సీఎం టు స్టూడెంట్

హీరోలు సాధారణంగా కెరీర్ ఆరంభంలో స్టూడెంట్ క్యారెక్టర్లు చేస్తారు. ఆ తర్వాత బరువైన, లార్జర్ దన్ లైఫ్ క్యారెక్టర్లలోకి వెళ్తుంటారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ఇప్పుడు దీనికి భిన్నమైన మలుపు తీసుకుంది. మహేష్ గత సినిమా ‘భరత్ అనే నేను’లో ఏకంగా ముఖ్యమంత్రి పాత్ర వేసేశారు.

ఆ పాత్ర కొంచెం భారమైందే అయినా మహేష్ తన ఇమేజ్‌ తో ఆ పాత్రను కన్విన్సింగ్‌గా పోషించి ప్రేక్షకుల మెప్పు పొందేలా చేశారు. ఐతే సీఎంలో కనిపించిన హీరో తర్వాతి సినిమాకే స్టూడెంట్ పాత్రలోకి మారిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. నిన్న రిలీజైన మహేష్ కొత్త సినిమా ‘మహర్షి’ ఫస్ట్ లుక్, టీజర్లలో స్టూడెంట్ అవతారంలో కనిపించి ఆశ్చర్యపరిచారు మహేష్.

‘మహర్షి’లో మహేష్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా ఇంతకుముందే రూమర్లు వినిపించాయి. కానీ ఇప్పుడు మహేష్ అలాంటి పాత్ర చేస్తారా అని సందేహించారు. కానీ అది నిజమే అని రుజువైంది. ఏదో మొక్కుబడిగా స్టూడెంట్ పాత్ర చేస్తున్నట్లు కాకుండా సగటు కుర్రాడి లాగే అమ్మాయిల వైపు కొంటెగా చూడటం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు సూపర్ స్టార్. సీఎం టు స్టూడెంట్ వాట్ ఎ మేకోవర్ అనకుండా ఉండలేకపోతున్నారు సినీ ప్రేక్షకులు.

మహేష్ బాబు ఆరడుగుల అందగాడు. అలా నడిచొస్తుంటే అమ్మాయిలు తన వంకే చూస్తుండిపోతారు. కానీ ఫర్‌ ఏ చేంజ్‌ అమ్మాయిల పైపు సరదాగా చూసే తుంటరి కాలేజీ స్టూడెంట్‌ పాత్రలో మహేష్ కనిపిస్తే? అభిమానులకు పండుగే. అలాంటి పాత్రలోనే మహేష్ ని చూపించబోతున్నారు దర్శకుడు వంశీ పైడిపల్లి.

ఎప్పుడూ డీసెంట్ క్యారెక్టర్లు చేసే మహేష్ ఇలా కనిపించడం విశేషమే. మరి సినిమా మొత్తంలో అతను ఎలా కనిపిస్తాడు, అతడి క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది అన్నది అప్పుడే చర్చనీయాంశమైంది. కేవలం ఒక ఎపిసోడ్ వరకు విద్యార్థి పాత్రలో కనిపిస్తారా లేక మొత్తంగా అతను స్టూడెంటేనా అని చర్చించుకుంటున్నారు అభిమానులు. మొత్తానికి మహేష్ లుక్, క్యారెక్టర్ విషయంలో కనిపించిన మేకోవర్‌తో అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

అశ్వనీదత్, ‘దిల్‌’ రాజు, పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది మహేష్ 25వ చిత్రం. ఇందులో ‘అల్లరి’ నరేష్ రవి అనే పాత్రలో మహేష్ బాబు ఫ్రెండ్‌గా కనిపించనున్నారు. డెహ్రాడూన్‌లో ఫస్ట్‌ షెడ్యూల్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ 12న గోవాలో స్టార్ట్‌ కానుంది. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్‌, కెమెరా కె.యు. మోహనన్‌.

Share

Leave a Comment