సరికొత్తగా మహర్షి

ఉన్నత భావాలు కలిగిన యువకుడతను. వ్యవసాయం అంటే మక్కువ ఎక్కువ. అగ్రికల్చరే నిజమై కల్చర్ అని బలంగా విశ్వసిస్తుంటాడు. నేల తల్లిని నమ్ముకుంటే ఏ లోటు ఉండదనేది అతని నమ్మకం. దీంతో పల్లెబాట నడిచి హలం పట్టుకుంటాడు. అలాంటి యువకుడి జీవిత ప్రయాణం ఏమిటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది అంటున్నది చిత్రబృందం.

సూపర్ స్టార్ మహేష్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్‌రాజు, అశ్వనీదత్, పీవీపీ నిర్మాతలు. పూజా హెగ్డే కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్రధారి. మహేష్‌ బాబు నటిస్తున్న 25వ చిత్రమిదే కావడంతో నిర్మాణ దశ నుంచే ఆసక్తిని రేకెత్తిస్తున్నది మహర్షి.

ఇటీవలే చెన్నైలో ఓ షెడ్యూల్ పూర్తిచేసుకుంని వచ్చారు మహర్షి బృందం. చెన్నై షెడ్యూల్ అవ్వగానే మరొక షెడ్యూల్ ప్రారంభం అయిపోయింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో షూటింగ్ జరుగుతున్నది. ఈ షెడ్యూల్ తర్వాత ఈ నెలాఖరులో దుబాయ్‌లో మరో షెడ్యూల్ ఉంటుంది. దాంతో మహర్షి షూటింగ్ పూర్తి అవుతుంది.

ఈ చిత్రంలో మహేష్‌ బాబు కాలేజీ విద్యార్థిగా, ఒక కంపెనీ అధినేతగా విభిన్న కోణాల్లో సాగే పాత్రలో కనిపిస్తారని సమాచారం. కొద్ది నెలల క్రితం పొల్లాచ్చిలో కొన్ని కీలక ఘట్టాల్ని తెరకెక్కించారు. కుటుంబ విలువల ఔన్నత్యాన్ని, రైతు గొప్పదనాన్ని తెలియజెప్పే ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది.

వేసవి కానుకగా మే 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని అందిస్తున్నారు. కె.యు.మోహనన్ సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన షెడ్యూల్ చాలా సందడి సందడి గా గడిచింది.

చిత్ర బృందంతోపాటు మహేష్‌ బాబు, వంశీ పైడిపల్లి కుటుంబాలు కూడా చెన్నై వెళ్లి అక్కడ సరదాగా ఎంజాయ్ చేశారు. అయితే మహేష్ కూతురు సితార, వంశీ కూతురు ఆద్య లతో దేవి శ్రీ గడిపిన సరదా క్షణాలు టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది. ఆ సంగతులను తెలుపుతూ ట్వీట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్.

ఈ మేరకు ‘నా కంపోజిషన్‌ సెషన్‌‌కి ఇద్దరు క్యూట్‌ అతిథులు వచ్చారు. వాళ్ళే సితార, వంశీ కుమార్తె ఆద్య. నా గిటారుతో సంగీతం వాయిస్తూ వాళ్లను ఇంప్రెస్‌ చేయడానికి ఎంతో ప్రయత్నించా. కానీ అది అంత సులభం కాదని తెలిసింది. పైగా వాళ్లే నన్ను సర్‌ప్రైజ్‌ చేశారు. వాళ్ల ముద్దుముద్దు మాటలతో చాలా నవ్వించారు.

ఇంతలా నేనప్పుడూ నవ్వలేదు. ఎంత గొప్ప సమయం. లవ్‌ యు కిడ్స్‌’ అని ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో పేర్కొన్నారు దేవి శ్రీ. దాంతో పాటు ఆయన కొన్ని ఫొటోలను కూడా జత చేసారు దేవిశ్రీప్రసాద్. ఆ ఫొటోలు మీ కోసం.

మహేష్ బాబు సినిమా అంటేనే నిర్మాణం మొదలు, ప్రమోషన్స్, రిలీజ్ ఇలా ప్రీ ప్రొడక్షన్స్ నుండి పోస్ట్ ప్రొడక్షన్స్ వరకూ అన్నీ భారీగానే ఉంటాయి. మహర్షి చిత్రాన్ని ముగ్గురు అగ్ర నిర్మాతలు దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారంటే ఈ చిత్ర భారీతనం గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మహర్షి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగా మే 9న భారీ విడుదలకు రెడీ అయ్యింది ‘మహర్షి’. మహేష్ ను వంశీ పైడిపల్లి ఏ విధంగా చూపించనున్నాడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Share

Leave a Comment