ప్లేస్ అండ్ టైమ్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. ఏపీతో పాటు తెలంగాణలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రైతుల గురించి తీసిన సందేశాత్మక చిత్రం కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతోంది. బుధవారంతో విజయవంతంగా తొలివారం పూర్తి చేసుకున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 59.37 కోట్ల షేర్ రాబట్టింది.

దీంతో ఇప్పటి వరకు ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేసినట్లయింది. బాహుబలి, బాహుబలి 2 తర్వాత తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ ఫస్ట్ వీక్ షేర్ సాధించిన సినిమాగా నిలిచింది. ‘మహర్షి’ ఫస్ట్ వీక్ ఏరియా వైజ్ వసూళ్లు పరిశీలిస్తే నైజాంలో రూ. 21.67 కోట్లు, సీడెడ్ రూ. 7.45 కోట్లు, గుంటూరు రూ. 6.43 కోట్లు, కృష్ణ రూ. 4.28 కోట్లు, ఈస్ట్ గోదావరి రూ. 5.63 కోట్లు, వెస్ట్ గోదావరి రూ. 4.34 కోట్లు, ఉత్తరాంధ్ర రూ. 7.47 కోట్లు, నెల్లూరు రూ. 2.1 కోట్లు రాబట్టింది.

మహర్షి తొలివారం వరల్డ్ వైడ్ షేర్ దాదాపుగా రూ.79 కోట్లకు రీచ్ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక, తమిళనాడు, రెస్టాఫ్ ఇండియాలో మంచి వసూళ్లు సాధిస్తోంది. మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను’ రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. బాక్సాఫీసు వద్ద మహర్షి జోరు చూస్తుంటే ఫుల్ ర‌న్‌లో ఆ రికార్డులన్నీ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

మహర్షిలో చర్చించిన రైతు సమస్యలు, వీకెండ్ వ్యవసాయం వంటి వాటికి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. మహర్షిని స్ఫూర్తిగా తీసుకుని, చాలామంది వ్యవసాయం పట్ల అవగాహన పెంచుకుని, పొలాల బాట పడుతున్నారు. వీకెండ్ వ్యవసాయం పేరుతో జాబ్ చేస్తున్నవాళ్ళు సైతం సేద్యానికి సై అంటున్నారు. రికార్డులతో పాటు ప్రజల్లో ఆలోచనను కూడా రేకెత్తించాడు మహర్షి.

ఈ నేపథ్యంలో ‘మహర్షి’ గ్రాండ్ సక్సెస్ మీట్ విజయవాడలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడి సిద్ధార్థ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గ్రౌండ్ దీనికి వేదిక కాబోతోంది. మే 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్‌కు మహర్షి టీమ్ మొత్తం హాజరు కాబోతున్నారు.

మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ ల తో పాటు మహర్షి సినిమా కు పని చేసిన వారందరూ ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు అభిమానులు భారీ సంఖ్యలో తరలి రాబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో మహర్షి మరింత ప్రత్యేకంగా మారింది. రైతుల గురించి, వ్యసాయం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఒక మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించడంతో చాలా మందికి కనెక్ట్ అవుతోంది. అందుకే మహేష్ బాబు, వంశీ పైడిపల్లి కొంత మంది రైతులతో ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసారు.

‘మహర్షులతో మహర్షి’ పేరిట ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఆంధ్ర, తెలంగాణాలోని వివిధ ప్రాంతాలనుండి రైతులు హాజరయ్యారు. మహర్షి సినిమాలో చూపించినట్టు చాలామంది చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, వ్యవసాయం చేస్తున్నారు. రైతుల సమస్యలు, వాటి పరిష్కారాలు తెలుసుకుంటూ రైతుల ప్రయత్నాలను అభినందిస్తూ కార్యక్రమం అంతా వంశీ, మహేష్ చాలా ఎమోషనల్‌గా కనిపించారు.

రైతుకి కావాలసింది సింపతీ కాదు, రెస్పెక్ట్ అంటూ మహర్షి ద్వారా వ్యవసాయం గొప్పతనాన్ని తెలియచెప్పిన దర్శకుడు వంశీని, మహేష్‌ని రైతులు అందరూ అభినందించారు. తినే ప్రతి వాడు పండించాలి అన్న సిద్దాంతం నిజంగా అభినందనీయం. అందుకే ఈ సినిమాకు సామాన్యుడిని నుండి అతిరధమహారధులందరి మన్ననలు మిన్నంటుతున్నాయి.

రైతు అంటే చిన్నచూపు, వ్యవసాయానికి నిరాధరణ లాంటి సామాజిక సమస్యల్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఎమోషనల్ జర్నీగా మహర్షి చిత్రాన్ని రూపొందించారు. దేశానికి అన్నం పెట్టే రైతుని మర్చిపోకూడదని అలాగే అందరికీ వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేశారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహర్షి వీకెండ్ వ్యవసాయానికి అనూహ్య స్పందన లభిస్తోంది.

అనేక మంది యువత పంటపొలాల్లో వ్యవసాయం చేస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ‘మహర్షి వీకెండ్ వ్యవసాయం’ పేరుతో ట్యాగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సినిమాతో సమాజానికి ఏదైనా చెబుదాం అని మహేష్ ప్రయత్నిస్తున్న ప్రతీసారీ ప్రజలు కూడా ఆ సినిమాను బ్రహ్నరథం పడుతున్నారు. ఆఖరుగా ఒక్క మాట, గెలుపన్నది ధ్యేయంగా కాదు గెలుపన్నది నిరంతరం మన ప్రయాణంలో భాగమవ్వాలని అలాగే అన్నం పెట్టే ప్రతి రైతన్నకు మన వంతు సాయమందివ్వాలని ఈ సినిమాలో చూపించిన ప్రయత్నం నిజంగా మహర్షనీయం.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెడ్గే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. ఇంకా అనన్య, మీనాక్షి దీక్షిత్, జగపతి బాబు, సాయి కుమార్, ముఖేష్ రిషి, ప్రకాష్ రాజ్, నాజర్, పోసాని, జయసుధ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మాతలు.

Share

Leave a Comment