యాక్షన్ మూడ్‌లో మేజర్

అగ్ర కథానాయకుడి సినిమా అంటే ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి. అలాంటిది విడుదల తేదీని ఖరారు చేశాకే సరిలేరు నీకెవ్వరు చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో స‌రిలేరు నీకెవ్వ‌రు తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

స్క్రిప్టు వర్క్.. షెడ్యూల్స్.. రిలీజ్ తేదీ సహా ప్రతిదీ ఎంతో క్లారిటీగా వెళుతున్న అనీల్ రావిపూడి చెప్పిన దాని ప్రకారమే షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకొంటోందీ సినిమా. కొన్నాళ్ల కిందటే కశ్మీర్‌లో తొలి షెడ్యూల్‌ని పూర్తి చేసుకొని, హైదరాబాద్‌కి తిరిగొచ్చింది చిత్రబృందం. ఆ వెంటనే రైలు ప్రయాణం నేపథ్యంలో సాగే కీలక సన్నివేశాల్ని పూర్తి చేసింది.

ఫ‌స్ట్ హాఫ్‌లో హిలేరియస్‌గా సాగే ఈ ట్రైన్ ఎపిసోడ్‌ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ సినిమాలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక నేటి నుంచి అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వ్ర్యంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు.

అంటే మేజర్ యాక్షన్ మూడ్ లోకి వెలుతున్నారు అనమాట. త్వరలోనే రామోజీ ఫిలింసిటీలో వేసిన కొండారెడ్డి బురుజు సెట్‌ నేపథ్యంలో చిత్రీకరణ జరపబోతున్నారు. ఇక్కడే సరిలేరు నీకెవ్వరు ద్వితీయార్థానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఈ వేగం గమనించినవాళ్లు ఎవరైనా మీ జోరుకి సరిలేరెవ్వరూ అనాల్సిందే!

వచ్చే సంక్రాంతికే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించారు కాబట్టి కథానాయకుడు మహేష్‌బాబు విరామం లేకుండా ఉత్సాహంగా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. అదే ఉత్సాహం దర్శకుడు అనిల్‌ రావిపూడిలోనూ కనిపిస్తోంది. అందుకే ఈ జోరు. మరో పక్క 13 ఏళ్ళ తరువాత విజయశాంతి గారు షూటింగ్ లో పాల్గొన్నారు.

ఆవిడకి అనిల్ రావిపూడి, మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా సాదర స్వాగతం పలికారు. విజయశాంతి సన్నివేశాలను హైదరాబాద్ నల్సార్ లా కాలేజీలో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. మరి ఆవిడ పాత్రేంటో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.

మరి అనిల్ రావిపూడి వారి కాంబినేషన్ ను ఎలా ప్రెజెంట్ చేశాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడక తప్పదు. ఈ చిత్రంలో ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఆశక్తికర ఫొటోను షేర్ చేసారు. అనిల్ తన సిస్టర్స్ తో అని తను, సంగీత, రంజిత ఉన్న ఫొటోను పోస్ట్ చేసారు రష్మిక.

నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్. సంక్రాంతి 2020 రిలీజ్ టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి అందుకు సౌకర్యవంతంగా సినిమాని పూర్తి చేసి ప్రచారానికి ప్లాన్ చేశారు. ఇక మునుముందు ఈ సినిమాకి సంబంధించి మరిన్ని సంగతులు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ రైలు కూత పెట్టింది మొదలు పరుగే పరుగు అన్నట్లు నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేస్తుంది సరిలేరు నీకెవ్వరు టీమ్.

ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారన్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment