మహేష్ స్పెషల్ ఇంటర్వ్యూ

మేడ‌మ్ టుసాడ్స్ రూపొందించిన సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైద‌రాబాద్‌లోని ఏఎంబీలో ఈ రోజు ఉద‌యం మ‌హేష్‌బాబు స్వయంగా విడుద‌ల చేశారు. ప్రస్తుతం ఈ విగ్రహం అహూతుల్ని అలరిస్తోంది. ఈ సందర్భంగా ఏఎంబీ మాల్ లో సందడి వాతావరణం నెలకొంది. ఈ కార్య‌క్ర‌మంలో మేడ‌మ్ టుస్సాడ్స్ త‌ర‌ఫున అలెక్స్ పాల్గొన్నారు. మహేష్ మైనపు విగ్రహాన్ని వీక్షించేందుకు అసలు రెండు కళ్లు సరిపోవు అంటూ వ్యాఖ్యానించారంతా.

మ‌హేష్ మాట్లాడుతూ ‘నా విగ్ర‌హాన్ని హైద‌రాబాద్ లో, ఇక్క‌డి సినీ ప్రియుల మ‌ధ్య విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. గ‌తేడాది వాళ్లు నన్ను సంప్ర‌దించారు. ర‌క‌ర‌కాల క‌ళ్లను, రంగు రంగుల జుట్టును తీసుకొచ్చి నాకు పోల్చి చూశారు. అదంతా మామూలుగా చేస్తున్నార‌ని, కొల‌త‌లు తీసుకుంటున్నార‌ని అనుకున్నా. కానీ వారు విగ్ర‌హాన్ని మ‌లిచిన తీరు చాలా బావుంది. న‌న్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. ఒక‌సారి వాళ్లు ఆ ఫొటోల‌ను నాకు పంపించారు. వాటిని నా భార్య‌తోనూ, కొంత‌మంది స‌న్నిహితుల‌తోనూ పంచుకున్నాను.

వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫొటో షూట్ చేశాన‌ని అనుకున్నారు. అంత బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసిన‌ట్టుగా చేసిన ఇవాన్ రీజ్‌, బెంటానా త‌దిత‌ర టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. నాకు నా విగ్ర‌హాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్ప‌గా, ఉత్కంఠ‌గా, ఒకింత భ‌యంగా, అన్నీ భావాలు క‌లగ‌లిసిన‌ట్టుగా ఉంది. భార‌త‌ దేశానికి చెందిన ప‌లువురు సెల‌బిట్రీల బొమ్మ‌లు అక్క‌డున్నాయ‌ని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్లాల‌ని కూడా అనుకుంటున్నా’ అని చెప్పారు.

మేడ‌మ్ టుస్సాడ్స్ అలెక్స్ మాట్లాడుతూ ‘యునిక్ అకేష‌న్ ఇది. తొలిసారి మేం ఒక వ్యాక్స్ స్టాట్యూని సింగ‌పూర్ కాకుండా, మ‌రోచోట విడుద‌ల చేస్తున్నాం. తొలిసారి మేం హైద‌రాబాద్‌కు వ‌చ్చాం. తెలుగు సినిమా స్టార్ స్టాట్యూని సింగ‌పూర్‌లో విడుద‌ల చేయ‌డం కూడా ఇదే తొలిసారి. మ‌హేష్‌ని ఎంతో మంది రిఫ‌ర్ చేశారు. మా టీమ్ 20 మంది ఆరు నెల‌లు క‌ష్ట‌ప‌డి ఈ స్టాట్యూని చేశారు. దాదాపు మ‌హేష్‌కి సంబంధించిన 200 మెజ‌ర్‌మెంట్స్ తీసుకున్నారు. కంటిపాప నుంచి అన్నీ కొల‌త‌లు తీసుకున్నారు. షారుఖ్‌ఖాన్‌, అమితాబ్‌బ‌చ్చ‌న్‌, ఇప్పుడు మ‌హేష్‌బాబు స్టాట్యూని విడుద‌ల చేయ‌డం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఆ త‌ర్వాత జ‌రిగిన ప్ర‌శ్న‌ జ‌వాబుల కార్య‌క్ర‌మం వివ‌రాలు. * మ‌హేష్‌ గారు ఇది వ‌ర‌కు మీరు ఎప్పుడైనా మేడ‌మ్ టుసాడ్స్ వెళ్లారా? అప‌్పుడు మీకు ఎలా అనిపించింది? – ఆరేళ్ల క్రితం లండ‌న్‌లో మ్యూజియమ్‌కి వెళ్లాను. నా పిల్ల‌లు చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. అక్క‌డ ఉన్న మైన‌పు విగ్ర‌హాల‌తో ఫొటోలు తీసుకున్నారు. వాళ్ల‌ను చూసిన త‌ర్వాత ఎప్పుడో ఒక‌రోజు నా బొమ్మ ఇక్కడికి వ‌స్తుంద‌ని అనుకున్నా. ఇప్పుడు అది జ‌రిగింది. సింగ‌పూర్ మేడ‌మ్ టుస్సాడ్స్ కి ధ‌న్య‌వాదాలు. చాలా ఆనందంగా ఉంది.

* అలెక్స్ సింగ‌పూర్‌కి బ‌య‌ట తొలిసారి ఈ స్టాట్యూని విడుద‌ల చేయ‌డానికి కార‌ణం ఏంటి? – నిజ‌మే. తొలిసారి మేం ఇలా ఆవిష్క‌రిస్తున్నాం. మ‌హేష్ ఇక్క‌డ చాలా పెద్ద సూప‌ర్‌స్టార్‌. ఆయ‌న ఫ్యాన్స్ కు అందుబాటులో ఉండాల‌ని చేశాం. * హైద‌రాబాద్ సిటీ ఎలా ఉంది? – హైద‌రాబాద్ చాలా బావుంది. ప్ర‌జ‌లు ఈ లాంచ్ కి స‌పోర్ట్ చేయ‌డం చాలా బావుంది.

* మీ మైన‌పు ప్ర‌తిమ‌ను చూస్తుంటే ఏమ‌నిపిస్తోంది మ‌హేష్‌? – చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. మేడ‌మ్ టుస్సాడ్స్ సింగ‌పూర్ వాళ్లు ఇంత బాగా చేశారు. మా పిల్ల‌ల ముందు విడుద‌ల చేయ‌డం చాలా బావుంది. టీమ్‌కి థాంక్యూ. * `మ‌హ‌ర్షి` గురించి చెప్పండి? – నా 25వ సినిమా. నా బిగ్గెస్ట్ సినిమా అవుతుంది.

* మీ బొమ్మ‌తో మీకు మాట్లాడే అవ‌కాశం వ‌స్తే ఏం మాట్లాడుతారు? – ఎలా ఉన్నావు.. బావున్నావా.. అని మాట్లాడుతా. (న‌వ్వుతూ) స్టాట్యూ చాలా బావుంది. * మీ ఐ, హెయిర్ అలాగే చేశారు? ఎలా సాధ్య‌మైంది? – మెజ‌ర్‌మెంట్స్ అని ఒక‌సారి వ‌చ్చారు. స‌రేన‌ని ఇచ్చాను. కానీ ఇంత డీటైలింగ్‌గా ఉంటుంద‌ని అనుకోలేదు. నా పాదం సైజ్‌, నా చేతుల సైజు, నా రంగు, నా చ‌ర్మం, నా గోళ్లు… ఇలా అన్నీ నాలాగే ఉన్నాయి.

* ఇక మీకు సెల్ఫీ డిమాండ్ త‌గ్గుతుందేమో? – నాకు సెల్ఫీలు వ‌చ్చినా నా బొమ్మ‌కు సెల్ఫీలు వ‌చ్చినా సేమే క‌దా. * ఈ బొమ్మ‌ను చేయ‌డానికి ఎన్ని రోజులు ప‌ట్టింది అలెక్స్? – 20 మంది 6 నెల‌లు ప‌నిచేశారు. చాలా కేర్ తీసుకుని చేశారు. * ఇలాంటి వ‌న్నీ సింగ‌పూర్‌లో పెడ‌తారు. మ‌రి హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టారు? – నా షెడ్యూల్స్ టైట్ వ‌ల్ల అక్క‌డికి వెళ్ల‌డానికి కుద‌ర‌లేదు. అందుకే వాళ్లు ఇక్క‌డికి వ‌చ్చారు. అది హాన‌ర్‌. నా పిల్ల‌ల ముందు దీన్ని విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది.

* మీ సినిమాల్లో ఈ స్టాట్యూని చూడొచ్చా? – సింగ‌పూర్ మ్యూజియ‌మ్‌కి వెళ్లి చూడొచ్చు. సినిమాల్లో కాదు. * మ‌హేష్ స్టాట్యూని చేయ‌డానికి కార‌ణం ప్ర‌త్యేకంగా ఏదైనా? – ప్ర‌పంచంలోని ప‌లువురు చేసిన రిక్వెస్ట్ కార‌ణంగా మేం ఇది చేశాం. * మీ స్టాట్యూ పెడుతున్నార‌ని తెలియ‌గానే ఇంట్లో వాళ్లు ఏమ‌న్నారు? – మా ఆవిడ ఈ విష‌యాన్ని నాతో చెప్పింది. చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. నాకు ఏదో అచీవ్ చేసిన‌ట్టు అనిపించింది.

* మైన‌పు విగ్ర‌హం చూడ‌గానే ఇద్ద‌రు భ‌ర్త‌లున్నార‌ని న‌మ్ర‌త అన్నారు – ఇద్ద‌రు మ‌హేష్‌ బాబులున్నార‌ని ఆవిడ మాట‌కు అర్థం అండీ. * మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? – చాలా చాలా గౌర‌వంగా, థ్రిల్‌గా, ఆనందంగా ఉంది. * ఈస్టాట్యూని చేయ‌డానికి మీరేమైనా స‌జెష‌న్స్ ఇచ్చారా? – అలాంటిదేమీ లేదు.

* ఈ లుక్ ఏ సినిమాలోది? – ఈ లుక్ శ్రీమంతుడులో లుక్‌. శ్రీమంతుడు లో ఆ పోజు బావుంద‌ని చెప్పి, అలా పోజు ఇవ్వ‌మ‌ని అడిగారు. అలాగే ఇచ్చాను. నా అన్నీ ఫొటోలు చూశారు. ఏది బావుంటే, దాన్ని బ‌ట్టి తీసుకున్నారు. * భ‌ర‌త్ అనే నేను త‌ర్వాత హాలిడే వెళ్లారు. మ‌హ‌ర్షి త‌ర్వాత ఏంటి? – ఇంకా పెద్ద హాలిడేకి వెళ్తాం. ఎందుకంటే ఇంకా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం.

ఇక ఈ వేదిక వద్ద మహేష్ పై మీడియా ఫ్లాష్ లు మిరుమిట్లు గొలిపాయి. మహేష్ తన మైనపు విగ్రహం చెంతకు వెళ్లి ఓ సెల్ఫీ తీసుకోవడం అభిమానులకు కన్నుల పండువగా కనిపించింది. ఇన్నాళ్లు మహేష్ తో సెల్ఫీ కోసం ఎగబడ్డారంతా. అలాంటిది సూపర్ స్టారే స్వయంగా ఆ విగ్రహంతో సెల్ఫీ దిగడం చర్చకు వచ్చింది. ఇక మహేష్ అభిమానులంతా దూరం నుంచే ఆ విగ్రహంతో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం ఆ సెల్ఫీ ఫోటోలు మహేష్ అభిమానుల సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. పూర్తి నల్ల రంగు సూట్ లో ఉన్న విగ్రహం చెంత దానికి పూర్తి ఆపోజిట్ పింక్ కలర్ డ్రెస్ లో మహేష్ కనిపించడం ఆసక్తికరం. ఈ రోజు అంతా ఏఎంబీ మాల్ లో ఈ మైనపు విగ్రహాన్ని సందర్శకుల కోసం ఉంచుతారు. అటుపై డైరెక్టుగా సింగపూర్ కి ఈ విగ్రహాన్ని తరలించనున్నారు.

అదే విగ్రహాన్ని లండన్ లోనూ ఆవిష్కరిస్తున్నామని మ్యాడమ్ టుస్సాడ్స్ ప్రకటించింది. మహేష్ బ్లాక్ సూట్ ధరించి ఆ కుడి చేతిని గడ్డానికి ఆన్చిన వైనం మైమరిపించింది. అంత స్మార్ట్ గా ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దిన టుస్సాడ్స్ శిల్పుల పనితనంపై పొగడ్తల వర్షం కురిసింది. మీడియా నుంచి టుస్సాడ్స్ నిర్వాహకులు ప్రశంసలు అందుకున్నారు.

Share

Leave a Comment