. భరత్‌ అనే నేను, మహర్షి అవన్నీ స్క్రిప్ట్‌కు లోబడి చేయాల్సి వచ్చింది. దర్శకుడు చెప్పింది నాకు నచ్చాలి. లేకపోతే చేయలేను.

నాకు కూడా మాస్‌ సినిమా చేయాలని ఉంది. అదే సమయంలో మీరు (అనిల్‌ రావిపూడి) వచ్చి కథ చెప్పారు. ఫ్యాన్స్‌ ఏది కోరుకుంటున్నారో అది మీ దగ్గర ఉందని అర్థమైంది. అందుకే సినిమా చేయాలన్న నిర్ణయం తీసుకున్నా. నా నిర్ణయం సరైనదేనని అనిపించింది. అయితే, ఇంత పెద్ద హిట్టవుతుందని మాత్రం నేను ఊహించలేదు.

ప్రశ్న: అనిల్‌ రావిపూడి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. మీరు చాలా మంది దర్శకులతో పనిచేశారు. మరి అనిల్‌ రావిపూడిలో ఏం చూశారు?

మహేశ్‌బాబు: చెప్పలేనంత ఎనర్జీ కలిగిన వ్యక్తి. అద్భుతమైన టాలెంట్‌. దర్శకుడిగా రాబోయే దశాబ్దాన్ని ఏలుతాడు. ఈ విషయం చాలా ఇంటర్వ్యూలో చెప్పా. చాలా రిలాక్స్‌గా ఉంటారు. మధ్యలో కామెడీ పంచ్‌లు వేస్తుంటారు. అదే సమయంలో యూనిట్‌ మొత్తం ఆయన కంట్రోల్‌లో ఉంటుంది.

ప్రశ్న: ఆర్మీ వాళ్లను సరిలేరు నీకెవ్వరు చిత్ర బృందం ఎప్పుడు కలుస్తుంది? తొలిసారి ఆర్మీ దుస్తులు వేసుకోవడం మీకు ఎలా అనిపించింది? మీరు నిజంగా ఆర్మీ మేజర్‌లాగానే ఉన్నారు.

మహేశ్‌బాబు: కశ్మీర్‌లో ఆర్మీతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లు కూడా మాకు చాలా అనుమతులు ఇచ్చారు. ఆర్మీ దుస్తులు వేసి టెస్ట్‌ షూట్‌ చేయడం ఇప్పటికీ నాకు గుర్తుంది. చాలా గర్వంగా ఉంది. త్వరలోనే ఆర్మీ వాళ్లతో సమావేశం అవుతాం అని అనిల్ రావిపుడి గారు తెలిపారు.

ప్రశ్న: ఏ సీన్‌ చేస్తుండగా మీ ఒళ్లు గగుర్పొడిచింది? మీ బలం ఏంటి? మీ గత చిత్రాలతో పోలిస్తే, సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మీరెంత రేటింగ్‌ ఇస్తారు? మ్యావ్‌.. మ్యావ్‌ పిల్లి.. అనిల్‌ రావిపూడితో సినిమా ఎప్పుడు మళ్లీ?

మహేశ్‌బాబు: ఇంటర్వెల్‌ ఎపిసోడ్‌. ఆ సీన్‌లో పాత్రలు, సన్నివేశాలు, భావోద్వేగాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయి. పరిశీలించడం.. ప్రతి విషయాన్ని శ్రద్ధగా పరిశీలిస్తా. తోటి నటుల నుంచే కాదు, నా సహాయకుల నుంచి కూడా నటన నేర్చుకుంటా. అదే నా బలం. అనిల్‌ రావిపూడి ఒక సినిమా చేస్తారు. అది అయిన వెంటనే ఆయనతో నా సినిమా ఉంటుంది.

ప్రశ్న: మైండ్‌ బ్లాక్‌ పాటలో డ్యాన్స్‌ అదరగొట్టేశారు. భవిష్యత్‌లో ఇలాంటి డ్యాన్స్‌లు మీరు చేయాలి. సరిలేరు నీకెవ్వరుకు వచ్చిన ఉత్తమ ప్రశంస ఏది? భవిష్యత్‌లో ఏదైనా సినిమాలో పాటల పాడే అవకాశం ఉందా?

మహేశ్‌బాబు: దర్శకుడు అనిల్‌రావిపూడి ఆలోచన అది. ఇక రాబోయే ప్రతి సినిమాలో నా నుంచి ఇలాంటివే కోరుకుంటారేమో.. రాబోయే నా ప్రతి సినిమాలో రెండు పాటలకు శేఖర్‌ మాస్టర్‌ను ఫిక్స్‌ చేస్తా. నేను అనుకున్నదాని కన్నా పదింతలు ఎక్కువగా అభిమానుల నుంచి స్పందన వచ్చింది. ఇలాంటి అభినందనలు వచ్చి ఏడెనిమిది ఏళ్లు అవుతోంది. నా అభిమానులకు హ్యాట్సాఫ్‌.

ప్రశ్న: ఘట్టమనేని మూడు తరాలను ఒక సినిమాలో చూడవచ్చా? మీ ఫ్యాన్స్‌ గురించి ఒక్క మాటలో చెప్పండి? సినిమాలతో పాటు మీ అభిరుచులు ఏంటి?

మహేశ్‌బాబు: ఇలాంటి గొప్ప ఫ్యాన్స్‌ నాకు ఉండటం నా అదృష్టం. నచ్చితే నచ్చిందని చెబుతారు. నచ్చకపోతే నచ్చలేదని చెబుతారు. దూకుడు తర్వాత నా అభిమానుల నుంచి ఈ స్థాయి స్పందన రాలేదు. నాకు కూడా చేయడం ఇష్టమే. అయితే, అలాంటి సినిమాకు అనిల్‌ రావిపూడి మాత్రమే చేయగలరు. వెంటనే అనిల్‌ రావిపూడి అందుకుని మీతో సినిమా అంటే ఈసారి సరికొత్తగా ఉంటుంది.

Share

Leave a Comment