ఆ కళ్లన్నీ మహేష్ వైపే

టాలీవుడ్ లో అందగాడు అనగానే టక్కున చెప్పే పేరు మహేష్ బాబు. అందం ఒక్కటే కాదు అంతకుమించి అభినయం తన సొంతం. మహేష్ కు ఎంత క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ స్టార్స్ లో కూడా మహేష్ లాంటి అందగాడు లేడంటే అతిశయోక్తి కాదు.

హాలీవుడ్ కటౌట్ తో టాలీవుడ్ ను ఏలుతున్నాడు. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా మహేష్ క్రేజ్ మాత్రం చెక్కుచెదరదు. అతడి అడుగు పడితే వెండితెర ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. అతడు అభినయిస్తే ఆ సినిమా హుందాగా నడుస్తుంది. తెలుగు సినిమా వెలుగులో అభిమానులకు ఆకాశమంత ఆనందాన్ని పంచుతున్నాడు.

ఎప్పటికప్పుడు తనలో కొత్తదనాన్ని తానే తవ్వుకుని తనకుతానుగా నిలబడ్డాడు. సూపర్ స్టార్‌ కృష్ణ వారసుడిగా పరిచయం అయినా ఆ వాసనలు కూడా తనకు తగలనివ్వలేదు. వేసిన ప్రతి అడుగులోనూ తన ప్రత్యేకత చూపాడు. మహేష్‌ అంటే ఇదీ అని అభిమానులు చెప్పుకునేందుకు అతడికంటూ సినీప్రపంచంలో కొన్ని పేజీలను లిఖించుకుంటూనే ఉన్నాడు.

ప్రతి ఒక్కరి కెరీర్‌లోనూ ఎత్తుపల్లాలు ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడాలి. అలా నిలబడ్డప్పుడే రియల్‌ లైఫ్‌లో అయినా, రీల్‌ లైఫ్‌లో అయినా వారిని హీరో అంటారు. మహేష్‌ అలానే నిలదొక్కుకున్నాడు. మహేష్‌ గురించి మాట్లాడుకునేప్పుడు ఓ నలుగురి దర్శకుల గురించి తప్పక మాట్లాడుకోవాలి.

తనలోని మరో కోణాన్ని మరింత అందంగా చూపించడానికి కృష్ణవంశీ ఎదురుచూస్తున్న రోజులవి. తనదైన స్టయిల్లో తెరనిండుగా వెలుగును నింపగల క్రియేటివ్‌ జీనియస్‌ ఒక హీరో కోసం ఎదురు చూస్తున్న సమయం అది… సరిగ్గా అప్పడే మహేష్‌తో జోడీ కుదిరింది. తెలుగు సినిమా మర్చిపోలేని సినిమా పుట్టుంది. అలా వచ్చిన మురారీ మహేష్‌ కెరీర్‌లోనూ ప్రత్యేకమైన సినిమా అయింది.

అద్భుతమైన టాలెంట్‌ ఉన్న గుణశేఖర్‌ దగ్గర అంతే అద్భుతమైన స్క్రిప్ట్‌ ఒకటుంది. దానికి ఒక హీరో అవసరం పడింది. అప్పుడు అతని కళ్లూ మహేష్‌ బాబు వైపే చూశాయి. ఆ కాంబినేషన్లో వచ్చిన ఒక్కడు సినిమా ప్రభావం ఇప్పటికీ ఎన్నో సినిమాల్లో కనిపిస్తూనే ఉంటుంది. అటు గుణశేఖర్‌నూ, ఇటు మహేష్‌నూ మాస్‌ ఆడియన్స్‌కు దగ్గర చేసింది.

ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఒక గొప్ప చిత్రాన్ని అందించాడానికి మహేష్ వైపే చూశారు. త్రివిక్రమ్ లాంటి మాటల మాంత్రికుడు కి మహేష్ దొరికితే ఇంకేముంది మరింత మాయ చేశాడు. అప్పటి వరకు హీరోయిజం అంటే పెద్ద పెద్ద సంభాషణలు, అరుపులు ఉండేవి. అతడు చిత్రం తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మహేష్ తన నట విశ్వరూపం చూపించాడు.

ఒకే ఒక్క పంచ్‌ డైలాగ్‌తో హీరో ఇమేజ్‌ను ఎక్కడో ఆకాశాన నిలబెట్టగల పూరీజగన్నాథ్‌కు ఒక హిట్‌ కావాల్సిన సమయం అది… అప్పుడు మహేష్‌తో కాంబినేషన్‌ సెట్‌ అయింది. అలా వాళ్లిద్దరూ కలిసి కొడితే… బాక్సాఫీస్‌ దిమ్మ తిరిగిపోయింది. అప్పటివరకూ ఉన్న చాలా రికార్డులను చెరిపేసి… పోకిరి కొత్త రికార్డులను రాసింది.

కేవలం ఈ నలుగురే కాకుండా ఏం చూపించినా సరే ప్రేమగా చూపించగల కొరటాల శివకు ఒక స్టార్‌ హీరో కావాల్సొచ్చింది. అతని కథకు వంద శాతం న్యాయం చేసేందుకు మహేష్‌తో జోడీ కట్టాడు. కొరటాల మాటలు, మహేష్‌ నోటినుంచి రాలుతుంటే బాక్సాఫీస్‌ జేబులు నిండిపోయాయి. అలా శ్రీమంతుడు అనే మంచి సినిమా పుట్టింది.

తమని తాము నిరూపించుకోడానికీ, తమ విజయాన్ని బిగ్గరగా వినిపించడానికీ వీరందరికీ ఒక హీరో అవసరమయ్యాడు. వారికున్న టాలెంట్‌కు సరైన కథానాయకుడు కావాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఆ కళ్లన్నీ మహేష్ వైపే చూశాయి. వారు రాసుకున్న అక్షరాలూ, కలలు కన్న సన్నివేశాలూ మహేష్‌ను కలవరించాయి.

అందమైన మనసున్న పాత్రలను ఎంచుకుంటాడు. వాటిలో మనిషితనం ఉంటుంది. మంచితనం ఉంటుంది. అసలైన హీరోయిజం ఉంటుంది. అవే అవే మహేష్‌ను ప్రేక్షకుల గుండెల్లో నిలబెట్టాయి. సూపర్‌ స్టార్‌ని చేశాయి. అందుకే మహేష్ కి యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది.

మహేష్‌ రీల్‌ లైఫ్‌లోనే కాదు… రియల్‌ లైఫ్‌లోనూ హీరోనే. ఒక కొడుకుగా, భర్తగా, తండ్రిగా అంతటా హీరోగానే ఉన్నాడు. అభివృద్ధిలో వెనకబడ్డ గ్రామాలను దత్తత తీసుకుని, సమాజానికీ హీరో అనిపించుకున్నాడు. తాను ఎక్కడైనా హీరోనే అనీ, మనసున్న హీరో అనీ నిరూపించుకున్నాడు. కెరీర్‌లో మరిన్ని విజయాలను సాధించాలనీ, ఎప్పుడైనా ఎక్కడైనా అలా హీరోలానే ఉండాలనీ కోరుకుందాం.

Share

Leave a Comment