సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్న

సూపర్‌స్టార్ మహేష్ సూపర్‌హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

ఇంతకుముందే విడుదలైన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా నిన్న సెకండ్ సింగిల్‌ను విడుదల చేశారు. ఇప్పుడు ఈ పాట కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

కొద్ది గంటల్లోనే ఈ లిరికల్ వీడియో 1 మిలియన్ మార్కు ని దాటేసింది. ఇంత తక్కువ సమయంలో ఇన్ని వ్యూస్ రావడం కేవలం సూపర్‌స్టార్ మహేష్ కే సాధ్యపడుతుంది అని నెటిజన్స్ ప్రసంశలతో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్ ట్రెండింగ్ లిస్ట్ లోకి కూడా చేరిపోయింది ఈ పాట.

‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేసేయ్ మిసైలులా…’ అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. దూసుకుపోతోంది.

ఈ బీట్ బేస్డ్ ట్యూన్ మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఇది టైటిల్ సాంగ్ గానే పరిగణించాలి. చాలా శక్తివంతమైన పదాలతో గీత రచయిత శ్రీమణి మహర్షి వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు హీరోయిజంకి నిజమైన డెఫినేషన్ లా ఉంది. ప్రాసతో ఆడుకున్న వైనం అతని కలంలో పెరుగుతున్న పరిణితిని సూచిస్తోంది.

అసలైన మేజిక్ లిరికల్ వీడియోలో ఉంది. మహేష్ సూపర్ కూల్ లుక్స్ తో పాటు ఓ పెద్ద కంపెనీకి సిఈఓగా అల్ట్రా స్టైలిష్ గా ప్రెజెంట్ చేసిన తీరు చూస్తే మళ్ళి మళ్ళి ఇది రిపీట్ మోడ్ లోకి వెళ్ళడానికి ఇవి చాలనిపిస్తుంది. స్లో పాయిజన్ లాగా వింటున్న కొద్దీ మరింత నచ్చేసేలా ఉంది ఈ పాట.

మొత్తానికి రెండో ఆడియో సింగల్ మహర్షిలో మ్యాటర్ ని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేసింది. ఓటమి భయమే ఉన్నోడెవడూ ఓడని ఋజువే నువ్వు…గెలుపుకే సొంతం అయ్యావు…అని మహర్షి సినిమాలోని రిషి క్యారెక్టర్ గురించి రాసినా అది మహేష్ కి నిజ జీవితం లో కూడా కరెక్టు గా సెట్ అవుతుంది అని అభిమానులు శ్రీమణి గారికి ట్వీట్స్ చేసి థాంక్స్ చేప్తున్నారు.

మహేష్‌బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే ‘మహర్షి’ సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు’ అని వంశీ పైడిపల్లి ఇటివల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

సినిమాపై ప్రతి ఒక్కరిలో భారీ అంచనాలున్నాయని, అయితే ‘మహర్షి’పై తనకు పూర్తి నమ్మకం ఉందని వంశీ తెలిపారు. ‘సినిమాకు పనిచేస్తోన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి నాకు పూర్తి మద్దతు వస్తోంది. రేపు విడుదలైన తరవాత ‘మహర్షి’ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే ఆత్మవిశ్వాసాన్ని వారు నాకు కలిగించారు’ అని వంశీ కొనియాడారు.

మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహర్షి కౌంట్ డౌన్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజు ఒక హ్యాష్‌ట్యాగ్ తో మహర్షి ని ట్రెండ్ చేస్తూ తమ ఆతురత ని తెలియజేస్తున్నారు.

మునుపెన్నడూ లేని విధంగా భారీ బిజినెస్ చేసింది మహర్షి. డిజిటల్‌, శాటిలైట్‌ రూపంలో ఈ చిత్రానికి రూ.47.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఆడియో హక్కులకు మరో రూ.2 కోట్లు. ఇక ఓవర్సీస్‌ హక్కులను మంచి రేటుకు సొంతం చేసుకున్నారు. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం ఇలా ఏరియాల పరంగా కూడా ఈ సినిమాని ఇది వరకే అమ్మేశారు. మొత్తమ్మీద రూ.140 కోట్ల లెక్క తేలుతోంది.

విడుదలకు ముందే ఇన్ని రికార్డులను సృష్టిస్తున్న మహర్షి ఇక విడుదల తరువాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల మాట. దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. జయసుధ, మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, సాయికుమార్, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Share

Leave a Comment