చిన్న చిన్న మాటలతో మ్యాజిక్ చేసారు

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ మూవీ మహర్షి చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అభిమానులు పాటల తాలుకు ప్రకటన వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫస్ట్ ఆడియో సింగల్ ఆన్ లైన్ లో విడుదలైపోయింది. ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది.

ఛోటీ ఛోటీ బాతే అనే పల్లవితో మొదలయ్యే ఈ పాట సంగీత ప్రియులని ఎంతగానో అలరిస్తుంది. హిందీలో మొదలుపెట్టి కాలేజీ క్యాంపస్ లో స్నేహితుల మధ్య ఉండే బాండింగ్ గురించి అల్లుకున్న తీరు ఆకట్టుకునేలా ఉంది. ఎన్నో వేల కథలు అరె ఇంకో కథ మొదలు అంటూ పల్లవికి ఫినిషింగ్ ఇచ్చిన తీరు డెప్త్ ని సూచిస్తోంది.

దేవి శ్రీ ప్రసాద్ చక్కని బాణీలు అందించడమే కాక స్వయంగా ఆలపించారు. శ్రీ మణి లిరిక్స్ అందించారు. పూజా హెగ్డే, మహేష్‌, అల్లరి నరేష్ ఈ ముగ్గురి స్నేహం, వారి ప్రయాణం నేపథ్యంలో సాంగ్‌ని రూపొందించారు. ప్రతి స్నేహానికి ఓ కథ ఉంటుంది. ఈ గీతంలో మీ స్నేహోత్సవాన్ని ఆస్వాదించండి అంటూ వంశీపైడిపల్లి ట్విట్టర్‌లో తెలిపారు.

లిరికల్ వీడియో విజువల్స్ లో మొన్న పోస్టర్ ఇచ్చిన స్టిల్ తో పాటు ఆన్ ది షూట్ వర్కింగ్ షాట్స్ కూడా పంచుకున్నారు. పాట సాంతం స్నేహంలోని గొప్పదనం గురించి తల్లితండ్రులు ఇవ్వలేనిది చెలిమిలో ఏది ఎలా దొరుకుతుందో వివరిస్తూ రాసిన సాహిత్యం సింపుల్ పదాలతో క్యాచీగా ఉండటమే కాదు రిపీట్ మోడ్ లో వెళ్లేలా చేసింది.

నేస్తమంటే ఏమిటంటే…కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట..అంటూ రాసిన లిరిక్స్ యూత్ ని ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఇలా పాట మొత్తం ఫ్రెండ్‌షిప్ కి అద్దం పట్టేలా చాలా అందమైన సాహిత్యం తో వినసొంపు గా ఉంది. సందర్భానుసారంగా వచ్చే పాట కాబట్టి ఆన్‌స్క్రీన్ ఇంకా అదిరిపోతుంది అని అందరూ అనుకుంటున్నారు.

ఈ లిరికల్ వీడియో కూడా చాలా యునీక్ గా ఉండడం మరో విశేషం. స్నేహానికి అద్దం పట్టేలా చాలా ఆశక్తికరంగా ఈ వీడియో ని తయారుచేసారు. స్నేహానికి సంబందించిన క్లిప్ ఆర్ట్స్ తో పాటు మహేష్, పూజ, నరేష్ ల స్టిల్స్ ని బ్లెండ్ చేసిన తీరు చాలా బాగుంది.

దేవి పాటల్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. చాలా ఫాస్ట్ గా అందరికీ నచ్చేస్తాయి. కుర్రకారు అయితే దేవి పాటలని అమితంగా ఇష్టపడతారు. ఇప్పుడు వారి టాప్ లిస్ట్ లోకి చోటి చోటీ బాతే కూడా చేరిపోయింది. ఫస్ట్ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ రావడం తో ఇప్పుడు మిగాతా పాటాలు కూడా ఇదే రేంజిలో ఉంటాయి అని అభిమానులు సంబరపడుతున్నారు.

ఏది ఏమైనా ఇప్పుడు ఈ మహర్షి సాంగ్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. విడుదలైన కొద్ది సేపట్లోనే వేల సంఖ్య లో లైక్స్ మరియూ లక్షల్లో వ్యూస్ రావడం తో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఛోటీ ఛోటీ బాతే ఇంకా ట్రెండ్ అవుతున్నే ఉంది.

మహేష్ బాబు లుక్ అటు క్లాస్ ని ఇటు మాస్ ని అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రం లో నరేష్ క్యారెక్టర్ చాలా కీలకమైనదన్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజ కూడా తన రోల్ చాలా కొత్తగా ఉంటుంది అని, మంచి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని తెలిపింది.

ఈ మూవీ చిత్రీకరణ తుదిదశకు చేరుకోగా, వేగవంతంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం మహేష్‌కి మంచి విజయం అందించడం ఖాయమని అభిమానులు అంటున్నారు. రెండు పాటలు బాకీ ఉన్నాయి. వాటిని ఏప్రిల్‌ తొలి వారంలో తెరకెక్కిస్తారు.

స్నేహంలోని మాధుర్యంతో పాటు కుటుంబ అనుబంధాలు నేపథ్యంలో రూపొందిస్తున్న ఎమోషనల్ డ్రామా ఇదని చిత్ర బృందం చెబుతున్న మాట.. సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. స్టూడెంట్ గా.. కంపెనీ సీ.ఈ.వోగా మహేష్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు.

ఇక ఈ మహర్షి సినిమాలో ఏ విధంగా అలరించనున్నాడో అని సినీ ప్రియులు అనుకుంటున్నారు. పైగా శ్రీమంతుడు, భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మహర్షి దాన్ని మించిన బ్లాక్ బస్టర్ గా నిలవడం గ్యారంటీ అని అభిమానులు అంటున్నారు.

దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ లాంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. వంశీ దాదాపు రెండేళ్ల పాటు స్క్రిప్ట్ పై పని చేసి ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లారు. ఇది ఆషామాషీ సినిమా కాదని, మహేష్ కెరీర్లో ‘ది బెస్ట్’ అనిపించుకోగల సత్తా దీనికి ఉందని నిర్మాత దిల్ రాజు ప్రకటించారు.

25వ సినిమా పై ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాటలు ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలుపెట్టుకుని ఎప్పుడెప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ని మహర్షిగా చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. మే నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share

Leave a Comment