భయపడకండి..జాగ్రత్తపడండి ..!

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. చైనా దేశంలో పుట్టిన ఈ మహమ్మారి వైరస్ ఇప్పటికే ప్రపంచంలోని 145 కు పైగా దేశాల్లో పాగా వేసి వేలాదిమందికి బలిగొంది. దీంతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ కొన్ని సూచనలు ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు రియాక్ట్ అవుతూ అందరికీ అర్ధమయ్యే విధంగా ఓ వీడియో పోస్ట్ చేస్తూ సందేశమిచ్చారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పలు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని ట్విటర్‌ వేదికగా సూచించారు.

COVID -19 నుంచి తప్పించుకోవడానికి సామాజిక దూరం పాటించడమే అసలైన మార్గం. ఇది కష్టకాలమే. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రజారోగ్యం దృష్ట్యా మన సామాజిక సమయాన్ని త్యాగం చేయాల్సిన సమయం ఇది. తప్పనిసరి అయితే తప్ప వీలనంత ఎక్కువగా ఇంట్లోనే ఉండటం మంచిది అని పేర్కొన్నారు మహేష్ బాబు.

దీంతో పాటు ఆయన షేర్ చేసిన వీడియో ప్రతీ ఒక్కరికీ అసలు విషయాన్ని సున్నితంగా చెప్పేసింది. అగ్గిపుల్లల వరుసతో అందరికీ అర్థమయ్యేలా సూపర్ మెసేజ్ ఇచ్చారు మన సూపర్ స్టార్. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన ప్రకటనను కూడా తన ట్వీట్‌లో మహేష్ పొందుపరిచారు.

ఈ ప్రకటనలో కరోనా వైరస్ సోకకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్పష్టంగా వెల్లడించారు. ఒకవేళ ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా బాధ్యతగల పౌరునిగా డాక్టర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు. మరోవైపు వైరస్‌ కారణంగా టాలీవుడ్‌తో సహా అన్ని చిత్రపరిశ్రమలు షూటింగ్స్‌ను వాయిదా వేశాయి.

మనమందరం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి, ఆహారం తీసుకునే ముందు బయటికి వెళ్లొచ్చిన తరవాత చేతులను సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కు కారడం, దగ్గు ఉంటే కచ్చితంగా మాస్క్ ధరించాలి. సానిటైజర్‌తో చేతులను శుభ్రపరుచుకోవడం, ముక్కు కారడం, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

మీడియాలో వస్తోన్న కొన్ని కథనాలు కూడా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అయితే, ప్రజలు భయపడాల్సింది ఏమీ లేదని కాస్త జాగ్రత్తగా ఉంటే చాలని వైద్యులు చెబుతున్నారు. తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కూడా ఇదే సూచిస్తోంది. ప్రజల్లో కరోనా భయాన్ని పోగొట్టేందుకు ఇప్పుడు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రంగంలోకి దిగారు.

ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సహా కొందరు స్టార్స్ కరోనా పట్ల జాగ్రత్తలు చెబుతూ కొన్ని సూచనలిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ఆరు సూత్రాలు పాటిస్తే కరోనా వైరస్‌ బారిన పడకుండా కాపాడుకోవచ్చని వారు సూచించారు.

Share

Leave a Comment