మహర్షి ఫస్ట్ వీక్ రికార్డులు

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ రాబట్టి మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. నిన్నటి తో మహర్షి వారం రోజుల రన్ ను పూర్తి చేసుకుంది.

దీంతో మహర్షి నిర్మాతల్లో ఒకరైన శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ వారు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్టర్ ను విడుదల చేసారు. సూపర్ స్టార్ కెరీర్ లో మొదటి వారంలో అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మహర్షి రికార్డు సృష్టించిందని దాని మీద డిక్లేర్ చేసారు. మహర్షి మొదటి వారానికి ఎంత కలెక్ట్ చేసింది అని మాత్రం వారు వెల్లదించలేదు.

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకలోకం మహర్షి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన పలు సన్నివేశాలు అన్నివర్గాల ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొదటి వారం రోజుల్లోనే 60 కోట్లకు పైగా షేర్ ను ఈ సినిమా రాబట్టిందని సమాచారం. మహర్షి వసూళ్లు ఏడవ రోజు అయిన బుధవారం నాడు కూడా అదరగొట్టే స్థాయిలోనే ఉన్నాయి. నైజాం ఏరియాలో మహర్షి మూవీ ముందు నుంచి అదరగొడుతోంది. ఏడో రోజు కూడా తన దూకుడు ను కొనసాగించింది.

తొలి ఆరు రోజుల్లో రూ. 20.54 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఏడవ రోజు సైతం ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. ఏడు రోజులకు నైజాంలో టోటల్ షేర్ దాదాపు రూ. 22 కోట్లకు రీచ్ అయింది అని సమాచారం. నైజాంలో ఏడు రోజుల కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డ్ ను నెలకొల్పింది మహర్షి. కళ్ళు చెదిరే షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించింది.

నైజాం ఏరియాలో సూపర్‌ స్టార్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్ లోని ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్ సినిమా కలెక్షన్లకు ఎంత ప్రత్యేకత ఉందో సినీ ప్రియులకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మహర్షి తో ఇక్కడ కూడా రికార్డును నెలకొల్పాడు మన మహేష్. ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్ థియేటర్లలో ఒక వారం లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా బాహుబలి2 తరువాత స్థానాన్ని మహర్షి సొంతం చేసుకుంది. బాహుబలి1 ని వెనక్కు నెట్టడం విశేషం.

ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్ థియేటర్లలో మొదటి వారం రూ. 92 లక్షలకు పైగా వసూళ్ళు రాబట్టి బాహుబలి2 తరువాత స్థానాన్ని కైవసం చేసుకుంది మహర్షి. నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ ఉన్న సినిమాల సంఖ్య మహేష్ కు మహర్షితో కలిపి 7కు చేరింది. పోకిరి, దూకుడు, బిజినెస్‌మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను ఇంతకు ముందు నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ ను రాబట్టాయి.

ఇప్పుడు ఈ మహర్షి తో ఏడు సినిమాలకు రూ.13కోట్లకు పైగా షేర్ ను సాధించిన ఏకైక హీరో అయ్యాడు సూపర్ స్టార్. ఇంకా ఏ హీరోకి కూడా నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు అయిదు కూడా లేవు. ఇక రూ.20కోట్లకు పైగా షేర్ సినిమాలైతే మహేష్ కు మూడు ఉన్నాయి. అవి శ్రీమంతుడు, భరత్ అనే నేను మరియు మహర్షి.

వేరే ఏ హీరోకు ఇన్ని రూ.20కోట్ల షేర్ సినిమాలు లేవు. తనను నైజాం నవాబ్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు సూపర్ స్టార్. ఇంకా తెలుగు రాష్ట్రాలలోని మిగతా ఏరియాల్లో కూడా బుధవారం మంచి వసూళ్ళను రాబట్టింది. వాటి అధికారిక లెక్కలు అందాల్సి ఉంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం వసూళ్ళతో నాన్ బాహుబలి రికార్డును మహర్షి సొంతం చేసుకుంతుంది.

ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పేందుకు బుధవారం (మే 15) నాడు సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌కి మహేష్ బాబు మహర్షి టీం తో సహా వెళ్ళి వారిని కలిసారు. అదే వేదికపై మహర్షి సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ తేదీని ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న పెద్ద ఎత్తున స‌క్సెస్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌నున్నారని చెప్పారు.

గతంలోనూ తన కెరీర్ లో సూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాల విజ‌యోత్స‌వ వేడుక‌ల‌ను విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించారు మహేష్ బాబు. మహర్షి సైతం ల్యాండ్‌మార్క్ మూవీ గా తన కెరీర్ లో నిలవటంతో ఈ సినిమా స‌క్సెస్ ఈవెంట్‌ని కూడా మే 18 సాయంత్రం బెజ‌వాడ‌లో నిర్వ‌హించాలని ఫిక్సయ్యారు. సో విజయవాడ ఫ్యాన్స్ సూపర్ స్టార్ కోసం సిద్ధంగా ఉండాలన మాట.

స్నేహం, సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంగా ఉన్న ఈ సినిమాకు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిపస్తున్నారు. ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాల దత్తత అంశాన్ని తీసుకొన్న మహేష్ బాబు ఆ తర్వాత ‘భరత్ అను నేను’ సినిమాలో రాజకీయాలను సృశించారు. తాజాగా ‘మహర్షి’ సినిమాతో రైతుల గురించి చెప్పడంతో ఏకంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు.

మహర్షి ఎఫెక్ట్‌తో వీకెండ్ వ్యవసాయం అనే నయా ట్రెండ్ క్రియేట్ అయింది. నగరాల్లోని యువత వీకెండ్‌లో తమ సొంతూరుకెళ్లి పొలాల్లో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మహర్షి జోష్ చూస్తుంటే మహేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా అవతరించడం ఖాయం అనిపిస్తోంది. ఒక్క ‘మహర్షి’ సినిమాతో మహేష్ బాబు తన ఖాతాలో ఎంతో పేరు ను మరియు బాక్సాఫీస్ రికార్డులను కూడా తిరగరాస్తున్నారు.

Share

Leave a Comment