సరిలేరు నీకెవ్వరు మొదటిరోజు వసూళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన యాక్షన్, కామెడీ డ్రామా సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి సందర్భంగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అనిల్ ఈ సినిమాను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా మలిచాడు. దీంతో మొదటి షో నుండే ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర అలరిస్తోంది.

ఇటు దర్శకుడు, అటూ నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మహేష్ బాబు అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు కావాల్సిన హంగుల్నీ అర్బాటాల్నీ, ఇతర కమర్షియల్ మసాలాను మిస్సవకుండ జాగ్రత్త పడ్డారు. ఈ సినిమాలో ముఖ్యంగా అనిల్ తన బలమైన కామెడీని మిస్ చేయకుండా అప్పుడప్పుడూ యాక్షన్ సీన్స్‌తో కావాల్సినప్పుడల్లా తగిన మోతాదులో సెంటిమెంట్ డ్రామాతో సినిమాను ఎంగెేజింగ్‌గా తీశాడు.

ముఖ్యంగా మహేష్ యాక్షన్ అండ్ కామెడీ టైమింగ్ మరియు ఎనర్జిటిక్ స్టెప్స్ కి ప్రేక్షకులు ఫిదా ఐపోయారు. నిన్న భారీ అంచనాల మధ్య మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ దక్కించుకున్న సరిలేరు నీకెవ్వరు వసూళ్ల పర్వం మొదలుపెట్టింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావటం, అడ్వాన్స్‌ బుకింగ్స్ కూడా అదే స్థాయిలో జరగటంతో సరిలేరు నీకెవ్వరు తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు 32.77 కోట్ల షేర్‌ సాధించింది.

ఓవర్‌ సీస్‌తో పాటు ఇతర రాష్ట్రాల వసూళ్లు కూడా కలుపుకుంటే ఈ లెక్క ఇంకా భారీగా ఉండనుంది. నైజాంలో మొదటి రోజు సరిలేరు నీకెవ్వరు రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ చిత్రం మొదటి రోజు నైజాంలో 8.66 కోట్ల షేర్ రాబట్టింది. ఈ కలెక్షన్స్ మహేష్ కెరీర్ లోనే బెస్ట్ నైజాం ఫస్ట్ డే ఓపెనింగ్‌గా నిలిచాయి.

నైజాంతో పాటు మరికొన్ని ఏరియాల్లో కూడా మహర్షి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. కృష్ణ జిల్లాలో సరిలేరు నీకెవ్వరు జోరు కొనసాగింది. తొలి రోజు రూ. 3.07 కోట్లు వసూలు చేసింది. కృష్ణ జిల్లాలో ఇవి కనీ వినీ ఎరుగని వసూళ్ళు. తెలుగు సినిమా చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైమ్ రికార్డు. గుంటూరులో ఈ చిత్రం తొలి రోజు రూ. 5.15 కోట్ల షేర్ వసూలు చేసింది.

మరో వైపు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏరియాల్లో తొలి రోజు అద్భుతమైన వసూళ్లు సాధించింది. వెస్ట్ గోదావరిలో తొలి రోజు రూ. 2.72 కోట్ల షేర్ రాబట్టింది సరిలేరు నీకెవ్వరు. ఈస్ట్ గోదావరి లో కూడా తొలి రోజే రూ. 3.35 కోట్లు వసూలు చేసింది. నెల్లూరులో తొలి రోజు 1.27 కోట్లు రూపాయల షేర్ ను సాధించింది. ఉత్తరాంధ్రా లో తొలి రోజు కలెక్షన్లు 4.4 కోట్లుగా నమోదయ్యాయి.

అలాగే సీడెడ్ లో 4.15 కోట్లను రాబట్టింది సరిలేరు నీకెవ్వరు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 32.77 కోట్ల షేర్ ను వసూలు చేసింది సరిలేరు నీకెవ్వరు. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్‌సీస్ కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. అవన్నీ కలుపుకుంటే ఇంకా భారీగా మొదటి రోజు వసూళ్ళు ఉంటాయి. ఈ చిత్రం తో మహేష్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ ను రాబట్టుకున్నాడు.

రాబోయే రోజుల్లో మహర్షి వసూళ్ల రికార్డులు మరిన్ని కొల్లగొడతాడని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అతిపెద్ద సినిమా సీజన్ గా భావించే సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరు రానున్న రోజులలో మరిన్ని మెరుగైన వసూళ్లు సాధించే అవకాశం కలదు. దర్శకుడు అనిల్ రావిపూడి కంప్లీట్ కమర్షియల్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేయడం జరిగింది. మహేష్ కెరీర్ మొత్తంలో అత్యంత ఉత్సాహభరితమైన పాత్రల్లో అజయ్ క్యారెక్టర్ ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. మహేష్ అభిమానులు మాత్రమే కాదు మిగతా ప్రేక్షకులు కూడా మహేష్ ను ఇలాంటి పాత్రలో చూసి ఇష్టపడతారు. అంత ఎనర్జిటిగ్గా, సరదాగా సాగుతుంది మహేష్ పాత్ర.

చాలాకాలం తర్వాత తెరపై కనిపించిన విజయశాంతి భారతిగా పవర్‌ఫుల్‌ పాత్రలో అలరించారు. ఆమె సహజమైన అభినయం, డైలాగ్‌ డెలివరీ సినిమాకు ఒకింత నిండుతనం తెచ్చాయి. ఇక, హీరోయిన్‌గా రష్మిక మందన్నా మహేష్ సరసన తనదైన ఎనర్జిటిక్‌ యాక్టింగ్‌తో అలరించింది. మినిస్టర్‌ నాగేంద్రగా విలన్‌ పాత్రలో కనిపించిన ప్రకాష్ రాజ్‌ తన పాత్ర మేరకు అలరించారు. ఇక, రాజేంద్రప్రసాద్‌, సంగీత, రావు రమేశ్‌, హరితేజ తదితర నటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

Share

Leave a Comment