ఆరోవారంలోనూ సరికొత్త రికార్డులు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ చిత్రం మే 9 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. నేటితో ఈ సినిమా విడుదలై 37 రోజులు పూర్తయ్యాయి. అంటే ప్రస్తుతం మహర్షి విడుదలై ఆరో వారంలోకి అడుగుపెట్టేసింది అనమాట. అయినా కూడా మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు.

ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది. ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎన్నో రికార్డులను బద్దలుకొటిన మహర్షి ఆరో వారం లో కూడా సరికొత్త రికార్డులను సృష్టిస్తుంది.

ఏదైనా సినిమా కి రోజులు పెరిగే కొద్దీ థియేటర్లు తగ్గుతూ వస్తూ ఉంటాయి. కానీ మహర్షి కి ధియేటర్లు తగ్గకపోగా కొన్ని చోట్ల ధియేటర్లను ఆరోవారంలో పెంచారు. దీని బట్టే మహర్షి సినిమాకి ప్రేక్షకులు ఏ రేంజ్ లో బహ్మరథం పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. నైజాంలో కలెక్షన్ల పరంగా ఇప్పటికే బాహుబలి సినిమాల తరువాతి స్థానంలో మహర్షి నిలిచిన సంగతి తెలిసిందే.

అయినా కూడా ఇంకా కలెక్షన్లు వస్తూనే ఉండడంతో ఆరో వారంలో ధియేటర్ల సంఖ్యను పెంచారు. ఆరో వారం నైజాంలో మహర్షి సినిమా ఇంకా 102 థియేటర్లలో నడుస్తుందంటే అది సూపర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ కి చిహ్నం. లాస్ట్ బ్లాక్‌బస్టర్ సినిమా కన్నా డబుల్ మార్గిన్ తో ఈ థియేటర్ల సంఖ్య ఉంది. ఇక హైదరాబాద్ ఆర్.టి.సి క్రాస్ రోడ్ కు ఉన్న ప్రత్యేకత తెలిసిందే.

ఒక సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలుపటానికి ఇక్కడ వచ్చే రన్ మరియు కలెక్షన్లే కొలమానంగా చూస్తాయి ట్రేడ్ వర్గాలు. ఇప్పటి వరకు ఆర్.టి.సి క్రాస్ రోడ్ లో మహర్షి రూ.1.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను కొల్లగొట్టింది. దీంతో ఈ సెంటర్ లో ఈ ఘనత సాధించిన నాలుగో సూపర్ స్టార్ సినిమాగా రికార్డు నెలకొల్పింది మహర్షి.

ఇంతకు ముందు శ్రీమంతుడు, పోకిరి, ఒక్కడు ఈ ఘనతను సాధించాయి. ఆర్.టి.సి క్రాస్ రోడ్ లో నాలుగు సినిమాలతో రూ.1.5 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కొల్లగోట్టిన ఏకైక హీరోగా నిలిచి తనను నిజాం నవాబ్ అని ఎందుకు అంటారో మరో సారి నిరూపించాడు మహేష్. ఇక కరీంనగర్లో అయిదు వారాలకు రూ.1.46 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది మహర్షి.

ఇది ఆల్ టైమ్ నాన్ బాహుబలి రికార్డు. ఉత్తరాంధ్రాలో తన డ్రీమ్ రన్ ను కొనసాగిస్తుంది మహర్షి. 36 రోజులకు రూ.12.25 కోట్లకు పైగా షేర్ ను కొల్లగొట్టింది మహర్షి. ఇక్కడ ఆరో వారంలో ఇంకా 35 థియేటర్లలో మహర్షి రన్ అవుతుంది. అయిదో వారం కన్నా థియేటర్ల సంఖ్య పెరగడం విశేషం. వెస్ట్ గోదావరిలో కూడా ఇదే జోరుతో దూసుకుపోతుంది మహర్షి.

భీమవరం లో మహర్షి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ విడుదలైన దగ్గర నుంచి వరుసగా 34 రోజులు లక్ష రోపాయల గ్రాస్ ను కొల్లగొట్టింది మహర్షి. ఇది వరకు బాహుబలి2 33 రోజుల పాటు ఈ మార్క్ ను అందుకుంది. రెస్టాఫ్ ఇండియాలో కూడా తన సత్తాను చూపించాడు మన సూపర్ స్టార్. బెంగళూరు నగరంలో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తుంది.

ఆరో వారంలో బెంగళూరు నగరంలో ఇంకా 30 కి పైగా షోలతో రన్ అవుతుంది. ఒక తెలుగు సినిమాకి ఆరు వారాల తరువాత కూడా ఇన్ని షోలు ఉండడం ఇదే ప్రథమం. బెంగళూరు నగరంలో అయిదు వారాలకు బాహుబలి సినిమాల తరువాత ఎక్కువ షోలు ప్రదర్శించిన సినిమాగా సరికొత్త రికార్డును లిఖించింది మహర్షి. అయిదు వారాల్లో 5595 షోలతో మహర్షి కొత్త చరిత్రను రాసింది.

బెంగళూర్ మీనాక్షి థియేటర్లో మహర్షి కేవలం నాలుగు వారాల్లోనే 34 లక్షల 79 వేలు వసూలు చేసి నెంబర్ 1 సౌత్ ఇండియన్ గ్రాసర్ గా నిలిచింది. మొత్తం లాంగ్ రన్ లో బెంగళూరు నగరంలో దాదాపు 6 కోట్లు వసూలు చేయబోయే ఏకైక సినిమాగా మహర్షి మరో రికార్డు నమోదు చేసేందుకు అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు.

మొత్తంమీద బెంగళూరు నగరంలో ఏ సౌత్ హీరో సృష్టించని రికార్డులు సృష్టిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇంకా ఆరో వారంలో ఒరిస్సాలో కూడా ఇంకా కొన్ని షోలు రన్ అవుతున్నాయి. అలాగే పూణేలో కూడా ఇంకా మహర్షి షోలు పడుతున్నాయి. నేషనల్ మల్టీప్లెక్స్ లలో గత అయిదు వారాంతాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా మహర్షి నిలిచింది.

ఈ ఘనాంకాలు ఇండియా మొత్తంలో ఉన్న మల్టీప్లెక్స్ లవి. ఇది మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ మరియు క్రేజ్ కు నిదర్శనంగా చెప్పవచ్చు. మహర్షి సినిమాలో రైతు సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించారు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు.

వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది. మొత్తం మీద తన 25వ సినిమాతో సూపర్ స్టార్ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకోవడంతోఅభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

మహర్షి మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా గడిపిన మహేష్, ఆమూవీ సక్సెస్ ని ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. జర్మనీ, ఇటలీ లో విహారం ముగించుకున్న మహేష్ అక్కడ నుండి నేరుగా ఇంగ్లాండ్ వెళ్లారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. దిల్‌ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా నటించనున్నారు.విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు కీలక పాత్రలు చేయనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు.

Share

Leave a Comment