ఇండియన్ ఆర్మీ కోసం

వచ్చే ఏడాది సంక్రాంతికి రాబోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్ విషయంలో అందరి కంటే ముందుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటుంది. ఇటీవలే ప్రిన్స్ పుట్టిన రోజు విశేషంగా ఫస్ట్ లుక్ వీడియోని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు యూనిట్ తాజాగా భారత స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఇంకో వీడియోను విడుదల చేసింది.

ట్రిబ్యూట్ టు ఇండియన్ సోల్జర్ పేరుతో సరిలేరు నీకెవ్వరు టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసింది యూనిట్. దేశ భద్రత కోసం సరిహద్దుల్లో సైనికులు అహో రాత్రాలు మనకోసం పడుతున్న కష్టం చేస్తున్న త్యాగాన్ని వివరిస్తూ ఇప్పటిదాకా చరిత్రలో జరిగిన అతి కీలక యుద్ధ ఘట్టాలను సంవత్సరాలతో సహా పొందుపరుస్తూ అప్పటి విజువల్స్ ని చూపించిన తీరు ఆకట్టుకునేలా ఉంది.

1971 ఇండో-పాక్‌ వార్‌, సియాచిన్‌ వివాదం, కార్గిల్‌ యుద్ధం, 2016 సర్జికల్‌ స్ట్రైక్స్‌ చిత్రాలను చూపించారు. ఆయా దృశ్యాలన్నీ రోమాంచితంగా ఉన్నాయి. వీడియో చివరిలో మాత్రమే మహేష్ సైనికుడి లుక్ ని రివీల్ చేసి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. మహేష్ బాబు తొలిసారిగా ఈ చిత్రంలో ఆర్మీఆఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

మేజ‌ర్ అజ‌య్ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు మహేష్. ఆర్మీ మేజర్ అజయ్ కృష్ణగా మహేష్ బాబు కనిపించేది సినిమా మొత్తం కాదని, కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే అని తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ సినిమా మొదటి భాగంలో వస్తుందని, ఆ తర్వాత అసలు సినిమా కథలోకి ఎంటరవుతుందని టాక్. ఇంత సీరియస్ గా ఉన్న థీమ్ సాంగ్ ని చాలా కాలం తర్వాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాదే రాయడం విశేషం.

దీపక్ బ్లూ పాడగా కోరస్ సహకారంతో మంచి ఫీల్ వచ్చేలా దీని కంపోజిషన్ జరిగింది. భగ భగ భగ మండే నిప్పుల వర్షం వచ్చినా జనగణమంటూ దూకేవాడు సైనికుడు అంటూ మొదలైన ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. భరత్ అనే నేను తరహలో ఈ టైటిల్ సాంగ్ కూడా మైండ్ లో ఎక్కేసి వైరల్ అయ్యే లాగా ఉంది.

దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను, శత్రు సైన్యం ముందు నిర్భయంగా నిల్చున్న ప్రతి సైనికుడిని నమస్కరిద్దామని మహేష్ బాబు ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఆయన సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి స్వేచ్ఛకు విలువ ఇవ్వండని మహేష్ పిలుపునిచ్చారు.

కాశ్మీర్, హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న సరిలేరు నీకెవ్వరు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ ని ప్లాన్ చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో యాక్షన్ సీన్ ను తెరకెక్కించనున్నట్లు సమాచారం. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వ్ర్యంలో ఈ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. రష్మిక మందన్న హీరొయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ ని వేయడం ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది.

ఇక్కడే సరిలేరు నీకెవ్వరు ద్వితీయార్థానికి సంబంధించి కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. ఈ వేగం గమనించినవాళ్లు ఎవరైనా మీ జోరుకి సరిలేరెవ్వరూ అనాల్సిందే! విజయశాంతి కూడా ఇటీవలే జాయిన్ అయిన సంగతి తెలిసిందే. విజయశాంతి సన్నివేశాలను హైదరాబాద్ నల్సార్ లా కాలేజీలో చిత్రీకరించినట్లు సమాచారం. మరి ఆవిడ పాత్రేంటో అని అందరూ ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

మహేష్, విజయశాంతి కాంబినేషన్ సీన్స్ పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అనిల్ రావిపూడి వారి కాంబినేషన్ ను ఎలా ప్రెజెంట్ చేశాడో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం 2019 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేసి డిసెంబర్ ఆద్యంతం ప్రమోషన్స్ చేయాలన్నది ప్లాన్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేష్ బాబులు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Share

Leave a Comment