ఆ రెండూ కలిపితే సరిలేరు నీకెవ్వరు

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ చిత్రానికి సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది.

కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. చిత్రంలోని మహేష్ బాబు పాత్ర పేరు అనిల్‌ రావిపూడి తాజాగా రివీల్ చేసారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మేజర్ అజయ్ కృష్ణ గా మారారని, కాశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. పోకిరిలో కృష్ణ మనోహర్ ఐపీఎస్‌గా కనిపించిన మహేష్ బాబు ఒక్కడులో అజయ్ వర్మ. దూకుడులో అజయ్ కుమార్ ఐపీఎస్‌గా నటించాడు. సరిలేరు నీకెవ్వరులో పోకిరిలో కృష్ణ, ఒక్కడు, దూకుడులో అజయ్ కలిపి మేజర్ అజయ్ కృష్ణగా అలరించనున్నారు.

ఆ చిత్రాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఆ పేరు కూడా కలిసి ఉండడం మరో హిట్టు సెంటిమెంట్ గా వారు భావిస్తున్నారు. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీ, యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయట. చాన్నాళ్ళ తరువాత విజయశాంతి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ మధ్యలో అద్భుతమైన కామెడీ సీన్స్ ఉంటాయని తెలిపారు అనిల్ రావిపూడి.

డైరెక్టర్ అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి కొదవే ఉండదు. అదే తరహాలో తన రెగ్యులర్ పంథాలోనే సరిలేరు నీకెవ్వరులో కూడా కామెడీ పండించాలని ఆయన భావిస్తున్నారట. మహేష్ బాబును హైలైట్ చేస్తూ ఈ కామెడీ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట డైరెక్టర్. మహేష్ తన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ కామెడీ పండించి చాలా రోజులు అయ్యింది.

కాబట్టి ఈ వార్త అధికారికం కాకపోయినా మహేష్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. ఏదైనా సినిమా పనిచేసినప్పుడు ఆ సినిమాకు సంబందించిన కొన్ని అంశాలని వేరే సినిమాలకు పాటిస్తుంటారు కొందరు హీరోలు, దర్శకులు, నిర్మాతలు. అలాంటి వారిలో అనిల్ సుంకర కూడా ఒకరు. గతంలో మహేష్ బాబు చేసిన సూపర్ హిట్ సినిమా దూకుడు నిర్మాతల్లో అనిల్ సుంకర కూడా ఒకరు.

అప్పట్లో దూకుడు ఎంతటి సంచలనాలను నెలకొల్పిందో మనకు తెలిసిన విషయమే. ఆ సినిమా మొదలయ్యే సమయంలో అనిల్ సుంకర తన స్నేహితులకు, సినిమా యూనిట్ సభ్యులకు దూకుడు టైటిల్ లోగోతో కీ చైన్స్ ప్రెజెంట్ చేశారు. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచి అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటినీ తిరగరాసింది. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు నిర్మాణంలో కూడా అనిల్ సుంకర భాగస్వామ్యంలో ఉన్నారు.

అనిల్ సుంకర అప్పట్లో చేసినట్టే సరిలేరు నీకెవ్వరు టైటిల్ లోగోతో సన్నిహితులకు కీ చైన్స్ అందజేశారు. ఈ కీచైన్స్ అందుకున్న కొంతమంది ప్రముఖులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరి ఈసారి సరిలేరు నీకెవ్వరు తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో? దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. కొన్ని పాటల రికార్డింగ్‌ పూర్తయింది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి, మహర్షి సూపర్ హిట్ తరువాత మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Share

Leave a Comment