‘మహర్షి’నీయం

ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చిన్నపని చెప్తే చేస్తారో లేదో కాని, అదే తెర మీద తమ అభిమాన నటుడిని అనుసరించడానికి ఏమాత్రం వెనుకాడదు నేటి యువతరం. అంతలా నాటి, నేటి తరంలో ఇమిడిపోయింది సినిమా. సినిమా అనేది ఓ దర్శకుని కల్పన. వాస్తవిక ఆధారాలతో తీసినా, కాల్పనిక అంశాలను కలగలిపి కంటిగింపుగా కనికట్టు చేస్తాడు దర్శకుడు. సినిమా చూసిన మరుక్షణం నుండి ఆ సినిమాలోని అంశాలు చాలా వరకు ప్రేక్షకులను ప్రభావితం చేసి ఆలోచింపజేస్తాయి. అలాంటి ఆలోచనను ప్రతి ప్రేక్షకుడిలో రేకెత్తించే సినిమా ‘మహర్షి’.

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం మహర్షి. మహేష్ కెరీర్‌లో 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి మైల్‌ స్టోన్ మూవీ కావటంతో దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ లాంటి బడా నిర్మాతలు కలిసి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా మూడు పాత్ర‌ల‌లో మ‌హేష్ అద‌ర‌గొట్టారు.

బ్రతకడానికి, బరువెక్కడానికి తప్ప మిగతా సమయమంతా స్మార్ట్ ఫోన్ లోనే మునిగి తేలుతున్న నేటి తరాన్ని తట్టి లేపాడు మహర్షి దర్శకుడు. నేటి సినిమా అంటే, అరకొర బట్టలతో అర్ధం పర్ధం లేని హావభావాలతో చూసే ప్రతి ప్రేక్షకుడి బలహీనతలను సొమ్ము చేసుకోవడమే. మంచిని చూపిస్తే జనం రారని, అందుకే చెడును ప్రోత్సహిస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారు ఎందరో సినీ నిర్మాతలు.

అందులో కొద్ది మంది మాత్రం సమాజచైతన్య స్ఫూర్తికి ప్రాధాన్యతనిస్తూ తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. కమర్షియల్, ఇమేజ్ పంథాని వదిలి కథా పరంగా సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. మంచికథ వున్నా పెట్టుబడి పేట్టే నిర్మాత, పేరున్న నటీనటులు అంత త్వరగా ముందుకు రారు. కాని వీటన్నిటినీ అధిగమించి మహర్షి సినిమాను మన ముందుకు తీసుకురాగలిగారు.

సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు మహర్షి ద్వారా ఒక అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ‘శ్రీమంతుడు’ సినిమాలో గ్రామాల దత్తత అంశాన్ని తీసుకొన్న మహేష్ బాబు ఆ తర్వాత ‘భరత్ అను నేను’ సినిమాలో రాజకీయాలను సృశించారు.

తాజాగా ‘మహర్షి’ సినిమాతో రైతుల గురించి చెప్పడంతో ఏకంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు. స్టార్ క‌థానాయ‌కుల సినిమాలంటే ఇలానే ఉండాలి అనే నియ‌మాన్ని ఎప్పుడో పక్కన పెట్టి కొత్త రూల్స్ ను రాసిన స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. క‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే ఏకైక స్టార్ ఆయన.

అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అలాంటి ఒక మంచి కథను ఎంచుకుని మ‌హర్షిగా మారారు. మహర్షి సినిమా ఏంటి, ఎలా వుంటుంది అన్న అంశాలు చెప్పడానికి మన మధ్య చాలా మాధ్యమాలే వున్నాయి.

వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమాకు ఎందుకు వెళ్ళకూడదు ? అనేదే ఈ విశ్లేషణ. ముందుగా చెట్లు పుట్టల వెంట చాటుమాటుగా తిరిగే వెర్రి యువతకు ఓ చిన్న సలహా. గంటలతరబడి కాలాన్ని వ్యర్ధం చేస్తూ పదిమందికి కనపడకుండా మీ ప్రేమాయణాన్ని నడుపుతున్న ఓ యువతా ఒక్కసారి మేల్కొని మీ ప్రియుడు లేదా ప్రియురాలిని ఒక్కసారి ఈ సినిమాకు తీసుకువెళ్ళగలిగితే మీరు వాళ్ళ దృష్టిలో ఎంతో ఎత్తుకు ఎదగడమే కాదు వారితో పాటు మీలో కూడా ఎంతో మార్పు వస్తుంది.

అలానే రోజంతా ఆఫీసు పనులతో అవసోపాలు పడుతూ ఉసూరుమంటూ ఇంటికి వచ్చి బల్లిలా బుల్లితరను అతుక్కుపోయే ఓ మధ్యతరగతీ నీలో కొంత మార్పును తీసుకువచ్చేది ఈ సినిమా. ఇక పబ్బులు, షికార్లు అంటూ బడా బాబుల జేబులు ఖాళీ చేసుకుంటున్న బలాదూర్ లకు ఈ సినిమా ఓ చెంపపెట్టు. వీకెండ్ కల్చర్ మొత్తాన్ని మొహం మొత్తేలా చెప్పింది ఈ సినిమా.

ఓ డబ్బులున్న మారాజులూ మీ వీకెండ్ మొత్తం ఒక్కసారి ఈ సినిమాకు వెచ్చించండి, మీరే కాదు, మీతోపాటు ఊగుతూ తాగుతున్న ప్రతి ఒక్కరూ మారతారు. మహర్షి సినిమా నేటి యువతరం పై ఎంత ప్రభావం చూపుతుందంటే ఇక నుండి వారి వీకెండ్ కల్చర్ ‘ వీకెండ్ అగ్రికల్చర్’ లా మారిపోతుందంటే అతిశయోక్తి కాదు. ఈ సినిమా చూసింతరువాత భూమిని నమ్ముకున్నవాళ్ళే ఎక్కువవుతారు తప్ప అమ్ముకునేవాళ్ళు అంతగా వుండరు.

తినే ప్రతి వాడు పండించాలి అన్న సిద్దాంతం నిజంగా అభినందనీయం. అందుకే ఈ సినిమాకు సామాన్యుడిని నుండి అతిరధమహారధులందరి మన్ననలు మిన్నంటుతున్నాయి. రైతు అంటే చిన్నచూపు, వ్యవసాయానికి నిరాధరణ లాంటి సామాజిక సమస్యల్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఎమోషనల్ జర్నీగా మహర్షి చిత్రాన్ని రూపొందించారు.

దేశానికి అన్నం పెట్టే రైతుని మర్చిపోకూడదని అలాగే అందరికీ వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహర్షి వీకెండ్ వ్యవసాయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అనేక మంది యువత పంటపొలాల్లో వ్యవసాయం చేస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ‘మహర్షి వీకెండ్ వ్యవసాయం’ పేరుతో ట్యాగ్ చేస్తున్నారు.

నగరాల్లో జీవిస్తూ, కార్పొరేట్ ఉద్యోగాలు చేయడానికి అలవాటు పడిపోతున్న ఈ తరం యువత వ్యవసాయానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. రైతులను, వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొసాగితే దేశానికి అన్నం పెట్టే రైతు లేకుండా పోతాడని, అది మనుష్యుల ఆరోగ్యకరమైన జీవిన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

ఎప్పటికప్పుడు సినిమాతో సమాజానికి ఏదైనా చెబుదాం అని మహేష్ ప్రయత్నిస్తున్న ప్రతీసారీ ప్రజలు కూడా ఆ సినిమాను బ్రహ్నరథం పడుతున్నారు. ఆఖరుగా ఒక్క మాట, గెలుపన్నది ధ్యేయంగా కాదు గెలుపన్నది నిరంతరం మన ప్రయాణంలో భాగమవ్వాలని అలాగే అన్నం పెట్టే ప్రతి రైతన్నకు మన వంతు సాయమందివ్వాలని ఈ సినిమాలో చూపించిన ప్రయత్నం నిజంగా మహర్షనీయం.

Share

Leave a Comment