సరిలేరు నీకెవ్వరు కి విజన్

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా మహర్షితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన తన 26వ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్నారు.

ఈ చిత్రానికి సరిలేరు నీకెవ్వరు అనే టైటిల్ ను ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే సినిమా తొలి షెడ్యూల్‌ కాశ్మీర్‌లో ప్రారంభ‌మైంది.

మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ నటిస్తున్నారని అనీల్ రావిపూడి స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా రివీల్ చేయడంతో క్యూరియాసిటీ పెరిగింది. మహేష్ కెరీర్ లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి ఛాయాగ్రాహకుడు ఎవరు? అంటే ఇప్పటివరకూ సరైన క్లూ ఏదీ అందలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.రత్నవేలు ఇటీవల చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది కాబట్టి పూర్తిగా సరిలేరు నీకెవ్వరు టీమ్ కి అందుబాటులోకి వచ్చారని తెలిసింది. రత్నవేలు జాతీయ స్థాయి అత్యుత్తమ ఛాయాగ్రాహకుడు అనడంలో సందేహం లేదు.

మహేష్ తో 1 నేనొక్కడినే, బ్రహ్మోత్సవం చిత్రాలకు రత్నవేలు ఇప్పటికే ఛాయాగ్రహణం అందించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకి పని చేస్తున్నారన్నది ఆ టీమ్ కి శుభవార్తనే. చాలా సందర్భాల్లో రత్నవేలు తన ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ అని వేదికలపైనే పొగిడేసిన మహేష్ కి మరోసారి తనతోనే పని చేసే అవకాశం రావడం హ్యాపీ మూవ్ మెంట్ అనే చెప్పాలి.

సరిలేరు చిత్రానికి భారీ సెట్ వర్క్ అవసరం ఉందని తెలుస్తోంది. అలాంటి సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ అనుభవం పెద్ద ప్లస్ కానుంది. భారీ వీఎఫ్ ఎక్స్ అవసరం ఉన్న సినిమాలకు పని చేసిన అనుభవం అతడి సొంతం కాబట్టి ఇది సరిలేరు బృందానికి పెద్ద ప్లస్. ఈ సినిమా షూటింగ్ ను శెరవేగంగా షూట్ చేస్తున్నారు. కాశ్మీర్ షూట్ పూర్తవ్వగానే హైదరాబాద్ లో షూట్ జరుగుతుంది.

మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనీల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ నటన లో ఎలాంటి వైవిధ్యం చూడబోతున్నాం అన్న ఎగ్జయిట్ మెంట్ అభిమానుల్లో కనిపిస్తోంది. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఈ చిత్రంలో దేశభక్తితో పాటు, కామెడీ, యాక్షన్ ఎలెమెంట్స్ కూడా ఉంటాయట. చాన్నాళ్ళ తరువాత విజయశాంతి గారు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక రాజేంద్రప్రసాద్, జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి కొదవే ఉండదు.

అదే తరహాలో తన రెగ్యులర్ పంథాలోనే సరిలేరు నీకెవ్వరులో కూడా కామెడీ పండించాలని ఆయన భావిస్తున్నారట. మహేష్ బాబును హైలైట్ చేస్తూ ఈ కామెడీ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట డైరెక్టర్. మహేష్ తన సినిమాల్లో ఫుల్ లెంగ్త్ కామెడీ పండించి చాలా రోజులు అయ్యింది. కాబట్టి ఈ వార్త అధికారికం కాకపోయినా మహేష్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.

దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. భరత్ అనే నేను, మ‌హ‌ర్షి సినిమాల త‌ర్వాత వరుసగా మ‌హేష్ తో మూడో సినిమా ప‌ని చేస్తున్నాడు ఈయ‌న‌. అంతే కాకుండా ఈ సారి ఖచ్చితంగా మాస్ సాంగ్ ఇస్తా అని సినిమా ఓపెనింగ్ ప్రెస్‌మీట్ లో ప్రామిస్ చేసి మరీ చెప్పడంతో అభిమానులు ఈ సినిమా పాటల కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. ఎఫ్ 2 సూపర్ హిట్ తరువాత అనిల్ రావిపూడి, మహర్షి సూపర్ హిట్ తరువాత మహేష్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ప్రారంభానికి ముందే సరిలేరు నీకెవ్వరు సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Share

Leave a Comment